Entertainment

Colony Circus Movie Review: ‘కాలనీ సర్కస్’ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే..

ఇటీవలి కాలంలో పిరియాడిక్, టీవీని బేస్ చేసుకుని మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ‘శుభం’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తదితర చిత్రాలన్నీ ఈ కోవకు చెందినవే. తాజాగా ఈటీవీ విన్‌లో సైతం టీవీని బేస్ చేసుకుని రూపొందిన మూవీ ఒకటి విడుదలైంది. అసలు ఆ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా? చూద్దాం.

Colony Circus Movie Review: ‘కాలనీ సర్కస్’ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే..

చిత్రం: కాలనీ సర్కస్

విడుదల: 24-05-2026

నటీనటులు: వెంకటేశ్ మహా, ఉద్విత హర్ష, మాస్టర్ ఆరవ్, కిరీటి దామరాజు, రేవతి నేత, అక్షయ్ సత్యనారాయణ, మల్లేశ్వరి

దర్శకుడు: శశాంక్ పోసింసెట్టి

సంగీతం - జెవి సుధాంషు

ఎడిటర్ - సృజన్ శర్మ కపిల

నిర్మాత: రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా

ఇటీవలి కాలంలో పిరియాడిక్, టీవీని బేస్ చేసుకుని మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ‘శుభం’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తదితర చిత్రాలన్నీ ఈ కోవకు చెందినవే. తాజాగా ఈటీవీ విన్‌లో సైతం టీవీని బేస్ చేసుకుని ఒక మూవీని రూపొందింది. ఈటీవీ కథాసుధలో భాగంగా రూపొందించిన ఈ షార్ట్ . మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా? చూద్దాం.

కథేంటంటే..

ఓ కాలనీలో సూర్యనారాయణ, గోవిందరావు, సుభాష్ తదితర ఫ్యామిలీలు ఉంటాయి. విభిన్న మనస్తత్వాలు కలిగిన మనుషులు.. ఒకరు రెస్పెక్ట్ కోసం ఎదురు చూస్తుంటే మరొకరు తను చేసే ఉద్యోగం గొప్పదని తనను అంతకు మించి గౌరవించాలని భావిస్తూ ఉంటారు. సూర్యనారాయణ మ్యాథ్స్ టీచర్. ఆయనకు రెస్పెక్టే ప్రధానం. భార్య, కొడుకు మొదలు కాలనీ వాసులంతా తనకు గౌరవమివ్వాలని భావిస్తూ ఉంటాడు. గోవిందరావు.. కలెక్టరేట్‌లో క్లర్క్‌గా చేస్తూ ఉంటాడు. ఆయనతో జనాలు ఎక్కువగా కలివిడిగా ఉంటున్నారని.. ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వట్లేదని ఫీలవుతూ ఉంటాడు సూర్య నారాయణ. కాలనీలోని వారంతా సాయంకాలం వేళ లేడీస్ అంతా సీరియల్ చూసేందుకు టీవీ ఉన్న ఒకరింటికి వెళతారు.. జెంట్స్ అంతా వార్తలు చూసేందుకు మరొకరి ఇంటికి వెళతారు. అయితే ఆ రెండిళ్లలోనూ బ్లాక్ అండ్ వైట్ టీవీలే ఉంటాయి. తనకు అక్కడ తగిన గౌరవం దక్కడం లేదని భావించిన సూర్యనారాయణ దాని కోసం ఒక ప్లాన్ చేస్తాడు. అదేంటి? దాని తరువాత వచ్చే పరిణామాలేంటి? చివరకు కథ ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఇదొక దాదాపు గంట సేపు మాత్రమే ఉండే సినిమా. విభిన్న మనస్తత్వాలను హైలైట్ చేస్తూనే సరదాగా సాయంకాలం వేళ అంతా ఒకచోట చేరడం.. ఆ సమయంలోనూ చిన్న చిన్న ఈగోస్ కారణంగా మనుషులు దగ్గరగా ఉన్నా కూడా మనసులు దూరంగా ఉండటం వంటివి చాలా ఆసక్తికరంగా దర్శకుడు శశాంక్ చూపించారు. వాస్తవానికి దాదాపుగా ఇలాంటి చోట్ల లేడీస్ మధ్య ఈగో క్లాషెస్‌ను హైలైట్ చేస్తుంటారు కానీ ఈ చిత్రంలో మాత్రం రెస్పెక్ట్ కోసం ఎదురు చూసే వ్యక్తుల మధ్య ఈగోను చూపించారు. అది కూడా పైకి గొడవలేమీ ఉండవు కానీ వారి ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయనేది చక్కగా చూపించారు. చివరకు ఒక మంచి ముగింపు ఇచ్చారు. అయితే మనం ఏదో ఊహిస్తూ ఉంటాం కానీ ఏమీ లేకుండా సింపుల్‌గా ముగించేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సింపుల్‌ కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ కాలనీ సర్కస్ నచ్చుతుంది. కాస్త ట్విస్ట్‌లు.. రొటీన్ కథలకు అలవాటుపడిన వారికి మాత్రం అంతగా ఇది కనెక్ట్ కాదు.

ఎవరెలా నటించారంటే..

సూర్యనారాయణగా వెంకటేశ్ మహా తన పాత్రలో ఒదిగిపోయారు. కొడుకు నుంచి కూడా గౌరవం ఆశిస్తూ రెస్పెక్ట్ కోసం తహతహలాడే లెక్కల మాస్టారిలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో చెప్పుకోదగిన మరో పాత్ర కిరీటి. కలెక్టరేట్‌లో క్లర్క్‌గా నటించారు. హాయిగా నవ్వుతూ కనిపిస్తాడు. పెద్దగా ఈయన పాత్రకు డైలాగ్స్ అయితే ఏమీ లేవు కానీ మెయిన్ క్యారెక్టర్‌లలో ఒకరు. మాస్టర్ ఆరవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే పిల్లవాడు. తనను క్రికెట్ చూడనివ్వడం లేదని బాధపడుతూ ఉంటాడు. ఆరవ్ కూడా చాలా చక్కగా నటించాడు. ఉద్విత హర్ష, రేవతి నేత, అక్షయ్ సత్యనారాయణ, మల్లేశ్వరి తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ పరంగా కూడా సినిమా బాగుంది కానీ దర్శకుడు మరింత కథను ఆసక్తికరంగా రాసుకుని ఉంటే బాగుండేది. కాలనీ సర్కస్ టైటిల్‌కు పెద్దగా జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయారనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. ‘కాలనీ సర్కస్’ పర్వాలేదనిపిస్తుంది

రేటింగ్: 2.75/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 23, 2026 12:23 PM