Srikanth: 'మిస్టర్ మిడిల్ క్లాస్' ఫ్యామిలీ మొత్తానికి కనెక్ట్ అవుతుంది..
చాలా రోజుల తర్వాత హీరోగా తన సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. కమలాకర్ ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పడంతో వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను.
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్‌గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్‌క్లాస్’. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్‌ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత హీరోగా తన సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. కమలాకర్ ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పడంతో వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అని తెలిసిన తర్వాత తన కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందన్నారు. మిడిల్ క్లాస్ చిత్రం ఫ్యామిలీ మొత్తానికి కనెక్ట్ అవుతుందన్నారు. చాలా కాలం తర్వాత అలాంటి చక్కని సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. సినిమా చేస్తున్నంతసేపూ చాలా ఎంజాయ్ చేశానన్నారు. మురళీధర్ అద్భుతమైన టైమింగ్ ఉన్న నటుడని.. ఆయన ఈ సినిమాలో తన తండ్రి పాత్రలో నటించారన్నారు. లయతో నేను చాలా మంచి సినిమాలు చేశానని... 'స్వరాభిషేకం' సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారని శ్రీకాంత్ అన్నారు.
హీరోయిన్ లయ మాట్లాడుతూ... ఈ సినిమా చేస్తుంటే ఇంట్లో వాళ్లతో కలిసి పనిచేస్తున్నట్టుగా అనిపించిందన్నారు. అచ్చిరెడ్డి గారు, ఎస్.వి. కృష్ణారెడ్డి గారు వచ్చి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడు తనకు చాలా నచ్చిందని... కథ వింటూనే నవ్వుకుంటూ ఉన్నానన్నారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ ఇదని తెలిపారు. సినిమా చాలా హిలేరియస్‌గా ఉంటుందని... మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి చాలా రోజులైందన్నారు. మళ్లీ అలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాంత్‌కి ఇది ఒక గొప్ప కమ్‌బ్యాక్ సినిమా అవుతుందన్నారు. తానెప్పుడూ నిర్మాతల గురించి ఆలోచిస్తానని... అనుకున్న బడ్జెట్‌లో మంచి సినిమా తీయాలని ప్రయత్నిస్తుంటానన్నారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ సహకరించడంతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. సినిమా ఇంత వేగంగా పూర్తవడానికి శ్రీకాంత్ ముఖ్య కారణమన్నారు. ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ అని.. ఇందులో కర్మ ఫలితం గురించి చెప్పామన్నారు. నిర్మాత చందూ మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి గారు కథ చెప్పగానే తమకు చాలా నచ్చిందని.. చాలా ఫ్రెండ్లీగా, పాజిటివ్ వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశామన్నారు. నాగేశ్వర్ రెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీకాంత్ అద్భుతంగా నటించారని.. తాను శ్రీకాంత్‌తో ఇంతకుముందు చాలా సినిమాలు చేశానని... అయినప్పటికీ ఇంకా చేయాలనిపిస్తోందన్నారు. రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబ సభ్యుడిలాంటి వారని.. అలాంటి కాంబినేషన్‌లో సినిమా రావడం గొప్ప విషయమన్నారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి అని... ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే భవిష్యత్తులో దర్శకుడు అవుతాడని తాము అనుకున్నామన్నారు. ప్రతి విషయంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్ అద్భుతంగా ఉంటుందన్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నానన్నారు.