Police Complaint Review: ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ ఎలా ఉందంటే..
ఈ క్రమంలోనే హారర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? లేదా? తెలుసుకుందాం.
చిత్రం: పోలీస్ కంప్లైంట్
విడుదల: 12-06-2026
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, కృతి వర్మ తదితరులు
దర్శకత్వం: సంజీవ్ మేగోటి
మ్యూజిక్: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మెగోటి, సుధాకర్ మారియో
ప్రస్తుత తరుణంలో హారర్, థ్రిల్లర్ జానర్ హవా నడుస్తోంది. ఈ అంశాలతో సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దానిని ఎక్కడా థ్రిల్ మిస్ అవకుండా రూపొందించడం మరో ఎత్తు. థ్రిల్ కంటిన్యూ అయితేనే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లేదంటే కష్టమే. ఈ క్రమంలోనే హారర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? లేదా? తెలుసుకుందాం.
కథేంటంటే..
ఒక గర్భిణి మహిళ దారుణ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే ఉత్కంఠభరితమైన కథ ప్రారంభమవుతుంది. తొలుత క్షుద్రపూజల నేపథ్యంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తారు. అంతేకాకుండా సరైన ఆధారాలు లేక సంవత్సరాల పాటు ముందుకు సాగదు. ఈ క్రమంలోనే ‘అద్వైత’ అనే చిన్నారి “నాకు డాడీ కావాలి” అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అక్కడి నుంచి అసలు కథ, అసలు సిసలైన ఉత్కంఠ ప్రారంభమవుతుంది. అనూహ్యంగా పాప ఎవరినైతే ‘డాడీ’ అని పిలుస్తుందో, వారంతా ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటారు. అదొక పెద్ద మిస్టరీగా మారిపోతుంది. ఈ వరుస మరణాల మిస్టరీని ఛేదించడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన వరలక్ష్మి శరత్‌కుమార్ రంగంలోకి దిగుతుంది. అసలు వరుస మరణాల వెనుక ఉన్న కారణమేంటి? వరలక్ష్మి భర్త డాక్టర్ రామ్ (నవీన్ చంద్ర) సంగతేంటి? వరుస హత్యల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఈ మరణాలకు అతీంద్రియ శక్తులే కారణమా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
దర్శకుడు సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ (కర్మ సిద్ధాంతం) అనే వినూత్నమైన కాన్సెప్ట్ ఆధారంగా కథ రాసుకున్నారు. దానిని హారర్ థ్రిల్లర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో హారర్, మిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ నడిపించిన తీరు అద్భుతం. సినిమా మొదటి భాగం అంతా మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఆ తరువాత ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. వరలక్ష్మి నిర్వహించే కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడే రహస్యాలు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తాయి. అంతేకాకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సినిమాకు ప్రాణం పోశాయి.
ఎవరెలా నటించారంటే..
నవీన్ చంద్ర తన పాత్రలో ఒదిగిపోయారు. వైద్యుడిగా సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దర్యాప్తునకు సంబంధించిన కీలక సీన్లలో ఆయన జీవించేశారనే చెప్పాలి. ఇక పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్లిష్టమైన భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. హీరో కృష్ణసాయికి ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది. ఆయన కూడా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా చిత్రంలో పొందుపరిచిన ప్రత్యేక గీతంలో ఆయన స్టెప్పులేసి అందరినీ బాగా ఆకట్టుకున్నారు. రాగిణి ద్వివేది గ్లామర్‌తో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. జెమిని సురేష్, విజయభాస్కర్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను ప్రెజెంట్ చేసిన తీరు చాలా బాగుంది. సస్పెన్స్‌ను ఎక్కడా రివీల్ కాకుండా చూశారు. స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఆకట్టుకుంది. ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను ఆయన అద్భుతంగా విజువలైజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ చిత్రాలకు బీజీఎం ప్రాణం. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన బీజీఎం సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
ఫైనల్‌గా.. హారర్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారిని ‘పోలీస్ కంప్లైంట్’ ఏమాత్రం డిజప్పాయింట్ చేయదు.
రేటింగ్: 3/5