Sing Geetham Review: ‘సింగ్ గీతం’ ఒక అద్భుత ప్రయోగం..
అప్పట్లో కాబట్టి కొన్ని సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు చేసినా అవి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. కానీ ఇప్పుడు అవే సినిమాలను తీస్తే ప్రేక్షకులు మూకుమ్మడిగా ఓటేయడం కొంత కష్టమే. మరి అలాంటి తరుణంలో వచ్చిన ‘సింగ్ గీతం’ ఎలా ఉంది?
చిత్రం: సింగ్ గీతం
విడుదల: 12-06-2026
నటీనటులు: . అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నాగ్ అశ్విన్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రయోగాలనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందునా ప్రస్తుతం యూత్ సూపర్ ఫాస్ట్. ఈ సమయంలో ప్రయోగం అనేది చేసినా కూడా రాజమౌళి మాదిరిగానో.. ప్రశాంత్ నీల్ మాదిరిగానో చేయాలి తప్ప.. సంగీతంతో ప్రయోగాలు చేసేంత సాహసం దాదాపుగా ఎవరూ చేయరనే చెప్పాలి. అప్పట్లో కాబట్టి కొన్ని సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు చేసినా అవి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. కానీ ఇప్పుడు అవే సినిమాలను తీస్తే ప్రేక్షకులు మూకుమ్మడిగా ఓటేయడం కొంత కష్టమే. మరి అలాంటి తరుణంలో వచ్చిన ‘సింగ్ గీతం’ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? చూద్దాం.
కథేంటంటే..
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ప్రతాప్ మన్నెం (అయాన్)కి తన తండ్రి ఆస్తి పేపర్లు లభిస్తాయి. ఆ ఆస్తి కుబేరపురం అనే ఊరిలో ఉందని తెలుసుకుంటాడు. వెంటనే ఆ ఊరికి ప్రయాణమవుతాడు. ఈ ఊరికి వచ్చీ రాగానే గౌరి(అహిల్య)ను కలుస్తాడు. ఆమె రేణు(షాలిని) దగ్గరకు తీసుకెళుతుంది. అప్పటికే తన తండ్రికి చెందిన గోల్డ్ మైన్‌ను రేణు అమ్మకానికి పెడుతుంది. ఒక నకిలీ ప్రతాప్‌ను సృష్టించి ఆ పేపర్లపై సంతకాలు చేయించాలని చూస్తుంది. ఆ సమయంలో అసలు ప్రతాప్ ఎంటరై విషయం తెలుసుకుని.. రేణుతో చేతులు కలుపుతాడు. తనకు ఆ మైన్‌లో 50 శాతం వచ్చేలా డీల్ మాట్లాడి మైనింగ్ అమ్మకానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలోనే గౌరి ప్రాణంగా చూసుకుంటున్న చెట్టుని ప్రతాప్ తన మైనింగ్ కోసం కొట్టిస్తాడు. గౌరి ఎంతగానో బాధపడుతుంది. ఆ తరువాత సడెన్‌గా ఊరిలోని వారందరికీ మాట పోయి.. దాని స్థానంలో పాట వస్తుంది. అసలు పాట రావడమేంటి? ఏం చెప్పాలనుకున్నా పాటలో చెప్పడమేంటి? తిరిగి వారికి మాట ఎలా వచ్చింది? అసలు ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? పచ్చగా ఉన్న కుబేరపురం పాడుబడిన గ్రామంగా మారడానికి కారణమేంటి? శైలజమ్మ ఎవరు? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
‘సింగ్ గీతం’ అనేది ఒక అద్భుతమైన, అరుదైన ప్రయోగం.. సినిమాను దాదాపుగా పాటతో నడిపించి ప్రేక్షకులను మెప్పించాలనుకోవడం పెద్ద సాహసమే. కానీ ఆ సాహసాన్ని సింగీతం శ్రీనివాసరావు చేశారు. 94 ఏళ్ల వయసులో ఆయన చేసిన ప్రయోగానికి మెచ్చుకోకుండా ఉండలేం. ఫస్ట్ హాఫ్ అంతా ప్రతాప్.. కుబేరపురానికి రావడం.. అక్కడి వారి పరిచయం.. మైనింగ్ కోసం చెట్టును నరికించేయడం, అందరి నోట మాట పోయి పాట రావడం వంటి అంశాలతో రూపొందించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కథను మలుపు తిప్పేశారు. సెకండ్ హాఫ్ అంతా ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్. కుబేరపురం అలా అవడానికి కారణాలను చెప్పి మంచి మెసేజ్‌తో ముగించారు. ముగింపు కూడా ఒక స్టార్ హీరోతో ఎంట్రీ ఇప్పించి మరీ అద్భుతంగా ముగించారు. ఇక సినిమా క్లాస్ పీపుల్‌కి చాలా బాగా నచ్చుతుంది. చాలా కాలం తర్వాత మనసుకు నచ్చిన ఒక ఆర్ట్ ఫిలిం చూసిన భావన కలుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా ఇవ్వాలి. పాటలతో సినిమా సాగుతున్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా.. ఈ తరానికి నచ్చేలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఈ తరహా సినిమా అనేది ఇండియన్ హిస్టరీలోనే ప్రథమమని చెప్పాలి. కానీ మాస్ ఆడియన్స్‌కు ఎంత మేర కనెక్ట్
ఎవరెలా నటించారంటే..
ఈ కథలో మెయిన్ పాత్రధారులైన అహిల్య, అయాన్, షాలినిల నటన చాలా సహజంగా అనిపించింది. ఎవరూ కూడా నటిస్తున్న భావన కలగదు. భారీ మేకప్‌లు, భారీ ఎలివేషన్స్ వంటివి ఏమీ లేదు. సాధారణ విలేజ్‌లో పీపుల్ ఎలా ఉంటారో ఈ సినిమాలో నటీనటులంతా అలాగే ఉంటారు. ఇక శివనారాయణ, బెనర్జీ, తులసి వంటి వారు సైతం తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రధానంగా చెప్పాలి. అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రూపొందించిన తీరు అద్భుతమనే చెప్పాలి. మనసును రంజింపచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేశారు. మ్యూజిక్‌లో ఏమాత్రం లోపమున్నా సినిమానే పాడయ్యేది కానీ అలాంటిదేమీ కలగనీయలేదు. పైగా ఈ తరానికి నచ్చేలా మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత నాగ్ అశ్విన్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవకుండా సినిమాను రూపొందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది.
ఫైనల్‌గా.. ‘సింగ్ గీతం’ మనసును రంజింపజేసే చిత్రం
రేటింగ్: 3.5/5