Entertainment

జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం.. వంటి అంశాలను ఆసక్తికరంగా రూపొందించారు. తాజాగా సిరీస్ టైటిల్‌ను మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు.

జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌తో టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో ఒకటిగా కొనసాగుతున్న జీ5 ఇప్పుడు సరికొత్త సిరీస్‌తో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. కామెడీ, మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం.. వంటి అంశాలను ఆసక్తికరంగా రూపొందించారు. తాజాగా సిరీస్ టైటిల్‌ను మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. దీనిలో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియోను వినూత్నంగా రూపొందించడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించగా.. ‘విక‌ట‌క‌వి’ డైరెక్ట‌ర్‌ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ప్ర‌ధాన పాత్ర‌లో కొణిదెల నాగబాబు క‌నిపిస్తున్నారు. గెట‌ప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించ‌నున్నారు. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడ ఒక విచిత్రమైన ఘటన జరగడంతో గ్రామంలో గంద‌ర‌గోళం ఏర్ప‌డటంతో ఆ కేసును విచారించేందుకు ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. వారికి ఇదే ఫస్ట్ బిగ్ కేస్ కావడంతో ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు. కాన్ఫిడెంట్‌గానే ఉంటారు కానీ కాస్త టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. అక్కడ వారికి దొరికే క్లూస్, ఆ తరువాత జరిగే పరిణామాలు అన్నీ కూడా వినోదాత్మకంగా మారుతాయి. ప్రతీ ఒక్కరిపై అనుమానం రావడంతో అంతా గందరగోళంగా మారడంతో పాటు అక్కడ జరిగిన చిన్న ఘటనతో వాతావరణం అంతా మారిపోతుంది. అవేంట‌నేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.

లోక‌ల్ ఫ్లేవ‌ర్‌తో బ‌ల‌మైన‌ పాత్రల చుట్టూ తిరిగే కథనం, వ్యంగ్యమైన క‌నిపించే క‌థా పాత్ర‌ల‌తో “మేము కాప్’లం” తెలుగు జీ5 ఒరిజినల్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని కాన్సెప్ట్ వింటుంటే మాత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించే వెబ్ సిరీస్‌గానే క‌నిపిస్తోంది. మ‌నం ఎప్పుడూ చూసే, మ‌న‌ల్ని ప్రతిబింబించే కథలను ఆధునిక మేళవింపుతో చూపించే జీ5 ప్రాజెక్ట్‌ల జాబితాలో ఇది ఒక‌టిగా మార‌నుంది. ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు కొణిదెల మాట్లాడుతూ ‘పరువు’ తర్వాత జీ5లో తాను చేస్తోన్న సిరీస్ ‘‘మేము కాప్’లం’’ అని అన్నారు. కథా నేపథ్యం, పాత్రలు, ఆసక్తికరమైన కథనం కావడంతో తనకు ఈ సిరీస్‌పై ఇంట్రస్ట్ ఏర్పడిందన్నారు. ఈ టీమ్‌తో పని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హాస్యాన్ని, అర్థవంతమైన స్థానిక కథలను బ్యాలెన్స్ చేసే ఈ సిరీస్‌లో భాగం కావటం తనకు సంతోషంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 2, 2026 2:54 PM