నలుగురు రాక్షసుల చేతుల్లో థియేటర్లు.. ప్లీజ్ సేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
ఇండస్ట్రీ కొందరి కబంధ హస్తాల్లో నలుగుతోందా? చిన్న సినిమాలపై ఆ కొందరు కనీసం కనికరం కూడా చూపడం లేదా? సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దానిని విడుదల చేయడం దర్శక-నిర్మాతలకు అంతకు మించిన భారమవుతోందా?
ఇండస్ట్రీ కొందరి కబంధ హస్తాల్లో నలుగుతోందా? చిన్న సినిమాలపై ఆ కొందరు కనీసం కనికరం కూడా చూపడం లేదా? సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దానిని విడుదల చేయడం దర్శక-నిర్మాతలకు అంతకు మించిన భారమవుతోందా? అనే మిలియన్ డాలర్ ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ నటుడి ఆవేదన మరోసారి ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
పుట్టుకతోనే ఎవరూ గోల్డెన్ స్ఫూన్‌తో పుట్టరు. ఎంతో శ్రమిస్తే ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారు. వారు చాలా ఉదాత్తంగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే కష్టం విలువ వారికి తెలుసు కాబట్టి. కానీ వారి వారసులకు అంతటి ఉదాత్త భావన ఉండదు. ప్రముఖులెవరైనా సినిమా తీస్తే ఉన్న థియేటర్లన్నీ వారికి కట్టబెట్టేస్తారు. కానీ అదే సాధారణ వ్యక్తులు సినిమా తీస్తే మాత్రం విడుదలకు పురుటి నొప్పులు పడాల్సిందే. థియేటర్లివ్వరు.. తీసిన సినిమాను ఏం చేయాలో అర్థం కాదు.. అప్పటికే అప్పో సొప్పో తెచ్చి కోట్లు ఖర్చు బెట్టిన వారు వాటిని తీర్చలేక ఎంతో వేదన అనుభవిస్తున్నారు.
కట్ చేస్తే ఇది రీరిలీజ్‌ల కాలం. పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందేం లేదు. కానీ చిన్న సినిమా వారికే ఇబ్బంది. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను రీ-రిలీజ్ చేయాలని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ భావించారు. కానీ ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వలేదట. నైజాంలో ఒక్కటంటే ఒక్క థియేటర్‌ను కూడా ఇవ్వలేదని.. చిన్న సినిమాలను తొక్కేస్తున్నారంటూ షెరాజ్ మెహదీ కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ నలుగురి చేతుల్లో బంధీ అయిపోయిందన్నారు. తన సినిమాకు థియేటర్లు దక్కక డిప్రెషన్‌లో ఉన్నానని.. తనకేమైనా అయితే వారే బాధ్యులని అన్నారు. “ప్లీజ్ సేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ” అంటూ షెరాజ్ మెహదీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు సినిమా థియేటర్ వ్యవస్థ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని షెరాజ్ మెహదీ ఆరోపించారు. ముఖ్యంగా నలుగురు రాక్షసుల చేతుల్లో సినిమా థియేటర్లు ఉన్నాయని.. చిన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై తాను లీగల్‌గా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని.. ఇదే కొనసాగితే మున్ముందు చిన్న సినిమాలు పూర్తిగా ప్రమాదంలో పడతాయన్నారు. ప్రస్తుతం తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని షెరాజ్ మెహదీ పేర్కొన్నారు. తనకు ఏమైనా జరిగితే దిల్ రాజు, దగ్గుబాటి సురేష్‌బాబు, బిజిలి, ఏషియన్ సునీల్ వంటి వారే కారణమంటూ ఆవేదనకు గురయ్యారు. ఐనాక్స్, ఏషియన్ థియేటర్ వ్యవస్థలో కూడా ముందుగా హామీ ఇచ్చినా థియేటర్లు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
తెలుగు పరిశ్రమలో చిన్న సినిమాలను వ్యవస్థాత్మకంగా అణగదొక్కుతున్నారని.. చిన్న సినిమాల మూవీ మేకర్లు చనిపోతున్నారని షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సినిమాలను కూడా చంపేస్తున్నారని... ప్రపంచంలో ఎక్కడా లేని దారుణ పరిస్థితి ఇక్కడ ఉందని.. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదని అన్నారు. షెరాజ్ మెహదీ దర్శకత్వంలో రూపొందిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం గతంలో తెలుగుతో పాటు కన్నడలోనూ ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై మంచి టాక్‌ను సంపాదించిందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.