Entertainment

Jagapathi Babu: ‘పెద్ది’లో నేను కనిపించను.. అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు..

ఈ చిత్రంలో అందరూ అనుకుంటున్నట్టుగా తాను రామ్ చరణ్‌కు తండ్రి పాత్ర చేయలేదన్నారు. చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర చేశానని.. తనకు, రామ్ చరణ్ పాత్రకు మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు.

Jagapathi Babu: ‘పెద్ది’లో నేను కనిపించను.. అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతి బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఆ పాత్ర రావడం నా అదృష్టం..

'పెద్ది'లో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపించడంపై జగపతిబాబు మాట్లాడుతూ.. ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుందని.. ఆయన ఆ పాత్రను అలా ఉండాలని కోరుకున్నారన్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి పాత్రకు మరింత వన్నె తెచ్చినట్టు తెలిపారు. మొదటిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందని అర్థమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా గెటప్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటానని... సినిమా మొత్తం జగపతి బాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. తనకు ఈ పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని.. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ తకు చాలా నచ్చిన పాత్ర ఇదని పేర్కొన్నారు.

అదొక ఛాలెంజ్..

లెజెండ్ తర్వాత చాలా సినిమాలు చేశానని.. కానీ వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు ఉంటాయని... ఆ జాబితాలో 'పెద్ది'లో చేసిన అప్పలసూరి నంబర్ వన్ స్థానంలో ఉంటుందని జగపతిబాబు తెలిపారు. ఈ చిత్రంలో అందరూ అనుకుంటున్నట్టుగా తాను రామ్ చరణ్‌కు తండ్రి పాత్ర చేయలేదన్నారు. చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర చేశానని.. తనకు, రామ్ చరణ్ పాత్రకు మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు. నిజంగా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఒక ఛాలెంజ్ అని... కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్టుగా జగపతిబాబు పేర్కొన్నారు. ఆ పాత్రలో.. ఆ యాసలో కూడా మ్యాజిక్ ఉందన్నారు. అలాంటి పాత్ర దొరికినప్పుడు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించానన్నారు.

నిలబడి డబ్బింగ్ చెప్పండి..

ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 'పెద్ది' మరో ఎత్తు అని జగపతిబాబు పేర్కొన్నారు. బుచ్చిబాబు ఈ సినిమాతో తనకు చాలా పని పెట్టారన్నారు. సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. 'పుష్ప' డబ్బింగ్ సమయంలో తాను డబ్బింగ్ చెబుతున్నప్పుడు సుకుమార్‌కి ఒక వాయిస్ మెసేజ్ పంపానని జగపతి బాబు పేర్కొన్నారు. ఎలా అర్థమైందో తెలియదు కానీ, "సార్... నిలబడి డబ్బింగ్ చెప్పండి" అన్నారట. నిజంగా ఆయనకు ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కాదన్నారు. డబ్బింగ్ థియేటర్‌లో నడవడం కుదరదని.. కానీ చివరకు ఒక మైక్ తీసుకొచ్చి తాను నడుస్తూ ఉండగా రికార్డ్ చేశారన్నారు. డబ్బింగ్‌లో కూడా మనం పాత్రలో జీవించాలని తెలిపారు. బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరూ పూర్తి క్లారిటీతో ఉంటారని... దర్శకుడికి క్లారిటీ ఉంటే నటుడి పని చాలా సులభమవుతుందని జగపతిబాబు అన్నారు.

రామ్‌ చరణ్‌ని చూసి ఆశ్చర్యమేసింది..

ఇప్పటివరకూ తాను చేసిన పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరి లాంటి ఎమోషన్, లుక్, డెప్త్ ఏ పాత్రలోనూ లేదన్నారు. తాను ఎందుకు ఇంత బలంగా చెబుతున్నానో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుందన్నారు. ఈ సినిమా చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని జగపతిబాబు తెలిపారు. పాత్ర ఎంతసేపు ఉంటుంది అనేది ముఖ్యం కాదని.. ఉన్నంతసేపు ఎంత ప్రభావం చూపిస్తుంది అనేదే ముఖ్యమన్నారు. అప్పలసూరి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందన్నారు. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టం. ఆయన పలకరింపులోనే ఒక ఆప్యాయత ఉంటుందన్నారు. తన కుటుంబం మొత్తం చరణ్‌ని ఇష్టపడతారన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చూసి ఆశ్చర్యపోయానని.. దెబ్బలు తిన్నారు, రక్తం కారిందని.. అయినా కూడా ఎక్కడా డూప్ ఉపయోగించకుండా స్వయంగా చేశారని రామ్ చరణ్‌ను జగపతిబాబు కొనియాడారు. 'రంగస్థలం' నుంచి చరణ్ నటుడిగా నిరంతరం ఎదుగుతూనే ఉన్నారని.. ప్రతి సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నారన్నారు.

చర్మంపై దద్దుర్లు వచ్చాయి..

బుచ్చిబాబు చాలా ప్రేమగా, వినయంగా ఉంటారని... అందరూ ఆయనను ఇష్టపడతారన్నారని.. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారని జగపతిబాబు తెలిపారు. 'రంగస్థలం' రోజుల నుంచే తనకు ఆయన పరిచయం ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందన్నారు. నిజంగా సతీష్ అదృష్టవంతుడని.. రామ్ చరణ్ ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఈ సినిమా ఆయనకు చేశారన్నారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయ్యిందని జగపతిబాబు అన్నారు. ప్రోస్థెటిక్ మేకప్‌లో చాలానే సవాళ్లు ఉంటాయని.. చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవన్నారు. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ప్రతిరోజూ మేకప్‌కు దాదాపు మూడు గంటల సమయం పట్టేదని జగపతిబాబు వెల్లడించారు. రెహమాన్ గారు ఇచ్చిన ప్రతి పాట ఒకదానికంటే మరొకటి పెద్ద హిట్ అయ్యిందని.. అక్కడే సినిమా సగం సక్సెస్ అయినట్టేనన్నారు.

డబ్బింగ్ చాలా కష్టమనిపించింది..

పెద్ది ఈరోజు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లాంటి సినిమా అని... గట్టిగా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిందన్నారు. ఒక నటుడుగా తాను కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నానన్నారు. మంచి క్యారెక్టర్ దొరికిందనే సంతోషం తనకు ఉందన్నారు. డీఓపీ రత్నవేలుతో పనిచేయడం ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఆయన అర్టిస్టిక్ కేర్ తో, టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుంటారన్నారు. ఈ సినిమాను ఎంతో ఇష్టంతో చేశానని.. అయితే డబ్బింగ్ మాత్రం చాలా కష్టంగా అనిపించిందన్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ కోసం తాను ఎక్కువ కష్టపడిన సినిమా 'అరవింద సమేత' అని.. ఆ పాత్ర కోసం చాలా శ్రమపడ్డానన్నారు. కానీ 'పెద్ది'లో అప్పలసూరి పాత్ర కోసం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని.. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా సమయం, శ్రమ పెట్టానని జగపతిబాబు తెలిపారు. ఇక తన ప్రస్తుత ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. సోనీ లివ్ కోసం 'బ్లాక్ అండ్ వైట్' అనే భారీ వెబ్ సిరీస్ చేస్తున్నానని.. చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ అని తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 27, 2026 2:43 PM