AP News: చంద్రబాబు ‘మినిట్స్’పై వైచీప్ పాలిట్రిక్స్.. మీరిక మారరా?
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ చేసే విమర్శ సరైనదై ఉండాలి. లేదంటే బూమరాంగ్ అయి తిరిగి విమర్శ చేసిన వారి మెడకే చుట్టుకుంటుంది. ప్రస్తుతం వైసీపీ (YCP) పరిస్థితి ఇదే.
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ చేసే విమర్శ సరైనదై ఉండాలి. లేదంటే బూమరాంగ్ అయి తిరిగి విమర్శ చేసిన వారి మెడకే చుట్టుకుంటుంది. ప్రస్తుతం వైసీపీ (YCP) పరిస్థితి ఇదే. ఏపీని మొంథా తుపాను (Cyclone Montha) వణికిస్తోంది. జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో వీలైతే సహాయక చర్యల్లో పాల్గొనాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇళ్లల్లో కూర్చొని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)ను ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో పరిస్థితి భయానకంగా ఉంది. అలాగని ప్రస్తుత సీఎం చంద్రబాబు (Chandrababu) తుపానులకు భయపడి పోయి ఇంట్లో కూర్చొని ఆదేశాలు జారీ చేసే రకం కాదు. పోనీ పరదాలు కట్టుకుని మరీ అత్యంత జాగ్రత్తగా వెళ్లి ఎవరూ లేని చోట.. పంట పొలాలకు చేతులు ఊపుతూ హాయ్, బాయ్ చెప్పొచ్చే రకం అంతకన్నా కాదు. ఫీల్డ్‌లోకి వెళ్లి అక్కడ కూర్చొని మరీ అన్నీ సెట్ చేస్తారు. ‘హుద్ హుద్’ (Hud Hud) తుపాను సమయంలో అదే జరిగింది. ప్రస్తుతం మొంథా సమయంలోనూ అదే జరుగుతోంది. ఆయన వయసుకి.. ఆయన పడుతున్న కష్టానికి సెల్యూట్ చేయాల్సింది పోయి.. వైసీపీ నేతలు ఇళ్లలో కూర్చొని తమ టీంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తుండటం గమనార్హం.
క్షణ క్షణం పరిస్థితులపై సమీక్ష
నిన్న రాత్రి 12 గంటల వరకూ చంద్రబాబు సచివాలయం (AP Secretariat)లోనే ఉండి క్షణక్షణం పరిస్థితులను సమీక్షించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి.. తిరిగి ఉదయం 5 గంటల నుంచే తుపాను సహాయక చర్యలపై ఫోకస్ చేశారు. వివిధ వర్గాల నుంచి అలాగే ప్రసార మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రభుత్వాధికారులను అలర్ట్ చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యాప్త పరిస్థితిపై సీఎంవో (AP CMO), ఆర్టీజీ అధికారులతో చర్చించారు. ఉదయం 10 గంటలకు గ్రామ స్థాయి పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫీల్డ్‌లో ఉండి ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకున్న చర్యలను అభినందించారు. అలా మినిట్ టు మినిట్ చంద్రబాబు పని చేస్తూనే ఉన్నారు.
రైతులకు నష్ట పరిహారం..
మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎలాంటి భద్రతా లేకుండా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలి.. సాధారణ వాహనంలో సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల సమీపంలోని పునరావాస కేంద్రంలో దాదాపు అరగంట సేపు తుఫాను బాధితులతో మాట్లాడారు. స్వయంగా బాధిత ప్రజలకు నిత్యావసరాలను పంపిణి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అరగట్ల పాలెం, బెండమూరు లంకలో నీటి మునిగిన పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు హెలికాఫ్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహిస్తూనే మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికీ ఆయన అధికారులతో తుపాను గురించి చర్చిస్తూనే ఉన్నారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీని వదిలి..
అలాంటి చంద్రబాబు గురించి ఇంట్లో కూర్చొన్న నేతలు.. చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే మాత్రమే చేస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీని వదిలి.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిలా.. తన వయసును సైతం లెక్కచేయకుండా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వ్యక్తిపైనా ఈ విమర్శలు? నవ్విపోదురుగాక.. అసలు ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అధికార పార్టీ మాత్రమే సాయం చేయాలన్న రూల్ ఏమైనా ఉందా? మానవత్వమున్న మనుషులంతా రంగంలోకి దిగి తమవంతు సాయం అందించవచ్చు. అది చేయాల్సింది పోయి.. ట్రోల్స్ చేయించడమేంటి? దీనిపై ఏపీ ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఇది టీడీపీ కార్యకర్తలకు సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తుపాను సంభవించిన సమయంలో జగన్ జరగాల్సిన నష్టమంతా జరిగాక తీరికగా పరదాల మాటున వెళ్లి చెట్లను.. పుట్లను పలకరించి వచ్చిన వీడియోలను పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అవసరమా? కామ్‌గా ఇంట్లో కూర్చుంటే పోయేదానికి అనడం.. అనిపించుకోవడం అవసరమా? ఈ వైసీపీ నేతలిక మారరా? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల