వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుల అరెస్ట్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy) అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam)లో మిథున్ రెడ్డికి బెయిల్ (Bail) రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. పీలేరు నుంచి పాదయాత్ర చేస్తూ.. తిరుమల (Tirumala) శ్రీవారి మెట్టుమార్గానికి చేరుకున్నారు. అక్కడ వారిని తిరుమలకు మెట్టు మార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతులు లేవని.. పోలీసులు అదుపులోకి తీసుకుున్నారు. దీంతో మిథున్ రెడ్డి అనుచరులు నిరసనకు దిగారు. వారిలో 10 మంది వివరాలు సేకరించి వారిని తిరుమలకు అనుమతించగా.. మరో 17 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆ 17 మందిని కూడా సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.3200 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో సిట్ విచారణ జరిపింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో మద్యం ఆర్డర్లు, సప్లై వ్యవస్థను ఆన్‌లైన్ విధానం స్థానంలో మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్ రెడ్డి (MP Mithun Reddy) కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ అధికారులు ఆయనను ఏడు గంటల పాటు విచారించిన మీదట అరెస్ట్ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ఫలితం దక్కకపోవడంతో సిట్ విచారణకు హాజరవక తప్పలేదు. ఆ తరువాత రెండు పర్యాయాలు బెయిల్ కోసం యత్నించినా కూడా రాలేదు.