Entertainment

Palli Chattambi: తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా?

మలయాళ సినిమాలకు తెలుగునాట ఆదరణ చాలా ఎక్కువ. ఈ చిత్రాలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మలయాళంలో కూడా భారీ కమర్షియల్ చిత్రాలు కూడా వస్తుంటాయి. అలాంటి భారీ కమర్షియల్ చిత్రమే ‘పళ్లి చట్టంబి’.

Palli Chattambi: తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా?

చిత్రం: పళ్లి చట్టంబి

నటీనటులు: టొవినో థామస్, కయాదు లోహర్, పృథ్వీరాజ్ సుకుమారన్, శత్రు, సిద్ధిక్

దర్శకుడు: డిజో జోస్

మ్యూజిక్: జేక్స్ బిజోయ్

ప్రొడ్యూసర్: నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ సినిమాలకు తెలుగునాట ఆదరణ చాలా ఎక్కువ. ఈ చిత్రాలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మలయాళంలో కూడా భారీ కమర్షియల్ చిత్రాలు కూడా వస్తుంటాయి. అలాంటి భారీ కమర్షియల్ చిత్రమే ‘పళ్లి చట్టంబి’. టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు. 1930లో కేరళలో జరిగిన కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే..

1930లో కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ఈ కథ మొదలవుతుంది. బ్రిటీష్ పోలీసులను సైతం నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వణికిస్తుంటాడు. జనాలను చంపేస్తుంటాడు. కట్ చేస్తే కథ 1957కి షిఫ్ట్ అవుతుంది. ఆ సమయంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వ భూసంస్కరణలు, భూస్వాముల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే చర్చి భూములను రక్షించుకునేందుకు చర్చి ఫాదర్స్ పాటుపడుతూ ఉంటారు. ఓ చర్చి భూములను కాపాడటం కోసం కృష్ణ పిళ్లై (టోవినో థామస్) అనే హిందూ యువకుడు పోతన్ క్రిష్టోఫర్‌గా రంగంలోకి దిగుతాడు. అతడి శౌర్య పరాక్రమాలను చూసిన చర్చి ఫాదర్ కృష్ణ పిళ్లైని ‘పళ్లి చట్టంబి’గా నియమిస్తారు. ఆ తరువాత రెబెక్కా (కయాదు లోహార్) కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుంది. రెబెక్కాను చూసిన కృష్ణ పిళ్లై ఆమెతో ప్రేమలో పడతాడు. అసలే కమ్యూనిస్టులకు, చర్చిల వారికి పడదు. మరి వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన చర్చి ఫాదర్ ఏం చేస్తారు? అసలు నంబియార్ ఎవరు? కృష్ణ పిళ్లై చర్చి భూములను కాపాడగలిగాడా? అన్నది వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

మలయాళ చిత్రాలు దాదాపుగా బలమైన కథతో మనల్ని మెస్మరైజ్ చేస్తుంటాయి. కానీ ఇలా భారీ కమర్షియల్ చిత్రాలను తీసేటప్పుడే కాస్త జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ‘పళ్లి చట్టంబి’ దీనికేం మినహాయింపు కాదు. బలమైన కథ ఉండటం ఒక ఎత్తైతే.. దానిని అద్భుతంగా మలచి ప్రెజెంట్ చేయడం మరో ఎత్తు. అలా మలచడంలోనే దర్శకుడు తడబడ్డారేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. కేరళకు సంబంధించిన కథ కాబట్టి దానిపై వారికి అంతో ఇంతో అవగాహన ఉంటుంది కాబట్టి మలయాళ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకోవచ్చు. తెలుగు వారికి ఏమాత్రం రుచించని కథ ఇది. సినిమా ప్రారంభమే కాస్త గందరగోళంగానూ.. ఎందుకు ప్రజలను అంతలా హింసిస్తున్నారనేది సగటు ప్రేక్షకుడు మనసు పెడితే తప్ప అర్థం కాదు. ఇక ఆ తరువాత 1930ల నాటి గతాన్ని 1950లతో ముడిపెట్టడం కొంతవరకూ ఆసక్తికరమే కానీ అవి వండి వార్చడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది.

ఎవరెలా నటించారంటే..

టొవినో థామస్, కయాదుల నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కయాదు స్క్రీన్‌పై కనిపించేది కొద్ది సేపే అయినా కూగా ఆమె పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్.. కొద్ది క్షణాల పాటు కనిపించినా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రతో మెప్పించాడు. శత్రు, సిద్ధిక్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు డిజో జోస్ అయితే కథను ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డారు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘పళ్లి చట్టంబి’ తెలుగు వారిని మెప్పించడం కష్టమే.

రేటింగ్: 2/5

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 16, 2026 2:25 PM