Politics

TG News: ప్చ్.. జూబ్లీలో గెలిచిన సుఖం లేకపాయే.. ఇద్దరు మంత్రులపై హైకమాండ్ సీరియస్!

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపుతో తన బలాన్ని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.

TG News: ప్చ్.. జూబ్లీలో గెలిచిన సుఖం లేకపాయే.. ఇద్దరు మంత్రులపై హైకమాండ్ సీరియస్!

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపుతో తన బలాన్ని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ గెలుపు సంబరాల మధ్య కూడా పార్టీలోని కొందరు కీలక నేతల అంతర్గత వైఫల్యాలు ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరాయి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు మంత్రులలో ఒకరు పార్టీలో సుదీర్ఘ రాజకీయ జీవితం, క్లీన్ ఇమేజ్ ఉన్న కట్టర్ కాంగ్రెస్ నేత కాగా, మరొకరు ముఖ్య నాయకుడితో కలిసి ఇటీవల పార్టీలోకి వలసొచ్చి మంత్రి పదవి దక్కించుకున్న నేత అని టాక్ నడుస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఇద్దరికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని కీలక డివిజన్ల బాధ్యతలను అప్పగించినా, వారు సరిగ్గా పని చేయలేదని అధిష్టానానికి పక్కా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

అవమానంగా భావించి దూరం?

గెలుపు అంతరం తక్కువగా రావడానికి, లేదా గెలుపు కష్టమవడానికి వీరికి కేటాయించిన డివిజన్లలో సరిగ్గా పని చేయకపోవడమే కారణమని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపినట్లు సమాచారం. ఈ నివేదికలే ఢిల్లీలో కాక పుట్టించాయి. పార్టీలో, రాజకీయ జీవితంలో తాము సీనియర్లుగా ఉన్నప్పటికీ, కేవలం ఒక డివిజన్ బాధ్యత అప్పగించడాన్ని సదరు మంత్రులు అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. దీంతో, వారు ఉప ఎన్నిక ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కాకుండా, పరోక్షంగా పార్టీకి ప్రతికూలంగా వ్యవహరించారనేది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరగా, ఆ ఇద్దరిలో ఒక మంత్రి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి తన వాదనలు వినిపించినట్లు సమాచారం. మరొక మంత్రి కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి తన వాదనలు వినిపించనున్నారు. పార్టీ గెలిచినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించిన ఆ ఇద్దరు మంత్రులపై అధిష్టానం త్వరలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

అబ్బే.. అవన్నీ పుకార్లే!

అయితే, ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న గుసగుసలు మాత్రమేనని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని పార్టీ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పుకార్లు సృష్టించవద్దని కూడా వారు సూచిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో గెలిచాక కూడా ఎందుకీ రాద్ధాంతాలు, గ్రూపు రాజకీయాలు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తునే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు తాలూకు వేడి ఇప్పుడు అధికార పార్టీలోని ముఖ్య నాయకత్వంపై పడటం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాట్ టాపిక్‌గా మారింది. అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ షరా మామూలే. రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ అంశాలపై అధిష్టానం నుంచి అధికారిక క్లారిటీ వస్తేనే మంచిది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 20, 2025 8:31 AM