Entertainment

JD Chakravarthy: ‘గాయపడ్డ సింహం’లు రెండు కాదు మూడు.. త్వరలోనే రివీల్ చేస్తాం..

ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు తాను కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని... కానీ ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం తనకు వచ్చిందన్నారు.

JD Chakravarthy: ‘గాయపడ్డ సింహం’లు రెండు కాదు మూడు.. త్వరలోనే రివీల్ చేస్తాం..

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి చేస్తున్న చిత్రం 'గాయపడ్డ సింహం'. పవన్ సాధినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో జేడి చక్రవర్తి ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టు షేడ్స్‌లో కనిపిస్తా..

‘గాయపడ్డ సింహం’లో ఆయన ధర్మ పాత్రలో నటించారు. క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందన్నారు. అలాగే ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు తాను కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని... కానీ ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం తనకు వచ్చిందన్నారు. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశానని చక్రవర్తి తెలిపారు. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలేనని అన్నారు. కానీ ఈ చిత్రం విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించడం తనను చాలా ఎక్సైట్ చేసిందన్నారు. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలన్నారు. రెండు షేడ్స్‌లో కనిపించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పడం లేదు కానీ కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరిందని చక్రవర్తి పేర్కొన్నారు.

ఆ సినిమా ఆడలే..

ఏ సినిమా అయినా కథ వర్కవుట్ అయితేనే సినిమా ఆడుతుందని జేడీ చక్రవర్తి అన్నారు. ‘శివ’లో తన క్యారెక్టర్ అయిన జేడీ తన పేరుగా మారిపోయిందన్నారు. కానీ కథ వర్కౌట్ కాకపోతే మాత్రం క్యారెక్టర్లు నిలవవని అన్నారు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదని.. తన కెరీర్‌లో ఫేవరెట్ క్యారెక్టర్ 'వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్' అని.. కానీ ఆ పాత్ర వర్కవుట్ అయ్యింది కానీ సినిమా ఆడలేదన్నారు. ‘గాయపడ్డ సింహం’లో తొలుత తరుణ్ భాస్కర్ గాయపడ్డాడని.. ఆ తరువాత తన కథలోకి ఎంటరై తను.. మరో సింహం కూడా గాయపడిందన్నారు. ఆ సింహం ఎవరనేది త్వరలోనే రివీల్ చేస్తామని చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కథను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందులో ధర్మా క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహస్, ఇంకో పాత్ర ఇవన్నీ కలిసి చేసే హంగామా చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

నవ్వుతూనే ఉన్నా..

డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌కి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ లు చేసిన మంచి అనుభవం ఉందని జేడీ చక్రవర్తి తెలిపారు. తన స్టైల్ చాలా నచ్చిందని.. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడని.. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో సినిమా తీశాడని చెప్పారు. ఈ చిత్రంలో చేసిన తను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నామని.. అందుకే దీనిని డైరెక్టర్స్ ఫిల్మ్ అన్నట్టుగా చక్రవర్తి పేర్కొన్నారు. కతనకు కథ వినగానే హిలేరియస్‌గా అనిపించిందని.. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని తెలిపారు. మళ్లీ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు వస్తే తప్పక చేస్తానని చక్రవర్తి తెలిపారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని.. హీరో, విలన్ అని బేరీజు వేసుకోనన్నారు. కథ కొత్తగా ఉంటే చేయాలనిపిస్తుందన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 23, 2026 2:22 PM