Politics

ఆ ఒక్క మాటతో హాట్ టాపిక్‌గా రేవంత్.. నిజంగానే వస్తారా?

రాజకీయాల్లో డైలాగ్ వార్స్ సర్వసాధారణమే. కానీ కొన్ని సవాళ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సత్తా చూపించేలా ఉంటాయి. అలాంటి సవాలే సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఎదురైంది.

ఆ ఒక్క మాటతో హాట్ టాపిక్‌గా రేవంత్.. నిజంగానే వస్తారా?

రాజకీయాల్లో డైలాగ్ వార్స్ సర్వసాధారణమే. కానీ కొన్ని సవాళ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సత్తా చూపించేలా ఉంటాయి. అలాంటి సవాలే సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఎదురైంది. సవాల్ విసిరిందెవరో అనామకుడు అయితే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన సవాల్‌ను రేవంత్ సీరియస్‌గా తీసుకుని చరిత్రలో ఏ సీఎం కూడా చేయని సాహసానికి ఒడిగట్టేందుకు సిద్ధమయ్యారు. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటి? రేవంత్ ఏం సాహసం చేయనున్నారో చూద్దాం.

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) వర్సెస్ సీఎం రేవంత్ (CM Revanth Reddy) మధ్య డైలాగ్ వార్ నడిచింది. సర్వసాధారణంగా సీఎం ఒక ప్రదేశానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే సెక్యూరిటీ భారీగానే ఉంటుంది. అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే.. కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనో అదీ కాదంటే కేసీఆర్ (KCR) హయాంలోనో నడుస్తున్నది కాదు. అలాగే రేవంత్ ఉస్మానియా పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులను సైతం అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. రేవంత్ పర్యటన సందర్భంగా విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. దమ్ముంటే పోలీసులు (Police) లేకుండా ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా రేవంత్‌కు మాటలెక్కువ.. చేతలు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఇనుప కంచెల నడుమ ఉస్మానియాకు పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్ వెళ్లారన్నారు. ఎప్పుడూ రేవంత్ కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతుంటారంటూ ఎద్దేవా చేశారు.

ఒక్క పోలీస్ కూడా లేకుండా చూస్తా..

హరీష్‌రావు మాటలపై రేవంత్ సైతం గట్టిగానే స్పందించారు. మరోసారి తాను ఉస్మానియా (OU)ను సందర్శిస్తే పోలీసులు ఒక్కరు కూడా లేకుండా వస్తానంటూ హరీష్‌కు బదులిచ్చారు. అది ఎప్పుడో కాదు... ఈ ఏడాది డిసెంబర్‌లో ఒక్క పోలీసు కూడా లేకుండా వస్తానన్నారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చిందైతే లేదు. కానీ రేవంత్ ఏకంగా ఉస్మానియాకే వస్తానని చెప్పారు. సభ పెడతానన్నారు. ఆ సమయంలో ఉస్మానియా ప్రాంగణంలోనే ఒక్క పోలీస్ కూడా లేకుండా చూస్తానని రేవంత్ స్పష్టం చేశారు. ఇది కాస్త విస్మయం కలిగిస్తోంది. నిజంగానే సీఎం రేవంత్ ఒక్క పోలీస్ కూడా లేకుండా వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయనలా వస్తే మాత్రం ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతారనడంలో సందేహం లేదు. పైగా ఉస్మానియా అభివృద్ధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నారు. మొత్తానికి ఉస్మానియా విద్యార్థుల కళ్లలో ఆనందాన్ని అయితే రేవంత్ నింపారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 40 వేల పోస్టులు భర్తీ చేసతామన్నారు. ఇవన్నీ పక్కనబెడితే ఎక్కడ చూసినా సీఎం రేవంత్ పోలీస్ ప్రొటక్షన్ లేకుండా ఉస్మానియాకు వస్తాననడమే హాట్ టాపిక్‌గా మారింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 26, 2025 7:03 AM