Politics

Nara Lokesh: నారా లోకేష్ ఇలా తడబడ్డారేంటి? చంద్రబాబు తప్పు చేశారా?

ఒకప్పుడు నారా లోకేష్‌కి.. ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసేవారు గుర్తించే ఉంటారు. మాట్లాడటానికే తడబడే నారా లోకేష్ ఎక్కడ? తడుముకోకుండా సమాధానాలిచ్చే నారా లోకేష్ ఎక్కడ?

Nara Lokesh: నారా లోకేష్ ఇలా తడబడ్డారేంటి? చంద్రబాబు తప్పు చేశారా?

ఒకప్పుడు నారా లోకేష్‌కి.. ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసేవారు గుర్తించే ఉంటారు. మాట్లాడటానికే తడబడిన నారా లోకేష్ ప్రస్తుతం తడుముకోకుండా సమాధానాలిస్తున్నారు. గతంలో చంద్రబాబుకి రాజకీయ వారసుడిగా లోకేష్ పనికిరారనే వారి మనసుల్లోనూ మార్పొచ్చింది. నారా లోకేష్ తనను తాను అంతలా మార్చుకున్నారు. తాజాగా ఆయన నేషనల్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఏమాత్రం తొణక్కుండా సమాధానం చెప్పిన నారా లోకేష్ కొన్ని కార్నర్ చేసే సమాధానాలకు ఒకింత తడబడ్డారనే చెప్పాలి.

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) యాభై ఏళ్ల రాజకీయ అనుభవం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ ఆయన పరోక్షంగా చక్రం తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావాలనుకుంటే ప్రత్యక్షంగానూ ఆయన చక్రం తిప్పగలరు. ఎందుకోగానీ చంద్రబాబు (Chandrababu) ఏపీని వీడటం లేదు. జాతీయ స్థాయిలో టీడీపీ (TDP) కీలక పాత్ర పోషిస్తున్నా కూడా కేంద్రాన్ని గొంతెమ్మ కోరికలు కోరకుండా ఆయన చాలా హూందాగా వ్యవహరిస్తున్నారు. అలాంటి చంద్రబాబును నారా లోకేష్ (Nara Lokesh) గల్లీ లీడర్ అనేశారా? పొరపాటున కూడా ఆ మాట మాట్లాడకూడదు కదా.. నోరు జారితే తిరిగి తీసుకోలేం. అంత పెద్ద మాట ఎలా అనగలిగారు. ఆయన ఉద్దేశంలో గల్లీ లీడర్ అంటే రాష్ట్ర స్థాయి అయి ఉండొచ్చుగాక.. కానీ అంతా అలా తీసుకోవాలని లేదుగా.. ప్రస్తుతం ఈ మాట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చాలా ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా సమాధానాలిచ్చిన నారా లోకేష్ ఇలాంటి చోట్ల మాత్రం తడబడ్డారనడంలో సందేహం లేదు.

ప్రధాని అయ్యే అవకాశం ఉందా?

జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూ అంటేనే ఇరుకున పెట్టే ప్రశ్నలుంటాయి. వాటికి చాలా జాగ్రత్తగా సమాధానం చెయ్యాలి. లేదంటే చిక్కుల్లో పడక తప్పదు. నారా లోకేష్‌కి ఎదురైన చిక్కు ప్రశ్నల్లో ఒకటి.. బాబు ఫ్యూచర్‌లో ప్రధాని అయ్యే అవకాశం ఉందా? అని. వాస్తవానికి దీనికి నారా లోకేష్ చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగితే బాగుండేది. కానీ దానికి కొనసాగింపుగా ఒక మాట మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. చంద్రబాబు రెండు కళ్లూ ఏపీ మీదే ఉన్నాయని.. సొంత రాష్ట్ర ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని తెలిపారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది.. తాము గల్లీ లీడర్లమనే మాట వాడారు. చంద్రబాబు గల్లీ లీడరేంటి? జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న నేతను అలా అనడమేంటనేది? సొంత పార్టీ నేతలే విస్తుబోతున్నారు. ఇది మాత్రమే కాదు.. మరో ప్రశ్నకు కూడా లోకేష్ ఒకింత తడబడ్డారనడంలో సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఎదురైన ప్రశ్న కూడా అలాంటిదే.

లోకేషైనా చర్యలు తప్పవు..

2019లో బీజేపీ (BJP)కి ఎన్డీయే (NDA)కు యాంటీగా విపక్షాలను కలుపుకుని బాబు జాతీయ స్థాయిలో ప్రచారం చేసిన విషయమై జాతీయ మీడియా (National Media) నారా లోకేష్‌ను ప్రశ్నించింది. దానికి జవాబుగా నారా లోకేష్.. మనమంతా మనుషులం కాబట్టి ఒక్కోసారి తప్పు చేయడం సర్వసాధారణం అన్నట్టుగా సమాధానమిచ్చారు. వాస్తవానికి దీనికి సమాధానం చెప్పడమనేది కాస్త కష్టమే. కానీ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టడం తప్పు అనడం ఎంతవరకూ సబబు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు చేయడం తప్పిదమని లోకేష్ ఎలా అంటారనేది ప్రధాన ప్రశ్న. పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు పోరాటం చేయాల్సి వచ్చిందని చెబితే బాగుండేది. చంద్రబాబును గతంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) అరెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మీరు అరెస్ట్‌లకు శ్రీకారం చుడతారా? అంటే రాష్ట్ర ప్రయోజనాలు తప్ప కక్షలు, కార్పణ్యాలనేవి ఉండవని.. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం చంద్రబాబు ఉపేక్షించరని చెప్పారు. అలా తప్పు చేస్తే మాత్రం నారా లోకేష్ అయినా మరొకరైనా చంద్రబాబు చర్య తీసుకుంటారని చెప్పి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్.. ఒకట్రెండు విషయాల్లో తడబడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 9, 2025 7:01 AM