Entertainment

ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ.. ‘జన నాయగన్’ ఎంట్రీకి టైమ్ ఫిక్స్..

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’ కోసం ఎంతోకాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది.

ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ.. ‘జన నాయగన్’ ఎంట్రీకి టైమ్ ఫిక్స్..

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’ కోసం ఎంతోకాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది. దళపతి విజయ్ నటించిన చివ‌రి చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 23, 2026న‌ విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. తమిళనాడు ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

హెచ్‌.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో ‘జన నాయగ‌న్’ రూపొందింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలోనే ప్రతిభావంతమైన టీమ్‌ను ఒకేచోట చేర్చింది.

సినిమా విడుదలపై నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ ..సినిమా చరిత్రలో చారిత్రాత్మకంగా అనిపించే క్షణాలు చాలా అరుదని.. అలాంటి ప్రత్యేకమైన క్షణమే ‘జన నాయగన్’ అని పేర్కొన్నారు. దళపతి విజయ్ తన చివరి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుందని.. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానుల ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రారంభమైన విజయ్ ప్రయాణం లక్షలాది మందికి ప్రేరణగా మారిందన్నారు. చివరికి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎదిగారని నారాయణ కొనియాడారు. ప్రజలతో ఆయనకు ఉన్న అపూర్వమైన అనుబంధానికి ఇది నిదర్శనమని.. ‘జన నాయగ‌న్’ ప్రేక్ష‌కుల‌కు ఒక గుర్తుండిపోయే థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తూ, ఆయన అద్భుతమైన కెరీర్‌కు సరైన నివాళిగా నిలుస్తుందని తాము నమ్ముతున్నామన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 15, 2026 1:26 PM