Entertainment

Gedela Raju Review: ‘గేదెల రాజు’కు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఉందా?

ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే ఒక గుప్పిట్లో దాచే నిజం. ఎప్పుడైతే గుప్పిట తెరుస్తారో అప్పుడు సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. ముఖ్యంగా జనాల్లోకి సినిమా వెళ్లిన తర్వాత సస్పెన్స్‌ను హోల్డ్ చేయడం కష్టం. కానీ సస్పెన్స్ రివీల్ అయినా కూడా సినిమాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కథ స్ట్రాంగ్‌గా ఉండాలి.

Gedela Raju Review: ‘గేదెల రాజు’కు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఉందా?

చిత్రం: గేదెల రాజు

విడుదల: ఏప్రిల్ 24, 2026

నటీనటులు: రఘు కుంచె, వికాస్ ముప్పాళ , రామచంద్రం పుణ్యమంతుల, రవి చిన్నిబిల్లి, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: రఘు కుంచె

దర్శకత్వం: చైతన్య మోటూరి

నిర్మాత: వాణి రవికుమార్

ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే ఒక గుప్పిట్లో దాచే నిజం. ఎప్పుడైతే గుప్పిట తెరుస్తారో అప్పుడు సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. ముఖ్యంగా జనాల్లోకి సినిమా వెళ్లిన తర్వాత సస్పెన్స్‌ను హోల్డ్ చేయడం కష్టం. కానీ సస్పెన్స్ రివీల్ అయినా కూడా సినిమాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కథ స్ట్రాంగ్‌గా ఉండాలి.

రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతం సమకూర్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘గేదెల రాజు’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ అయితే రివీల్ అయిపోయింది కానీ సినిమా కథ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత స్ట్రాంగ్‌గా ఉందా? చూద్దాం.

కథేంటంటే..

కాకినాడకు చెందిన రౌడీ షీటర్‌ గేదెల రాజు(రఘు కుంచె) హత్యతో కథ ప్రారంభమవుతుంది. దీనికి ముందు కార్పోరేషన్‌ ఎన్నికల్లో రాజు పోటీ చేయాలనుకుంటాడు. టికెట్ కూడా అతనికే దక్కుతుంది. అదే పార్టీకి చెందిన దుర్గ (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) కూడా టికెట్‌ ఆశిస్తాడు. అయితే గేదెల రాజుకి, దుర్గకి పడదు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించాలని వీరిని ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడతాడు. కానీ ఇద్దరూ నిరాకరించి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. గేదెల రాజు ఆ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభిస్తారు. అనుమానితులందరినీ స్టేషన్‌కు పిలిచి ఇంటరాగేషన్ చేస్తారు. అయితే కేసుతో ఎవరికీ సంబంధం లేదని తేలుతుంది. ఇంతకీ గేదెల రాజుని హత్య చేసిందెవరు? ఎందుకు చంపారు? అనేది తెలియాలంటే వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..

‘చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు’ అని ఈ సినిమాకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ క్యాప్షన్ ఎందుకు పెట్టారన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకులు హంతకుడు ఎవరన్నది కనిపెట్టడం కాస్త కష్టమే. దీనికి తోడు.. రెండు చక్కటి లవ్ స్టోరీలను సైతం దర్శకుడు నడిపించారు. అంతా బాగానే ఉన్నప్పటికీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. తొలుత దుర్గ పాత్రపై అనుమానం వెళుతుంది. ఇంతలోనే రిచ్ పాత్ర ఎంట్రీ.. మీరాతో అతని ప్రేమాయణం.. మరోవైపు విజయ్-సత్యల ప్రేమాయణం.. డెక్క, శివయ్య ఇలా రకరకాల పాత్రలను ప్రవేశపెట్టి అనుమానాలను ఎవరెవరి మీదకో మళ్లించేశారు దర్శకుడు చైతన్య మోటూరి. చివరకు ట్విస్ట్ ఊహించడం కష్టమే అయినా కూడా రివీల్ అయిన తర్వాత ఏముందిలే అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే విషయంలోనూ దర్శకుడు మరింత జాగ్రత్త పడి ఉండాల్సింది.

ఎవరెలా చేశారంటే..

గేదెల రాజు పాత్రలో రఘు కుంచె జీవించేశారు. ఆయన గెటప్.. పాత్రకు తగినట్టుగా బరువు పెరిగి కొంచెం భయంకరంగానే రఘు కనిపించారు. అలాగే ఒక రౌడీ షీటర్ మాట తీరు.. ప్రవర్తన.. తనకు ఎదురొచ్చిన వాళ్లను తొక్కేయడం వంటివి చూస్తుంటే రియలిస్టిక్‌గానే అనిపిస్తుంది. ఇక కాకినాడకు చెందిన వారు కావడంతో యాస విషయంలో ఏమాత్రం కష్టపడలేదని తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ గురించి చెప్పేదేముంది? ఆయనో అద్భుతమైన నటుడు. శివయ్యగా రవి ఆనంద్‌.. రిచ్‌గా వికాస్‌, విజయ్‌గా రామచంద్రం.. టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఇక నేపథ్య సంగీతం విషయం, బీజీఎం విషయానికి వస్తే రఘు కుంచె సినిమాను ఒక మెట్టు ఎక్కించారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా.. ఎడిటింగ్ పేలవంగా ఉంది. సినిమాకు గట్టిగానే కత్తెర వేయవచ్చు. నిర్మాణ విలువలు సైతం పర్వాలేదనిపించాయి.

మొత్తంగా.. ‘గేదెల రాజు’ మెప్పించడం కాస్త కష్టమే..

రేటింగ్: 2.5/5

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 24, 2026 1:20 PM