Jetlee Movie Review: ‘జెట్లీ’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
‘మత్తు వదలరా’ వంటి సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా రితేశ్ రానా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నేడు ‘జెట్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సత్య, మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పాటు వదిలిన అప్‌డేట్స్‌తో అంచనాలు భారీగానే పెరిగాయి
చిత్రం: జెట్లీ
విడుదల: 01-05-2026
నటీనటులు: సత్య, వెన్నెల కిశోర్, అజయ్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం: కాల భైరవ
దర్శకత్వం: రితేశ్ రానా
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
‘మత్తు వదలరా’ వంటి సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా రితేశ్ రానా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నేడు ‘జెట్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సత్య, మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పాటు వదిలిన అప్‌డేట్స్‌తో అంచనాలు భారీగానే పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
వ్యాపారవేత్త అయిన ప్రజాపతి (అజయ్) రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌కు పాల్పడి.. దేశం వదిలి దుబాయ్ పారిపోతాడు. ప్రజాపతిని తిరిగి దేశానికి రప్పించే బాధ్యతను కేంద్ర హోం మంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అప్పటికే జజీరా సిండికేట్‌తో పాటు మరికొంత మంది శత్రువుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రజాపతి తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే లొంగిపోయినట్టుగా నటిస్తూ తప్పించుకునేందుకు స్కెచ్ వేస్తాడు. దుబాయ్ నుంచి కొచ్చికి ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. తన స్కెచ్‌లో భాగమైన కొందరు వ్యక్తులు తనను హత్య చేసేలా ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్‌లో బాగమైన డాక్టర్ వేదవ్యాస్ (సత్య) గతం మర్చిపోయిన వాడిగా ఎంట్రీ ఇస్తాడు. ప్రజాపతి చివరకు తప్పించుకోగలిగాడా? అసలు వేదవ్యాస్ ఎవరు? చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
ఇప్పటికే తీసిన చిత్రాలతో తన కామెడీ స్టైల్ ఎలా ఉంటుందో రితేశ్ చూపించేశారు. వాస్తవానికి జెట్లీ కథ కూడా పూర్తి కామెడీతోనే రూపొందింది. కథ మొత్తం విమానంలోనే జరుగుతుంది. ఫ్లైట్‌లో సాధారణ ప్రయాణికులతో పాటు.. ప్రజాపతిని జాగ్రత్తగా దేశం చేర్చాలనుకునే రా ఏజెంట్స్, ఆయనను ఎలాగైనా తప్పించాలనుకునే వేదవ్యాస్ గ్యాంగ్ ఉంటుంది. వీరందరి మధ్య నడిచే కథ ఇది. వినడానికి సింపుల్‌గానే అనిపిస్తున్నా.. రితేశ్ తెరకెక్కించిన తీరు మాత్రం గందరగోళానికి దారి తీసింది.10 నిమిషాల సేపు మాత్రమే నేలపై ఉంటుంది. ఆ తరువాత అంతా ఫ్లైట్‌లోనే ఉంటుంది. ఇక పాత్రల పరిచయం కూడా విమాన ప్రయాణంలోనే చేసేశాడు దర్శకుడు. ఇక సత్య ఎంట్రీని ఆసక్తికరంగానే ప్లాన్ చేసినా ఆ తరువాత అంతా సాదాసీదాగా అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఏవో ట్విస్ట్‌లతో నడిపించే ప్రయత్నమైతే చేశాడు కానీ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. సినిమాలో హైజాక్ డ్రామా అయితే విసుగు పుట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
సత్య తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిశోర్ టైమింగ్‌ను వాడుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. రియా సింఘా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అజయ్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. కాల భైరవ సంగీతం ఈ చిత్రాన్ని ఒక మెట్టు ఎక్కించింది. నిర్మాణ విలువలు సైతం కథకు తగినట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేనే పెద్ద మైనస్ అని చెప్పాలి.
చివరిగా: ‘జెట్లీ’.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.
రేటింగ్: 2.25/5