తండ్రీకొడుకుల అనుబంధంతో హృదయానికి హత్తుకునే ‘ఐయామ్ హ్యాండ్సమ్’
తండ్రీకొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కిన చిత్రమే ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.
తండ్రీకొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కిన చిత్రమే ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్‌పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించిన ఈ సినిమాలో అన్విష హీరోయిన్. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా విజయానికి అసలు బలం కంటెంట్ అని... మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయన్నారు. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ.. తాను ఏలూరుకు చెందినవాడినని.. తన తండ్రి అరటిపండ్ల వ్యాపారి అని తెలిపాడు. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకవేళ తన సినిమా నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నానన్నారు. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని.. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారన్నారు.
నిర్మాత కేదార్‌నాథ్ మాట్లాడుతూ.. మంచి కథను నమ్మి ఈ సినిమాను నిర్మించామని... తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు తెరకెక్కించారన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారన్నారు. సంగీత దర్శకుడు ఎన్ఎస్ ప్రసూ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నారు. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించినట్టు తెలిపారు. పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయన్నారు. హీరోయిన్ అన్విష మాట్లాడుతూ.. తమ సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కథ వినగానే చాలా బాగా నచ్చిందని... ఇందులో బలమైన భావోద్వేగాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, తండ్రి-కొడుకుల మధ్య సాగే అనుబంధం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, హృదయాన్ని తాకే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా హీరో దుర్గా దేవ్ నాయుడు పాత్ర, భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.