YSRCP: వై..ఎస్? రచ్చ చేస్తున్న వైసీపీ
రాజకీయాల్లో విమర్శలకు ఏదీ అనర్హం కాదని ఈ విషయం గురించి వింటే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి పేరు రచ్చ నడుస్తోంది. వాస్తవానికి తండ్రి ఇంటి పేరు కొడుక్కి వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు మాత్రం రాదు.

రాజకీయాల్లో విమర్శలకు ఏదీ అనర్హం కాదని ఈ విషయం గురించి వింటే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి పేరు రచ్చ నడుస్తోంది. వాస్తవానికి తండ్రి ఇంటి పేరు కొడుక్కి వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు మాత్రం రాదు. ఇది జగమెరిగిన సత్యమే. కూతరు మాత్రం తన తండ్రి ఇంటి పేరును క్యారీ చేయవచ్చు.. అలా చేస్తున్నవారు సైతం ఉన్నారు. కానీ ఎవరైనా సరే.. తండ్రి ఇంటిపేరును కాకుండా తల్లి ఇంటి పేరును మోస్తారా? ఒకవేళ అలా తీసుకోవడమనేది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలా పెట్టుకోవద్దు అని చెప్పడానికి మనమెవరం? మనకేం అర్హత ఉంది? కానీ రాజకీయాల్లో మాత్రం ఇదొక అస్త్రం అవుతుంది.
ప్రస్తుతం వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy) కుటుంబం నుంచి నాలుగో తరం నేత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యూఎస్‌లో చదువుకుని వచ్చి తల్లి బాటలో నడవాలనేది వైఎస్ షర్మిల (YS Sharmila) తనయుడు రాజారెడ్డి నిర్ణయం. తల్లితో కలిసి కర్నూలుకు వెళ్లి ఉల్లి రైతులను పరామర్శించడం. ఆ తరువాత తల్లితో కలిసి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ (YS Vijayamma) దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం అందుకోవడంతో ఇక రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రం (Political Entry) ఫిక్స్ అని అంతా నిర్ణయించుకున్నారు. ఉడుకు రక్తం.. రాజకీయాల్లోకి దూసుకెళ్లగలిగే నైజం ఎలాగూ ఉంటుంది కాబట్టి అతని రాక కొందరికి ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే కొత్త రాగం అందుకున్నారు. వారు ఎంచుకున్న రాగమేంటంటే.. ఇంటి పేరు.
రాజకీయాల్లోనూ నడుస్తున్న ట్రెండ్..
రాజారెడ్డి పేరుకు ముందు వైఎస్ ఉండటమే. ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి కుటుంబం నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy), ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సీఎంలు అయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యారు. అలాగే వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల సైతం రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి నాలుగో తరం నేతగా షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం భర్త ఇంటి పేరును భార్య కొనసాగిస్తుంది. అయితే చదువుకుని ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతున్న వారైతే తండ్రి ఇంటి పేరునే కొనసాగిస్తారు. దానికి కారణం సర్టిఫికెట్స్ అన్నింటిలోనూ తండ్రి ఇంటి పేరు ఉండటమే. దానిని మార్చాలంటే అదొక పెద్ద ప్రాసెస్. మార్చకుంటే వచ్చే నష్టం కూడా ఏమీ లేకపోవడంతో అలా కొనసాగిస్తారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది.
వైసీపీలో కొనసాగితే ఇదొక అడ్డంకే కాదు..
తెలంగాణ విషయానికి వస్తే కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. తన తండ్రి ఇంటి పేరుతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఏపీ విషయానికి వస్తే వైఎస్ షర్మిల. ఈమె కూడా తండ్రి ఇంటి పేరునే కొనసాగిస్తున్నారు. కానీ వీరి తనయులు తల్లి ఇంటి పేరుతో కొనసాగడం మాత్రం సరికాదు. ఇప్పటి వరకూ ఎవరూ అలా కొనసాగింది కూడా లేదు. కానీ షర్మిల తనయుడు మాత్రం వైఎస్ రాజారెడ్డి అని తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. అతని సర్టిఫికెట్స్‌లో ఎలా ఉందో కానీ రాజకీయాల్లో మాత్రం వైఎస్ అనే ఇంటిపేరును తగిలించుకోవడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి రాజారెడ్డి తండ్రి ఇంటిపేరు మొరుసుపల్లి. అదే షర్మిలతో పాటు ఆమె తనయుడు రాజారెడ్డి వైసీపీ (YCP)లో కొనసాగితే ఇదొక అడ్డంకే కాదు. కానీ షర్మిల ఏపీకి పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. అప్పటి నుంచి వైఎస్ అనే ఇంటి పేరును షర్మిల కొనసాగించడానికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్‌సీపీ (YSRCP) నేతలు.. అలాంటిది ఆమె తనయుడు మోయడానికి ఎందుకు అంగీకరిస్తారు?
బ్రాండ్ కోసం గొడవ..
పైగా వైఎస్ రాజారెడ్డి అనగానే పెద్దాయన పేరు గుర్తుకు వస్తుంది. అది కూడా వైసీపీకి ఇబ్బందికరమే కదా. వైఎస్ రాజారెడ్డి తొలి తరం రాజకీయ నాయకుడిగా.. పులివెందుల సర్పంచ్‌గా చాలా కాలం పాటు పని చేశారు. ఇప్పటికీ రాష్ట్రమంతటికీ వైఎస్ రాజారెడ్డి పేరు బాగా తెలుసు. వైఎస్ కుటుంబం అనగానే మంచిగానో.. ఫ్యాక్షన్ పరంగానో ముందుగా గుర్తొచ్చేది రాజారెడ్డి పేరే. అలాంటిది షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి అంటే ఎక్కడ తమకు ఇబ్బంది అవుతుందో అని వైసీపీ నేతలు కంగారుపడటంలో తప్పులేదు. దీంతో వై.. ఎస్? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల మధ్య వైఎస్ బ్రాండ్ (YS Brand) కోసం గొడవ జరుగుతోంది. ఇప్పుడు అది మరింత రాజుకునే అవకాశం ఉంది.
ప్రజావాణి చీదిరాల