RamCharan: రామ్ చరణ్, ‘పెద్ది’పై ఎందుకింత నెగిటివిటీ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ట్రైలర్ విడుదలైంది మొదలు పెద్ద ఎత్తున సినిమాపై ట్రోలింగ్ ప్రారంభమైంది. బీభత్సమైన నెగిటివిటీని చూస్తున్నాం. సోషల్ మీడియా ఒకరకంగా విషం చిమ్ముతోంది. సినిమా చూడకుండానే పోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎందుకిలా? ఎందుకింత నెగిటివిటీ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ట్రైలర్ విడుదలైంది మొదలు పెద్ద ఎత్తున సినిమాపై ట్రోలింగ్ ప్రారంభమైంది. బీభత్సమైన నెగిటివిటీని చూస్తున్నాం. సోషల్ మీడియా ఒకరకంగా విషం చిమ్ముతోంది. సినిమా చూడకుండానే పోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎందుకిలా? ఎందుకింత నెగిటివిటీ? రామ్ చరణ్ మాట్లాడినా ట్రోలింగే.. ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సాన.. చెర్రీ గురించి మాట్లాడినా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ అంతలా ట్రోల్ చేస్తున్నదెవరు?
ఒకటైతే ఇబ్బంది లేదు..
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ట్రైలర్ విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలుండేవి. కానీ ట్రైలర్ విడుదల అనంతరం మాత్రం కొంచెం తగ్గాయి. ట్రోల్స్ ప్రభావం ఎంతో కొంత అయితే సినిమాపై ఉందని చెప్పక తప్పదు. ఈ చిత్రంలో ట్రైలర్‌ను బట్టి రామ్ చరణ్.. క్రికెటర్‌గానూ.. పెహల్వాన్ గానూ.. అథ్లెట్‌గానూ కనిపించనున్నాడు. వాస్తవానికి ఏదో ఒకటి అయితే పెద్దగా ఇబ్బందేం లేదు కానీ ఇలా ఒక ప్లేయర్ ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కొంత కష్టమే. ఇది చూసిన తర్వాతనే నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మంది దీనిని ట్రోల్ చేస్తూ రీల్ చేశారు. ఒకరిద్దరైతే ఏకంగా స్టోరీ చెప్పేసి.. దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతోందని.. అది ఏ పాయింట్‌పై అనేది కూడా చెప్పేశారు.
రకరకాల రీల్స్, మీమ్స్..
అది చాలదన్నట్టుగా రామ్ చరణ్ ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు మాట్లాడినా రచ్చవుతోంది. బుచ్చిబాబు సాన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్ తనను ఒడిలో కూర్చోబెట్టుకుని భోజనం తినిపించారని చెప్పారు. అంతే.. దానిని నెట్టింట బీభత్సంగా రచ్చ చేస్తున్నారు. రకరకాల రీల్స్, మీమ్స్‌తో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్.. భోపాల్‌లో బూమ్రా గురించి చెప్పిన మాటలను కూడా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి తనకు ఫుట్‌బాల్ అంటే ఇష్టమని.. దానిని ప్రమోట్ చేస్తున్న బూమ్రా అంటే కూడా తనకు ఇష్టమన్నట్టుగా చెర్రీ చెప్పాడు. కానీ బూమ్రా ఫుట్‌బాల్ ప్లేయర్ అని రామ్ చరణ్ చెప్పినట్టుగా ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.
ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలే లేవు..
అసలు ఎందుకింతలా చెర్రీపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారన్నది కూడా అంతుబట్టకుండా ఉంది. వాస్తవానికి రామ్ చరణ్ తన పని తాను చేసుకుపోతుంటారు. ఎప్పుడూ కూడా కనీసం ఫ్యాన్స్‌పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. చివరకు తనకు ట్విన్స్ పుట్టిన సమయంలో క్లింకారతో హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు చెర్రీ చేతిలో పసిపాప ఉందన్న కనీస ఇంగితం లేకుండా ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఆయనపై పడిపోయిన తరుణంలోనూ కించిత్తు కోపం కానీ.. అసహనం కానీ కనిపించనివ్వలేదు. అలాంటి చెర్రీపై ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. చాలా కష్టపడి చేసిన సినిమా. పైగా దానిపై ఎందరో భవిష్యత్ ఆధారపడి ఉంది. దానిపై విషం చిమ్మితే నష్టపోయేది ఒక్కరు కాదు.. వందల మంది. ట్రోలర్స్ దీనిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని సినీ పండితులు చెబుతున్నారు.
ప్రజావాణి చీదిరాల