YS Jagan: ‘మారవా.. నువ్ మారవా’ వైఎస్ జగన్ రెడ్డీ!
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పదే పదే ఒకటే చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పదే పదే ఒకటే చెబుతున్నారు. ‘మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు జగన్ 2.0 (Jagan 2.0) ఎలా ఉంటుందో చూపుతాను!’ అంటూ కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తలు మాత్రం.. ‘మిర్చి’ సినిమా డైలాగ్‌లా.. ‘మారవా.. నువ్ మారవా!’ అని మనసులోనే నిలదీస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే, ఓటమికి ప్రధాన కారణంగా భావించిన క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయడం అనే తప్పును, అధికారం పోయిన తర్వాత కూడా అధినేత రిపీట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాత చింతకాయ పచ్చడిలా ఉన్న ఈ ధోరణి పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
హామీలు ఒకెత్తు సరే..!
ప్రస్తుతం పార్టీని పునరుత్తేజం చేసి, వచ్చే ఎన్నికలకు బలోపేతం చేసేందుకు జగన్ ఇటీవల గ్రామ, మండలస్థాయి కమిటీలను, అనుబంధ విభాగాల పదవులను భర్తీ చేస్తున్నారు. అయితే, ఈ నియామకాలపైనే కార్యకర్తల్లో (YSRCP Cadre) తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మళ్లీ గెలిచాక పరిస్థితి ఎలా ఉంటుందో కానీ, ఇప్పుడు మాత్రం మాకు సరైన గుర్తింపు దక్కడం లేదనే భావన బలంగా నాటుకుపోతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న చర్చ ఏమిటంటే, పార్టీ కమిటీలపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని. పోరాడేవారికంటే, నియోజకవర్గ నేతలకు దగ్గరగా ఉన్నవారికే పదవులు, గుర్తింపు దక్కుతోందని, ఇది పెద్ద చేప చిన్న చేపను మింగినట్లుగా ఉందని కార్యకర్తలు వాపోతున్నారు.
అయ్యో పాపం.. అన్యాయం!
వైసీపీ క్యాడర్ (YCP Cadre) వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. తాజాగా భర్తీ చేసిన పార్టీ పదవుల్లో ఇటీవల కూటమి ప్రభుత్వంపై పోరాడుతూ కేసులు ఎదుర్కొన్న ఫ్రంట్ వారియర్స్‌కు ఏ ఒక్కరికీ కూడా చోటు దక్కకపోవడం. పార్టీ కోసం రిస్క్ తీసుకుని, కేసులు ఎదుర్కొంటున్న వారిని యథావిధిగా తొక్కిపెడుతున్నారని, ముఖ్య నేతల కోటరీకి దగ్గరగా ఉంటూ, కేవలం 'షో' చేసే వారికే అందలం ఎక్కించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అవసరం తీరాక తెప్ప తగలేసినట్లుగా పార్టీని గెలిపించిన నేతలు, కార్యకర్తలను కాదని, వలంటీర్లపై ఆధారపడటం వల్లనే జగన్ భారీ మూల్యం చెల్లించుకున్నారని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోరాడే వారిని పక్కన పెట్టి కేవలం తెర వెనుక లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యత ఇస్తే, పార్టీని బలోపేతం చేయడం ఎలా సాధ్యం? అని వారు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీని ఉదాహరిస్తూ ఆవేదన
నిజానికి, వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ అప్పట్లో తమ కేడర్‌లో ఉత్తేజం తెచ్చేందుకు.. ఎక్కువ కేసులు ఉన్నవారిని గుర్తించి, అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీకి కట్టుబడి పనిచేస్తోంది. కానీ, తమ పార్టీలో ఈ పరిస్థితి లేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారిని ప్రోత్సహించకుండా.. కేవలం నియోజకవర్గ నేతలు ఇచ్చే నివేదికలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అధినేత జగన్ ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజా నియామకాలను చూస్తే, తమ అధినేతలో నో ఛేంజ్ అన్న భావన బలపడుతోందని కార్యకర్తలు వాపోతున్నారు.
ప్రజావాణి చీదిరాల