YS Jagan: రుషిరాజ్ సింగ్‌కు గుడ్‌బై.. ఆపరేషన్ అధికారం, రుషికొండ ప్యాలెస్ స్టార్ట్..
ఇంత జరిగాక విజ్ఞుడైన రాజకీయ నేత (Political Leader) ఎవరైనా అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనేది అన్వేషించుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ దెబ్బేసిందని..

రాజకీయం (Politics) అనేది నిత్య సంఘర్షణ.. గెలిచినవాడు తన పదవి తిరిగి చేజారి పోకుండా చూసుకోవాలి.. ఓడినవాడు ఎలాగైనా తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు మదన పడాలి. కాబట్టి ఇద్దరూ నిత్యం అలర్ట్‌గానే ఉండాలి. ఏ చిన్న అవకాశం కూడా ప్రత్యర్థికి ఇవ్వకూడదని అధికారంలో ఉన్నవాడు నానా తిప్పలు పడాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు దొరుకుతుందా? ఇష్యూ చేద్దామా? అని ఓడినవాడు కాచుక్కోవాలి. ఇద్దరికీ ఎంత సంఘర్షనో.. ఈ సంఘర్షణలో భాగంగానే ప్రస్తుతం ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన రాజకీయ వ్యూహకర్తను మార్చుతున్నారట.
ఒకప్పటి రాజకీయం వేరు.. నేటి రాజకీయం వేరు. అప్పటి రాజకీయాల్లో వ్యూహకర్తలకు స్థానం లేదు. ఇప్పుడు వ్యూహకర్తలే అంతా తామై నడిపిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. రాజకీయాల్లో ఫెయిల్ అయితే వ్యూహకర్తలవుతారు.. వారి చేతిలో సక్సెస్ అయిన వారు కీలుబొమ్మలవుతారు. వాళ్లు చెప్పినట్టు వినాలి.. చెయ్యమన్నది చెయ్యాలి. ఇదంతా పక్కనబెడితే గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న ఐ ప్యాక్ (I-Pac).. నిండా ముంచేసింది. 151ని కాస్తా 11కి తీసుకొచ్చింది. దీనిలో ఏ ప్యాక్‌ల తప్పూ లేదనుకోండి.. జగన్ స్వయంకృతాపరాధమే 99 శాతం ఉందనేది రాజకీయ నిపుణుల మాట. అయినా సరే.. తాను మునిగింది కేవలం ఐప్యాక్ కారణంగానేనని భావించి మరో ప్యాక్‌ను అదేనండి.. మరో వ్యూహకర్తను రంగంలోకి దించే ఆలోచనలో జగన్ (Jagan) ఉన్నారని టాక్.
అధికార పార్టీపైకి బాణాలను ఎలా ఎక్కుపెట్టాలి?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్యాలెస్ (Elahanka Palace)లో ఉండేది ఎక్కువ.. ఏపీలో ఉండేది తక్కువ అని అందరి భావన. దీనిపై అధికార పక్షం కూడా విమర్శలు గుప్పిస్తోంది. కానీ జగన్ అక్కడ చేసే మంతనాలు ఎవరికీ అర్థం కావు.. ఎవరూ అర్థం చేసుకోరు. ఎలహంక ప్యాలెస్‌లో కూర్చొని అధికార పార్టీపైకి బాణాలను ఎలా ఎక్కుపెట్టాలి? అలాగే తిరిగి తన పార్టీని పైకి ఎలా లేపాలన్న విషయమై తెగ చర్చలు జరుపుతున్నారట. 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) అలియాస్ పీకే (PK) మంచి విజయాన్ని కట్టబెట్టారు కానీ ఐప్యాక్ మాత్రం నట్టేట ముంచిందని భావనలో ఉన్నారట. 2024లో రుషి రాజ్ సింగ్ (Rushi Raj Singh)తో కలిసి వ్యూహ రచన చేసి రుషికొండపై ప్యాలెస్ నిర్మించి అటు అధికారాన్ని.. ఇటు ప్యాలెస్‌ను దక్కించుకోవాలనుకుంటే రెండూ దెబ్బైపోయాయి. రుషి రాజ్ సింగ్ వేసిన దెబ్బకు రుషికొండ ప్యాలెస్ వైపు కూడా చూడకుండా అయిపోయిందని జగన్ భావిస్తున్నారట. వై నాట్ 175 అంటే.. వై నాట్ కూటమి అని జనం అధికారాన్ని తీసుకెళ్లి కూటమి చేతిలో పెట్టేశారు.
రహస్య వ్యక్తి ఇచ్చే వ్యూహాలను అమలు చేసి..
ఇంత జరిగాక విజ్ఞుడైన రాజకీయ నేత (Political Leader) ఎవరైనా అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనేది అన్వేషించుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ దెబ్బేసిందని.. అందుకే తాము ఓడిపోయామని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఒక కొత్త వ్యూహకర్త కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారట. ఈ క్రమంలో గాలించి గాలం వేసి మరీ ఆ కొత్త వ్యూహకర్తను పట్టుకున్నారట. కానీ బయటకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారట. సదరు రహస్య వ్యక్తి ఇచ్చే వ్యూహాలను అమలు చేసి 2029లో అధికారంతో పాటు రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace)ను దక్కించుకోవాలనేది జగన్ ప్లాన్ అని తెలుస్తోంది. ఈసారి క్యాడర్‌కే పెద్ద పీట వేస్తామని చెప్పి పార్టీ కేడర్‌ను ఉత్సాహ పరిచే మాటలను అయితే వైసీపీ (YCP)చెబుతోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ (Medical College)ల మీద పోరు బాట పట్టిన విషయం తెలిసిందే. ఇది కూడా జగన్ కొత్తగా నియమించుకున్న వ్యూహకర్త స్ట్రాటజీయేనని అంటున్నారు. మొత్తానికి మళ్లీ ఆపరేషన్ అధికారం.. ఆపరేషన్ రుషికొండ ప్యాలెస్‌ను జగన్ అయితే ప్రారంభించారని ప్రచారం గట్టిగానే జరుగుతోంది.
ప్రజావాణి చీదిరాల