YSRCP: ఒకే దెబ్బ.. ఎన్నికలంటేనే భయపడుతున్న వైసీపీ
ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వానికి పూర్తి సానుకూల వాతావరణం ఉండటంతో పాటు.. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కంచుకోట అయిన పులివెందుల (Pulivendula)లో వైఎస్సార్‌సీపీ (YSRCP)ని చావుదెబ్బ కొట్టడం వంటివి ఆ పార్టీకి ఫుల్ జోష్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను సైతం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) అనేదే లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే తొలుత మున్సిపల్ ఎన్నికలు (Muncipal Elections).. ఆపై వరుసగా పంచాయతీ, ప్రాదేశిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటూ అధినేతల నుంచి సూచనలు కూడా అందినట్టు సమాచారం.
రాష్ట్రం మొత్తం ఎలా ఉందో తెలియక..
అంతా బాగానే ఉంది కానీ వైసీపీ (YSRCP) పరిస్థితి ఏంటనేది మాత్రం ఏమాత్రం అర్ధం కాకుండా ఉంది. తమ పార్టీకి కంచుకోట అయిన పులివెందులతో పాటు ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ ఆత్మావలోకనంలో పడిపోయింది. జగన్ సొంత నియోజకవర్గంలోనే అలాంటి పరిస్థితి ఎదురవడంతో రాష్ట్రం మొత్తం ఎలా ఉందో అర్థం కాక ఆ పార్టీ సతమతమవుతోంది. పైగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత పూర్తిగా బెంగుళూరు ప్యాలెస్‌కే పరిమితమవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. గెలిచిన వారి కంటే ఓడిన వారు ఎక్కువగా జనాల్లో ఉండి పోరాడాలి. కానీ ఆ పార్టీ అధినేత ఆ పని చేయడం లేదు సరికదా.. అసెంబ్లీ మొహమే చూడటం లేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను సైతం అటుగా వెళ్లనీయడం లేదు. ఇలాంటి తరుణంలో జనాల్లో వైసీపీ కనుమరుగవడం ఖాయమే కదా.
విజయం సాధించే అవకాశమే లేదు..
పైగా కూటమి ప్రభుత్వం ఏ విషయంలోనైనా లోటు చేస్తే వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం జనరంజకంగా పాలించుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ పోటీ చేసినా కూడా విజయం సాధించే అవకాశమే కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే (YCP Leaders) చెబుతున్నారు. పైగా జగన్ కంచుకోటకే బీటలు వారితే మిగిలిన స్థానాల పరిస్థితేంటని ఆ పార్టీ నేతలు అంటున్నట్టుగా తెలుస్తోంది. పోనీ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలు వద్దకు వెళ్లే అవకాశం ఉందా? అంటే అదీ లేదు. మా సమస్యలు ఏం తీర్చావని జనాలు అడుగుతారు. ఏనాడైనా అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడావా? అని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ బాధ పడే బదులు సైలెంట్‌గా ఉంటే మేలనే భావన కూడా ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నట్టు టాక్.
గెలుస్తామన్న నమ్మకం లేని దానికి..
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ తన అధికారాన్ని వినియోగించుకుని దాదాపుగా రాష్ట్రాన్ని తమకు ఫేవర్‌గా మార్చుకుందనేది అప్పట్లో టీడీపీ (TDP) ఆరోపణ. ఈనేపథ్యంలోనే ప్రాదేశిక ఎన్నికలను సైతం బహిష్కరించింది. కానీ ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.. వినియోగించుకుంటుందని జనాలు భావించడమూ లేదు. అయినా సరే.. వైసీపీ మాత్రం ధైర్యం చేయడం లేదని అంటున్నారు. ఏకోశాన తమ పార్టీ గెలుస్తుందని నమ్మకం లేదనేది ఆ పార్టీ వాదన. పైగా ఇప్పుడు ఎన్నికలనేవి డబ్బుతో కూడుకున్నవి. పోటీ చేసి గెలుస్తామన్న నమ్మకం లేని దానికి డబ్బు పెట్టేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యంలో వైసీపీ ఏపీలో జరుగనున్న ఎన్నికలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమనే ఆలోచనలో ఉందని సమాచారం. మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఆ పార్టీ నేతలు ఏమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి.
ప్రజావాణి చీదిరాల