Politics

Pawan Kalyan: పవన్, భట్టి ఆ శాపాన్ని తొలగించుకుని సీఎం అవుతారా?

సింహాసనం చెంతనే ఉంటారు.. కానీ, సింహాధిపతి మాత్రం కాలేరు. నిన్నామొన్నటి దాకా ‘కాబోయే సీఎం’ అనిపించుకున్నా.. ఆఖరికి రాజ్యాంగేతర ‘ఉప’ హోదాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Pawan Kalyan: పవన్, భట్టి ఆ శాపాన్ని తొలగించుకుని సీఎం అవుతారా?

సింహాసనం చెంతనే ఉంటారు.. కానీ, సింహాధిపతి మాత్రం కాలేరు. నిన్నామొన్నటి దాకా ‘కాబోయే సీఎం’ అనిపించుకున్నా.. ఆఖరికి రాజ్యాంగేతర ‘ఉప’ హోదాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాజకీయాలలో అత్యంత సున్నితమైన, అంతకుమించి అదృష్టాన్ని పాడుచేసే పదవి ఏదైనా ఉందంటే అది ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) పదవులే అని చెప్పవచ్చు.

ఈ దేశంలో ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా, ఈ పదవులను అధిరోహించిన నేతలంతా, గెలుపు గడపకు వచ్చి కూడా, కీలక పదవిని అందుకోలేకపోయారు. రాజ్యాంగం ప్రకారం ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడా లేవు. ఇవి కేవలం సంకీర్ణ ధర్మం కోసమో, లేదా ప్రాంతీయ, కుల సమీకరణాల కోసమో రాజకీయ అవసరాల మేరకు ఏర్పాటు చేసుకున్న పదవులు. అధికారం, బాధ్యత సీఎం, పీఎం చుట్టూ తిరుగుతుంటే... ఈ ఉప పదవి కేవలం ప్రోటోకాల్ కోసమే అన్నది నిష్టుర సత్యం.

చరిత్రలోకి వెళ్దామా..?

దేశ చరిత్రను పరిశీలిస్తే, తొలి ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ ఉన్నా, ఆ తర్వాత ఆ హోదాలో పనిచేసిన నాయకులు ప్రధానులుగా ఎదిగిన దాఖలాలు లేవు. 1990లలో దేవీలాల్, 2002లో లాల్ కృష్ణ అద్వానీ (చివరి ఉప ప్రధాని) వంటి బలమైన నేతలు ఆ హోదాలో ఉన్నారు. కానీ, వీరంతా ప్రధానమంత్రి పీఠానికి చేరుకోలేకపోయారు. ఎంతో ప్రతిభ, బలం ఉన్నా, ఆ ‘ఉప’ అనే హోదా పీఎం కుర్చీని దూరం చేసిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, వారిలో ముఖ్యమంత్రులుగా చేసిన వారు చాలా అరుదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏకంగా 15 మందికి పైగా ఈ ఉప హోదాను అనుభవించారు. కానీ, వారిలో ఒక్క నాయకుడు మాత్రమే ఈ ‘పొలిటికల్ యాంటీ సెంటిమెంట్’ను బ్రేక్ చేయగలిగారు. ఆ ఒక్కరే నీలం సంజీవరెడ్డి. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు (1953 అక్టోబర్ 1), ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండగా నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ‘ఉప’ హోదా నుంచి ‘ముఖ్య’ హోదాకు ఎదిగిన ఏకైక నాయకుడు ఆయనే.

బలమైన డిప్యూటీలు..

నీలం వారి తర్వాత ఆ పీఠాన్ని అధిరోహించిన కొండా వెంకట రంగారెడ్డి, జేవీ నరసింగ రావు, బీవీ సుబ్బారెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొనేరు రంగారావు... ఇలా ఎందరో బలమైన నాయకులు ఆ హోదాలో ఉన్నారు. కానీ, వారెవరూ సీఎం కాలేకపోయారు. విభజన ఏపీలోనూ నిమ్మకాయల చిన రాజప్ప, కేఈ క్రిష్ణ మూర్తి, వైసీపీ హయాంలో తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రులు ఈ పదవిని అనుభవించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిద్దరూ తమ తమ పార్టీలలో బలమైన నాయకులే కాదు, వారి అభిమానులు, అనుచరులు, విశ్లేషకుల దృష్టిలో ‘ముఖ్యమంత్రి కావాల్సిన వారు’ గానూ కనిపిస్తారు. కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అదృష్టం వీరిలో ఎంతమేర ఉందనేది మాత్రం తెలియదు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే ఇప్పట్లో వీరికి లేనట్టే..

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే..

కూటమి ఏలుబడిలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు సీఎం స్థాయి ప్రోటోకాల్ లభిస్తోంది. ఆయన పర్యటనల్లో కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలకడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫొటోలు ఉంచడం వంటి విశేష ప్రాధాన్యత కనిపిస్తోంది. అయితే, ఈ హంగామా అంతా ఉన్నా రాజ్యాంగం ప్రకారం ఆయన హోదా మంత్రి కన్నా ఎక్కువ కాదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. మరి ఈ ఇద్దరు బలమైన నేతలు నీలం సంజీవరెడ్డిలా ఆ ‘ఉప’ శాపాన్ని ఛేదించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? ‘చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం’ అన్నట్లుగా, ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న ఈ నాయకులు ‘ముఖ్య’ స్థానాన్ని చేరుకుంటారా? లేక, ఉప ముఖ్యమంత్రి పదవికి అంటిన రాజకీయ యాంటీ సెంటిమెంట్ కొనసాగుతుందా? కాలమే దీనికి జవాబు చెప్పాలి. ఆ శాపాన్ని ఛేదించే తదుపరి నేత ఎవరో చూడాల్సిందే!

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 4, 2025 8:05 AM