Entertainment

Mareechika Review: ‘మరీచిక’ ప్రేక్షకులకు థ్రిల్లిచ్చిందా?

రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మరీచిక'. ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mareechika Review: ‘మరీచిక’ ప్రేక్షకులకు థ్రిల్లిచ్చిందా?

చిత్రం: మరీచిక

విడుదల: 29-05-2026

నటీనటులు: రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్ తదితరులు

మ్యాజిక్: ఇళయరాజా

దర్శకుడు: సతీష్ కాసెట్టి

నిర్మాత: రాజీవ్ చిలక

రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మరీచిక'. ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని బాగానే పెంచింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? చూద్దాం.

కథేంటంటే..

కాలేజ్ స్టూడెంట్ అయిన వెంకట లక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) తన కాలేజీ దగ్గరలో కేఫ్ నడిపే సంజు… సంజయ్ (విరాజ్ అశ్విన్)ను ఇష్టపడుతుంది. కానీ తన మనసులో మాటను అతనికి చెప్పదు. ఒకరోజు వెంకటలక్ష్మికి ఎన్నారై మరీచిక పరిచయమవువడంతో ఆమెను సంజూ కేఫ్‌కి తీసుకెళుతుంది. అక్కడ సంజూ, మరీచికల పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. మరీచిక కోరిక మేరకు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే మరీచిక నిజ స్వరూపం వెంకటలక్ష్మికి తెలుస్తుంది. వెంటనే సంజూకి కాల్ చేసి విషయం చెబుతుంది. అది తెలుసుకున్న మరీచిక.. సంజుని సింగపూర్‌కు వెళదామని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చి హతమారుస్తుంది. అది చూసిన వెంకటలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు ఎంక్వైరీ చేయగా సంజు బతికే ఉన్నాడని తెలుస్తుంది. మరీచిక ఎవరో తనకు తెలియదని సంజు చెబుతాడు. అప్పుడు వెంకటలక్ష్మిని సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లగా.. ఆమె ఒక సమస్యతో బాధపడుతోందని చెబుతాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? మరీచిక నిజంగానే లేదా? ఉంటే ఏమైంది? సంజు, వెంకటలక్ష్మి పెళ్లి చేసుకున్నారా? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

వాస్తవానికి ఇదొక మంచి కథే. దాదాపుగా ఇప్పటి వరకూ ఇలాంటి కథ రాలేదనే చెప్పాలి. అయితే దానిని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సతీష్ కాసెట్టి పూర్తిగా తడబడ్డారు. సినిమా మనకు కొంతమేర అర్థమై పోతూనే ఉంటుంది. ట్విస్ట్‌లు కూడా బాగానే పెట్టారు కానీ థ్రిల్ పంచేలా మాత్రం లేవనే చెప్పాలి. సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ సన్నివేశాలు రిపీట్ అవడం మాత్రం చూసే ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. మొత్తంగా సినిమా కథ బాగానే ఉంటుంది కానీ నడిపించిన తీరే ఏమాత్రం ఆకట్టుకోదు. దాని వలన సినిమా ప్రేక్షకులకు అంతగా థ్రిల్‌ను పంచలేకపోయింది.

ఎవరెలా నటించారంటే..

మరీచికగా రెజీనా అద్భుతంగా నటించింది. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఈ సినిమాలో మరీచిక పాత్ర కంటే అనుపమ పాత్రే కీలకం. పైగా ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో అనుపమ అద్భుతంగా నటించింది. ఇక ఇతర నటీనటులు సైతం తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు సతీష్ కాసెట్టి ఆసక్తికరమైన కథ తీసుకున్నారు కానీ ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇక ఇళయరాజా అందించిన సంగీతం ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేకపోయింది. అసలు ఆయన మ్యూజిక్ ఇచ్చారంటే ఎవరూ నమ్మలేరు కూడా. పాటలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కెమెరా పనితనం కూడా పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించి ఉండాల్సింది.

ఫైనల్‌గా.. థ్రిల్‌ను పంచలేకపోయిన ‘మరీచిక’

రేటింగ్: 2.25/3

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 29, 2026 11:47 AM