Politics

2029 Elections: కూటమి విచ్ఛిన్నానికి వైసీపీ పక్కా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

మనం బలపడాలంటే ఎదుటి వ్యక్తిని బలహీనం చేస్తే సింపుల్‌గా సరిపోతుంది. ఈ విషయాన్ని వైసీపీ బాగా తలకెక్కించుకున్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఓ వెలుగు వెలిగి.. తదనంతర పరిణామాల కారణంగా బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం ఓ విషయం చెప్పారు.

2029 Elections: కూటమి విచ్ఛిన్నానికి వైసీపీ పక్కా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ, 2029 వ్యూహాలు అప్పుడే సెంటాఫ్ అట్రాక్షన్‌గా మారాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఏం చేయాలనే విషయమై వైసీపీకి స్పష్టత వచ్చినట్టుగా జరుగుతున్న అంతర్గత పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది. ఒకవైపు పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకుంటూనే మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది.

మనం బలపడాలంటే ఎదుటి వ్యక్తిని బలహీనం చేస్తే సింపుల్‌గా సరిపోతుంది. ఈ విషయాన్ని వైసీపీ బాగా తలకెక్కించుకున్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఓ వెలుగు వెలిగి.. తదనంతర పరిణామాల కారణంగా బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం ఓ విషయం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చీలికలు తెస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధ్యం కాదని తేల్చేశారు. ఆ హింట్‌ను వైసీపీ నేతలు గట్టిగానే పట్టేశారు. అందుకే చీలికల కోసం మంట పెడుతున్నారు.

లోకేష్‌కు లైన్ క్లియర్..

సీఎం చంద్రబాబు తన వారసుడు లోకేష్‌ను 2029 నాటికి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పక్కా స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. లోకేష్ ఇప్పటికే పాదయాత్ర ద్వారా తనను తాను నిరూపించుకున్నారని.. అయితే పవన్ కళ్యాణ్ వంటి బలమైన నాయకుడు పక్కన ఉంటే లోకేష్‌కు ఇబ్బందులు తప్పవని సీబీఎన్ భావిస్తున్నారంటూ కొత్త కథనాలకు తెరదీస్తున్నారు. అందుకే ‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అన్న సామెతను దృష్టిలో పెట్టుకుని, పవన్‌ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి జాతీయ స్థాయికి పంపేలా పావులు కదుపుతున్నారంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి కూటమి నేతలంతా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. అసలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒకవైపు వైనాట్ 175 అంటూనే జనసేన నేతల్లో అగ్గి రగిల్చారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అలాంటి వాటిని తలకెక్కించుకోవద్దని గట్టిగా తమ పార్టీ నేతలకు క్లాస్ పీకి మరీ ఒకతాటిపై నడిపించారు. అప్పుడు సాధ్యం కాని ప్రణాళికలను.. వచ్చే ఎన్నికల్లో అయినా అమల్లో పెట్టాలని వైసీపీ యోచిస్తోంది.

కూటమిలో చిచ్చుకు మంటలు..

మరోవైపు ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం పవన్ కళ్యాణ్‌ను కేవలం ఏపీకే పరిమితం చేయకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారట. సనాతన ధర్మంపై పవన్ గళం ఎత్తిన తీరు ఢిల్లీ పెద్దలను బాగా ఆకర్షించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ జెండా పాతడానికి పవన్ సినీ గ్లామర్‌ను వాడుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి బీజేపీ అగ్ర నేతలు సినీ గ్లామర్‌కు ఎక్కడైనా పెద్ద పీట వేస్తారనడంలో సందేహమే లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ చేస్తున్నది ఇదే. దీనిని హైలైట్ వైసీపీ శ్రేణులు పక్కా ప్రణాళిక ప్రకారం హైలైట్ చేస్తున్నాయి. పవన్‌ను సెంటర్‌లో ‘కింగ్ మేకర్’ను చేసి, ఏపీలో లోకేష్‌ను ‘కింగ్’ను చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యమని గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి కూటమిలో చిచ్చు రేపేందుకు మంటలు పెద్ద ఎత్తున పెడుతున్నారనడంలో సందేహం లేదు.

జనాల్లోకి రాకుంటే..

‘ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఏమీ లేని చోట ఏదేదో ఉందన్నట్టుగా అపోహలు సృష్టిస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల తీరు. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అంటే సందేహమే. ఒకవైపు తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం బయటకు వచ్చి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఆ పార్టీ.. ఇటువంటివన్నీ సృష్టించి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు చూస్తోందని.. టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన అగ్ర నేతలైతే ఈ ప్రచారానికి అనవసర ప్రాధాన్యమిచ్చి హైలైట్ చేయలేక లైట్ తీసుకుంటున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే.. జనాల్లోకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని ఇలాంటి వ్యూహాలకు పదును పెడితే 2029లోనే కాదు.. 39 వచ్చినా పార్టీని నిలబెట్టుకోలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 25, 2026 5:37 AM