Entertainment Breaking News

Jo Sharma: ‘M4M’లో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ

తాను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చానని జో శర్మ తెలిపారు. తాను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌నని, తనకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు 'రాధ'

Jo Sharma: ‘M4M’లో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ "M4M (Motive For Murder)". ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీలో ప్రధాన పాత్రలో న‌టించిన అమెరికన్ నటి జో శర్మ మీడియా ప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి, త‌న కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బలంగా డిజైన్ చేసుకున్నా..

తాను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చానని జో శర్మ తెలిపారు. తాను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌నని, తనకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు 'రాధ' అని.. ఈ చిత్రంలో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తానని తెలిపారు. మోహన్ దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకున్నానని.. అలాగే మోహన్, రాహుల్ అడవలతో కలిసి కో-రైటర్‌గా కూడా ఈ చిత్రానికి పని చేసినట్టు తెలిపారు. కథా చర్చల్లో పాల్గొనడం వల్ల తన పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకున్నట్టుగా జోశర్మ తెలిపారు. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే తమకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయన్నారు. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ డైరెక్ట‌ర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా తనకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్‌కు అవార్డులు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక 'కేన్స్' (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారని జో శర్మ వెల్లడించారు.

సీరియల్ కిల్లర్..

కేన్స్‌లో తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని జో శర్మ తెలిపారు. అది తమ సినిమాకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. అక్క‌డ వ‌చ్చిన స్పంద‌న చూశాక ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. M4M ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని తెలిపారు. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడని.. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ (కళాఖండాల) తరహాలో డెకరేట్ చేస్తాడని తెలిపారు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదన్నారు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుందని జోశర్మ వెల్లడించారు. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుందని.. విడుద‌ల రోజు ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించామని జో శర్మ తెలిపారు.

ఉద్దేశం ఏమిటి?

ఈ చిత్రాన్ని మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా వారు సంయుక్తంగా నిర్మించారన్నారు. ఒక లక్ష డాలర్ల బడ్జెట్ స్థాయికి చేరుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టుగా జో శర్మ తెలిపారు. షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే జరిగిందని.. సంగీతం చెన్నైకి చెందిన వసంత్ ఇసైపట్టాయ్ అందించారన్నారు. తాను పుట్టింది హైదరాబాద్‌లోనే కానీ పెరిగిందంతా నాగ్‌పూర్, ముంబైలోనని పేర్కొన్నారు. తనకు తెలుగుతో పాటు మరాఠీ, హిందీ బాగా వస్తాయన్నారు. తన తల్లిదండ్రులు.. విజయవాడ, గుంటూరు ప్రాంతానికి చెందిన వారన్నారు. తనకు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అంటే ఇష్టమని తెలిపారు. M4M అంటే "మోటివ్ ఫర్ మర్డర్" (Motive For Murder). ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది అసలు పాయింట్ అని జో శర్మ తెలిపారు. ఈ టైటిల్‌కే అందరూ కనెక్ట్ అవుతున్నారని... ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 6, 2026 1:44 PM