Politics

Amaravathi: జగన్ మారరా? తగ్గి ఉండాల్సిన తరుణంలో ప్లాన్ బీలా?

వైసీపీ అధినేత, మాజ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా తత్వం బోధపడనట్టు లేదు. ఊరంతా ఒక దారైతే.. ఉలికి పిట్టది మరో దారి అన్నట్టుగా రాష్ట్రమంతా తమకు రాజధాని ఖరారవుతోందని సంబరాల్లో ఉంటే.. వైసీపీ అధినేత మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు.

Amaravathi: జగన్ మారరా? తగ్గి ఉండాల్సిన తరుణంలో ప్లాన్ బీలా?

వైసీపీ అధినేత, మాజ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా తత్వం బోధపడనట్టు లేదు. ఊరంతా ఒక దారైతే.. ఉలికి పిట్టది మరో దారి అన్నట్టుగా రాష్ట్రమంతా తమకు రాజధాని ఖరారవుతోందని సంబరాల్లో ఉంటే.. వైసీపీ అధినేత మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు తగ్గితేనే నెగ్గుతారు. కానీ ఆయనకు అదసలు అలవాటే లేనట్టుంది. ఏది ఏమైనా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటున్నారు. ఏపీ ప్రజలందరి ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో గొంతు కలిపితే హుందాగా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్ర ప్లాన్ ఏ, బీలంటూ తన క్రెడిబిలిటీని దెబ్బతీసుకుంటున్నారు.

మావిగాన్ పేరుతో..

అవును.. ఏపీ రాజధానికి ప్లాన్ ఏ, బీలు ఉన్నాయట. అమరావతి రాజధాని మీద కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం.. లోక్‌సభ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇవాళ రాజ్యసభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో అమరావతికి చట్ట బద్ధత వచ్చేస్తుంది. దాంతో ఎవరు అవునన్నా.. కాదన్నా అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుంది. కానీ జగన్ దీనికి అంగకరించేలా లేరు. పాడిందే పాటరా.. పాసిపళ్ల దాసరా అన్నట్టుగా మళ్లీ అదే పాటను అందుకుంటున్నారు. విశాఖ రాజధాని అయితే బాగుంటుంట. తనిచ్చిన మూడు రాజధానుల ప్లాన్ నచ్చలేదు కాబట్టి ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ మొత్తం 110 కిలోమీటర్ల మేర మావిగాన్ పేరుతో కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రకటించమని కోరారు. అదేదో ముందే సూచిస్తే ఎలా ఉండేదో.. ఇప్పటి వరకూ చోద్యం చూసి సలహాలివ్వడమేంటి?

సలహాలిస్తే ఎలా?

మొత్తానికి అమరావతి రాజధాని అయితే ఫిక్స్. 2014లోనే దీనికి అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. అప్పటి నుంచే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి అటకెక్కింది. మూడు రాజధానులంటూ హంగామా చేసి.. రాజధానుల అంశాన్ని పక్కనబెట్టి తనకు వైజాగ్ రుషికొండలో ప్యాలెస్‌ను మాత్రం నిర్మించేసుకున్నారు జగన్. సీన్ కట్ చేస్తే తిరిగి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరిగి అమరావతి ప్రాణం పోసుకుంటోంది. ఈ సమయంలోనే అమరావతికి చట్టబద్దత కూడా వచ్చేస్తోంది. ఇంత జరుగుతుంటే.. దీనికి ఓకే చెబితే వైసీపీపై అంతో ఇంతో సింపతి పెరుగుతుంది. అది కాదని.. ఇంకా రాజధాని అలా అయితే బాగుంటుంది.. ఇలా అయితే బాగుంటుందని సలహాలిస్తే ఎలా? అమరావతిని అయితే వ్యతిరేకించమని చెబుతూనే ప్లాన్ బీ అంటూ ప్రతిపాదనలు తీసుకురావడం ఎంత వరకూ సబబు?

సైలెంట్ అయితే బెటర్..

ఏదైనా మాట్లాడే ముందు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు చెప్పవచ్చు కానీ దానికంటూ ఒక సమయం ఉంటుంది కదా. ఏపీ ప్రజలకు చెప్పుకోవడానికి ఒక రాజధాని అంటూ లేకపోవడం గత దశాబ్ద కాలంగా కలచివేస్తోంది. అమరావతికి చట్టబద్దత వస్తుండటంతో ఏపీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తగుదునమ్మా అంటూ సలహాలిస్తే ఎలా? ఇప్పుడు ఎంత తగ్గి ఉంటే అంత వైసీపీకే ఉత్తమం. లేదు హంగామా చేస్తామంటే జనాల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రతిపక్ష హోదా లేదని ఇంతకాలం గొడవ.. ఇప్పుడు రాజధాని గురించి హంగామా.. అమరావతి రాజధానిగా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక వైసీపీ నేతలు సైలెంట్ అయిపోతే బెటర్. లేదంటే దెబ్బ గట్టిగానే తగులుతుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 2, 2026 5:19 AM