Manchu Manoj: దాసరిగారు నాకు తండ్రి సమానులు.. ఆ వీడియో చూడగానే బాధేసింది..
ఇవాళ దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై ఓ యూట్యూబ్ యాంకర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ అయ్యారు.
ఇవాళ దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై ఓ యూట్యూబ్ యాంకర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ అయ్యారు. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించి దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు.
ఈ సందర్భంగా 'రా కింగ్' మనోజ్ మంచు మాట్లాడుతూ.. నిజానికి ఈరోజు దాసరి నారాయణరావు వర్ధంతి అనే విషయం తనకు గుర్తు లేదన్నారు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, గురువుగారి విగ్రహం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నానని... వెంటనే అరుణ్ అన్నకు ఫోన్ చేసి ఆలం అక్క నంబర్ మారి పోయుంటే తీసుకున్నానని మనోజ్ తెలిపారు. వారితో మాట్లాడుతూ.. ఎందుకనో దాసరిగారు గుర్తుకు వస్తున్నారని కూడా అన్నానని పేర్కొన్నారు. ఈలోగా వేరే పనిలో పడి విషయం మరచిపోయానని... అది జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే నిన్న సాయంత్రం గురువుగారి ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడగానే చాలా బాధేసిందని మనోజ్ చెప్పుకొచ్చారు. వీడియో చూసిన వెంటనే తన టీమ్‌కు చెప్పానన్నారు. తాను ఆలస్యంగా చెప్పినా కూడా దారిలో వాళ్లు కార్మిక సిబ్బందిని తమ కార్లలోనే ఎక్కించుకుని వచ్చారన్నారు. యాదగిరి అన్న, ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారన్నారు. మొత్తానికి అందరి సహకారంతో గురువు గారి విగ్రహం వద్ద అంతా క్లీన్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
దాసరి ఒక గొప్ప డైరెక్టర్.. గొప్ప యాక్టర్.. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారని మనోజ్ కొనియాడారు. ఆయన తనకు తండ్రి సమానులని పేర్కొన్నారు. మా గురువుగారు. దాసరి డైరెక్షన్‌లో రూపొందిన ‘నా మొగుడు నాకే సొంతం’ సినిమాలో తాను యాక్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. దాసరిగారి పని అయిపోయిందని అనుకునే సమయంలో ఓ కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వచ్చేవారన్నారు. కమర్షియల్, మేల్ డామినేషన్ ఉన్న సమయంలో విజయశాంతితో ‘ఒసేయ్ రాములమ్మ’ అనే సినిమా తీసి.. ప్రతీ హీరోకి భయం పుట్టించారన్నారు. తనతో పాటు తన తోటి హీరోలందరూ సినిమాలు చేయటానికి ఎంతో కష్టపడుతున్నారన్నారు. అందరం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని... ఆ బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ ఏడాది తిథి ప్రకారం చూస్తే ఆయన వర్ధంతి జూన్ 20న వచ్చింది కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారని తెలిసిందని.. ఇందులో ఎవరినీ తప్పు పట్టటానికి లేదన్నారు.
భూమా మౌనిక మంచు మాట్లాడుతూ ఇవాళ పెద్దలు దాసరి నారాయణరావుగారి వర్దంతికి ఇక్కడకు వచ్చామని... పెద్దాయన ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. దాసరి గారంటే సినీ ఇండస్ట్రీకి, పబ్లిక్ సర్వీస్‌కు బాగా తెలిసిన వ్యక్తి అని.. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజ్‌లు ఇచ్చారన్నారు. ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేశారన్నారు. అసమానతలపై సినిమాలతో గొంతెత్తారని... ఆయన వర్ధంతికి ఇక్కడకు రావటం తమ బాధ్యతగా పేర్కొన్నారు. పెద్దాయన మనోజ్‌ను పిలిపించుకుని ఈ పని చేయించుకున్నారనిపిస్తోందని మౌనిక పేర్కొన్నారు. మనోజ్ ప్రతీ సందర్భంలో దాసరిగారిని గుర్తు చేసుకుంటూ ఉంటారన్నారు. మనోజ్‌కు ఆయనెంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారన్నారు.