Entertainment

Timmarajupalli TV Review: ‘టీవీ’ ఎమోషన్ వర్కవుట్ అయ్యిందా?

గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితులైతే మారాయి కానీ ఒకప్పుడు మాత్రం ప్రేమాభిమానాలతో పాటే మనుషుల మధ్య ఈగో కూడా గట్టిగానే ఉండేది. ఊరిలో ఎవరైనా తొలిసారి మేడ కట్టినా.. తొలిసారి ఉన్నత చదువు చదివినా.. మరొకటైనా వారి పేరు స్థిరపడిపోతుంది.

Timmarajupalli TV Review: ‘టీవీ’ ఎమోషన్ వర్కవుట్ అయ్యిందా?

చిత్రం: తిమ్మరాజుపల్లి టీవీ

విడుదల: 17-04-2026

నటీనటులు: సాయితేజ్‌, వేద జలంధర్‌, ప్రదీప్‌కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్‌, సత్యనారాయణ, లాతిష్‌ తదితరులు

సంగీతం: వంశీకాంత్‌ రేఖన

సినిమాటోగ్రఫీ: అక్షయ్‌రామ్‌

నిర్మాత: కిరణ్‌ అబ్బవరం

రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: వి.మునిరాజ్‌

హీరోగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం నిర్మాతగా మారారు. కొత్తవారిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ని నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి వెండితెరపై ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా? తెలుసుకుందాం.

గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితులైతే మారాయి కానీ ఒకప్పుడు మాత్రం ప్రేమాభిమానాలతో పాటే మనుషుల మధ్య ఈగో కూడా గట్టిగానే ఉండేది. ఊరిలో ఎవరైనా తొలిసారి మేడ కట్టినా.. తొలిసారి ఉన్నత చదువు చదివినా.. మరొకటైనా వారి పేరు స్థిరపడిపోతుంది. ఆ సమయంలో అప్పటి వారికి టీవీ కూడా ఒక ఎమోషనే. అలాంటి ఎమోషన్ ఆధారంగా రూపొందిన చిత్రమే ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే..

పేరులోనే ఉంది కదా.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అని. తిమ్మిరాజుపల్లి అనే గ్రామంలో టీవీ చుట్టూ నడిచే కథ ఇది. టీవీలు అప్పుడప్పుడే ఊళ్లలోకి ప్రవేశిస్తున్న సమయమది. ఊరిలో ఎవరు ఫస్ట్ టీవీ కొంటే వారు గొప్ప. అలాంటి ఊళ్లోకి రాజప్ప (ప్రదీప్‌ కొట్టె) తొలిసారి సొంతంగా ఓ టీవీ కొని తెస్తాడు. ఆ ఇంట్లోకి టీవీ రావడంతో ఊరు ఊరంతా రాజప్ప ఇంట్లోనే తిష్ట వేస్తూ ఉంటుంది. ఆ ఊళ్లో చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడిపే సతీష్‌ (సాయితేజ్‌)కు రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్‌)తో ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది. ఒకరోజు సతీష్ టీవీ చూడటానికని వచ్చి.. రాజప్ప అతని తండ్రితో గొడవపడతాడు. సతీష్‌ని రాజప్ప తీవ్రంగా అవమానించడంతో.. ‘ఏ టీవీని చూసైతే విర్రవీగుతున్నావో దాన్ని లేకుండా చేస్తాన’ని సవాల్‌ విసురుతాడు. అదే రోజు రాత్రి రాజప్ప ఇంట్లోని టీవీ మాయమవుతుంది. టీవీని దొంగిలించాడంటూ నింద సతీష్‌పై పడుతుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుందనేది వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..

ఇప్పుడు అరచేతిలోకి అయితే ప్రపంచం వచ్చేసింది కానీ ఆ రోజుల్లో చిన్ని చిన్ని వినోదాలే ఆనందాన్నిచ్చేవి. ముఖ్యంగా ఆ రోజుల్లో టీవీ ఒక ఎమోషన్. తన కళ్ల ఎదుట జరిగిన కొన్ని అంశాలను కథగా మలిచి ప్రేక్షకులకు అందించారు దర్శకుడు మునిరాజు. ఈతరం ప్రేక్షకులను నాటి గ్రామీణ పరిస్థితులను తెలియజేస్తూ.. నాటి తరం వారికి తమ తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చేలా ఈ సినిమా ఉంటుంది. చాలా సింపుల్ లైన్. కానీ దానిని మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. కథకు ఒక సస్పెన్స్‌ను జోడించి తీసిన చిత్రమిది. ఒక ఊరు.. దానిలో మనుషుల మనస్తత్వాలు.. తొలిసారి ఓ వ్యక్తి టీవీ తీసుకురావడం వంటి అంశాలతో ఫస్ట్ హాఫ్‌ను నడపిస్తే.. టీవీ దొంగతనం చుట్టూ నడిచిన కథతో సెకండ్ హాఫ్ ఉంటుంది. మొత్తానికి ప్రేక్షకుడిని రెండు గంటల 11 నిమిషాల పాటు విసుగు ఫీలవకుండా కూర్చోబెట్టడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల అనుమానాలు ఎవరెవరిపైకో మళ్లించి చిక్కుముడిని విప్పిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..

ఈసినిమాను దాదాపుగా మొత్తం కొత్తవారితోనే నిర్మించారు కిరణ్ అబ్బవరం. అయితే ప్రతి ఒక్క పాత్రకూ న్యాయం చేశారు. ఏ పాత్ర కూడా కథకు అనవసరం అనిపించదు. సాయితేజ్, వేద తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఊరి సర్పంచ్‌గా నటించిన అమ్మ రమేష్‌కు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చే సినిమా ఇది. తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన కూడా అద్భుతంగా వినియోగించుకున్నారు. తన పాత్రలో జీవించేశారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

టెక్నికల్ పరంగా..

తను చూసిన అంశాలనే కథగా తీసుకున్నప్పటికీ వాటిని వండి వార్చడంలో దర్శకుడు ఎక్కడా తడబడినట్టుగా కనిపించలేదు. బాగా అనుభవమున్న దర్శకుడి మాదిరిగానే సినిమాను రక్తి కట్టించారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా ఎలాంటి లోటూ చేయలేదు. లో బడ్జెట్ అయినా కూడా ఒక మంచి సినిమాను రూపొందించారు. సంగీతం కూడా సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

బలాలు..

నటీనటులందరి సహజమైన నటన

టీవీ చుట్టూ అల్లిన కథ

సెకండ్ హాఫ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

బలహీనతలంటూ పెద్దగా ఏమీ లేవు కానీ ఈ కథ 1980 నాటి కాలానికి అయితే సరిగ్గా సరిపోతుంది. 1990 నాటికి టీవీలు గ్రామాల్లోకి సైతం బాగానే వచ్చేశాయి.

ఫైనల్‌గా.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఎమోషన్ గట్టిగానే వర్కవుట్ అయ్యింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 17, 2026 9:38 AM