Politics

Kavitha: మారిన కట్టూ బొట్టు.. ‘అమ్మ’వుతారా? మరో షర్మిలవుతారా?

తెలంగాణలో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా పోరాటం చేస్తున్నారా? లేదంటే ఏదో రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి పోరాటం చేస్తున్నారా? ఒకవేళ పోరాడితే ఏ పార్టీ తరుఫున పోరాడుతున్నట్టు?

Kavitha: మారిన కట్టూ బొట్టు.. ‘అమ్మ’వుతారా? మరో షర్మిలవుతారా?

భారత్‌ ఎంత అభివృద్ధి చెందినా కూడా మహిళామణులకు రాష్ట్రాన్ని పాలించే అధికారం దక్కడం దుర్లభం. ప్రస్తుతం దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు సీఎంలుగా ఉన్నారు? కేవలం రెండంటే రెండు. మిగిలిన రాష్ట్రాలన్నీ పురుషుల చేతిలోనే ఉన్నాయి. అలాంటి దేశంలో రాష్ట్రంలో ఒక మహిళ అధికారం దక్కించుకోవాలంటే అంత సులభమా? అంటే కాదు.. చాలా కష్టపడాలి. జనాలకు తలలో నాలుకలా మారాలి.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా పోరాటం చేస్తున్నారా? లేదంటే ఏదో రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి పోరాటం చేస్తున్నారా? ఒకవేళ పోరాడితే ఏ పార్టీ తరుఫున పోరాడుతున్నట్టు? అసలు ఆమె జెండా ఏంటి? అజెండా ఏంటి? చుక్కాని లేని నావలా ఎంతకాలం పోరాటం? వాస్తవానికి కవితను అందరితో పోల్చకూడదు. ఎందుకంటే.. ఆమె జనంలో నుంచి రాలే.. జనం కోసం ఏనాడు నిలబడింది కూడా లేదనేది విమర్శకులు అంటున్న మాట.

పదేళ్ల పాటు అధికారం ఆ కుటుంబానిదే..

2014లో తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత అప్పట్లో టీఆర్ఎస్ (TRS) పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కేసీఆర్ (KCR) తనయురాలిగా కవిత (Kavitha) రాష్ట్ర ప్రజలందరికీ పరిచయమయ్యారు. అంతకు ముందు కూడా ఉండి ఉండొచ్చు. కానీ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆ తరువాత కూడా జనం కోసం ఆమె చేసిందేమీ లేదు. పదేళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే అధికారం ఉంది. ఆ సమయంలో జనాలకు బాగా దగ్గరై వారికి తలలో నాలుకలా మారి ఉంటే.. ఈరోజు కవిత పెద్దగా కష్టపడాల్సి వచ్చేది కాదు. కానీ అధికారాన్ని అనుభవించడం.. డబ్బు కూడబెట్టుకోవడం మీద చూపించిన శ్రద్ధ జనాలపై చూపించలేదనేది కాంగ్రెస్ పార్టీ నేతలు (Congress Party Leaders) అంటున్న మాట. జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత కనీసం మహిళలకైనా దగ్గరయ్యారా? అంటే అదీ లేదు.

జయతో కవితకేం పోలిక?

అసలు నేడు ఆమె కోరుకుంటున్నదేంటన్న విషయంలోనూ స్పష్టత లేదు. బీఆర్ఎస్ (BRS) నుంచి కవితను తండ్రి బయటకు పంపించేశారు. పార్టీ బయటకు వచ్చేశాక ముఖ్యంగా ఇటీవలి కాలంలో కవితను చూసిన వారికి ఏంటి ఈవిడ స్టైల్ మార్చేశారు అనిపించక మానదు. లూజ్ హెయిర్ కాస్త ముడికి వచ్చేసింది. ప్లెయిన్ శారీస్.. ఎవరినో ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది శీనా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఆమె కట్టు బొట్టు వ్యవహార శైలి అంతా చూస్తుంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)ను అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ అసలు జయతో కవితకేం పోలిక? సినీ రంగం నుంచి రాజకీయరంగ ప్రవేశం చేసిన జయలలిత తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

మరో షర్మిల అవుతారా?

ఎంజీఆర్ (MGR) ఉన్నంత వరకూ పరిస్థితులు బాగానే ఉన్నా ఆయన మరణం తర్వాత చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. చివరికి సభలో నాడు పాంచాలికి జరిగిన పరాభవం కూడా జరిగింది. వాటన్నిటినీ ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగారు జయ. మరి కవిత (Kavitha)లో అంత పోరాట పటిమను మనమైతే ఏనాడూ చూసింది లేదు. కట్టూ బొట్టుతో అమ్మవుతారా? అంటే కష్టమే. అది జరిగే పనే కాదు. కవిత.. జయ అవుతారో లేదో కానీ మరో షర్మిల (YS Sharmila) అవుతారని మాత్రం తెలంగాణ (Telangana)లోని కొందరంటున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ (YSRTP)ని స్థాపించి షర్మిల వాస్తవానికి బాగానే కష్టపడ్డారు. పాదయాత్ర చేశారు. కానీ ఫలితాన్ని మాత్రం రాబట్టుకోలేకపోయారు. చివరకు పార్టీని కాంగ్రెస్‌ (Congress)లో విలీనం చేసి తట్టా బుట్టా సర్దుకుని ఏపీకి వెళ్లిపోయారు. కవితది కూడా అదే పరిస్థితని కాకపోతే కవిత సొంత రాష్ట్రం ఇదే కాబట్టి ఆమె తన ఇంటికి పరిమితమవుతారని అంటున్నారు.

రాజకీయంగా ముందుకెళ్లేదెన్నడు?

ఏదేని రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఎదగాలంటే.. అది ఇప్పటికిప్పటికి అయ్యే పని కాదు. ఆది నుంచి జనంలోనే ఉండాలి. అసలు ముఖ్యమంత్రి విషయం పక్కన పెడితే ఆమె ఒక రాజకీయ పార్టీ (Political Party)ని అయినా పెట్టే యోచనలో ఉన్నారా? అనేది తెలియకుండా ఉంది. ఒకవేళ పార్టీ పెట్టినా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న నమ్మకమూ లేదు. ఆ మాటకొస్తే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. అలాంటిది కవితను ఆదరిస్తారని ఎలా అనుకుంటాం? పైగా లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో జైలుకు వెళ్లొచ్చిన ఆమెపై అవినీతి మరకలు అలాగే ఉన్నాయి. వాటన్నింటినీ చెరిపేసుకునేదెన్నడు? రాజకీయంగా ముందుకెళ్లేదెన్నడు? ముఖ్యంగా ఒక అజెండా ఏమైనా ఉందా? లేదంటే గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఏదో చేసుకుంటూ వెళుతున్నారా? అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 29, 2025 1:09 PM