Politics

Bhatti Vikramarka: క్రెడిట్ చోర్ ఎవరైతేనేం? అందరి వేళ్లూ భట్టి వైపే..!

అసలు కాపలాదారే దొంగైతే.. పంటకు భద్రత ఎక్కడ? ఉంటుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. మొదట ఆకలి చిన్నదే కానీ ఆ తర్వాత అది ఆశగా మారితే మాత్రం రాక్షసత్వానికి దారి తీస్తుంది.

Bhatti Vikramarka: క్రెడిట్ చోర్ ఎవరైతేనేం? అందరి వేళ్లూ భట్టి వైపే..!

విపక్ష నేత, ఓ పత్రికాధిపతి మధ్య క్రెడిట్ చోర్ వివాదం నడుస్తోంది. మేము ముందు బయటపెట్టామంటే.. మేము ముందు బయట పెట్టామంటూ రచ్చ ప్రారంభమైంది. మాజీ మంత్రి హరీష్‌రావు వర్సెస్ ప్రముఖ పత్రికాధిపతి వేమూరి రాధాకృష్ణ (RK) నడుమ వార్ నడుస్తోంది. ఇక్కడ చూపిస్తున్న వేళ్లు వేరై ఉండొచ్చు. దిశ మాత్రం ఒక్కటే. ఎవరు ముందు బయటపెడితేనేమి? ఇద్దరి వేళ్లూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైపే చూపిస్తున్నాయి. నైని కోల్ బ్లాక్ టెండర్ల వెనుక భట్టి ఉన్నారని ఇద్దరూ గట్టిగా చెబుతున్నారు.

భట్టి విక్రమార్క.. తన నియోజకవర్గమైన మధిరను పూర్తిగా తన సతీమణి నందినికి అప్పజెప్పేశారు. మధిరలో ఇటు పుల్ల తీసి అటు పెట్టాలన్నా అంతా ఆమె కన్నుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలను భట్టి డీల్ చేస్తుంటారని ప్రస్తుతం బయటపడుతున్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. భట్టి చిన్న విషయాలను బయట నడిపిస్తూ… పెద్ద వ్యవహారాలు మాత్రం లోలోపల నడిపిస్తున్నారని విపక్షాలు గట్టిగానే చెబుతున్నాయి. దీనికోసం సొంత పార్టీ మంత్రినే బలి చేసేందుకు యత్నించారన్నదే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అంటే పెద్ద మంట ఆర్పడానికి మరో ఇంటిని తగలెట్టేశారన్నమాట.

ఎన్టీవీ అధినేతతో కలిసి భట్టి ప్లాన్..!

నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం రాష్ట్రంలో సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరితో కలిసి నైని కోసం పక్కాగా ప్లాన్ చేశారన్నది వాస్తవమేనని హరీష్‌రావు, ఓ పత్రికాధిపతి గట్టిగా చెబుతున్న మాట. దీనికి ముందు ఓ మంత్రిని ఒక అధికారిణితో కలిపి పెద్ద కథనమే అల్లి ఆయన ఇజ్జత్‌ను ఎన్టీవీ నడిబజారులో పెట్టేసింది. చివరకు తన కుమారుడి మరణం తర్వాత ఇది తనను అంతగా కృంగదీసిందని సదరు మంత్రి కన్నీరు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారు. అయితే ఈ వ్యవహారమంతా భట్టి విక్రమార్కకు తెలిసే జరిగిందా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నీచానికి ఒడిగట్టారా? అని సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. తాము అనుకున్నది సాధించుకునేందుకు ఒక మహిళా అధికారిణి వ్యక్తిత్వ హననానికి సైతం వెనుకడుగు వేయలేదనేది వాస్తవం. లక్ష్యం చేరాలంటే, మహిళ గౌరవం కూడా అడ్డు కాదు అనుకోవడం అత్యంత నీచమైన, హేయమైన చర్య అని ఒక మీడియా అధిపతికి తెలియకపోవడం మరింత విడ్డూరం. మొత్తానికి రాజకీయ చదరంగంలో ఒక మహిళా అధికారిణిగా పావుగా మారిందని ప్రజలు అంటున్న మాట.

పేరుకే సమావేశం.. ఫలితం ముందే ఫిక్స్..

సైట్ విజిట్ రూల్ పెట్టాలని సింగరేణి అధికారులను పిలిచి భట్టి విక్రమార్క, ఎన్టీవీ చౌదరి సమావేశాలు పెట్టారని.. ఆ తర్వాతే నిబంధనలు మారాయని ఆర్కే గట్టిగానే చెబుతున్నారు. పైగా ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని చెబుతున్నారు. దీనిని బట్టి సమావేశం పేరుకే… ఫలితం మాత్రం ముందే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తలుపులు మూసిన గదుల్లో తీసుకున్న నిర్ణయాలే బయట పాలసీలుగా మారాయని సమాచారం. అంతేకాదు.. భట్టి విక్రమార్క చేస్తున్న చిల్లర వ్యవహారాలు హద్దు దాటుతున్నాయని సైతం ఆర్కే గట్టిగానే చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి ఏమాత్రం తీసిపోరని వెల్లడించారు. మొత్తానికి నైనీ కోల్ బ్లాక్ దక్కించుకోవడం కోసం భట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, మెగా కృష్ణారెడ్డి దగ్గర సమావేశమై సింగరేణి అధికారులను పిలిపించుకున్నారంటూ సదరు పత్రికాధిపతి తేల్చేశారు. కంచే చేనును మేస్తుందంటే ఇదేనేమో. ప్రజలకు మేలు చేయాల్సిన భట్టి విక్రమార్క.. రాష్ట్రాన్నే మింగేసే డైనోసార్‌లా మారారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

రేవంత్ నిద్రలో ఉన్నారా?

దీనిని కేవలం ఒక టెండర్ వ్యవహారంగానే చూడకూడదు. అధికారం ఎలా దారి తప్పుతుందో చెప్పే ఉదాహరణగా చూడాలి. ఆధారం ఉన్న చోట అబద్ధం ఎక్కువ దూరం నడవదన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి. అసలు కాపలాదారే దొంగైతే.. పంటకు భద్రత ఎక్కడ? ఉంటుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. మొదట ఆకలి చిన్నదే కానీ ఆ తర్వాత అది ఆశగా మారితే మాత్రం రాక్షసత్వానికి దారి తీస్తుంది. లక్ష్యం కోసం ఎంత దిగజారినా పరవాలేదన్న రాజకీయాలు, సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయనేదే మిలియన్ డాలర్ ప్రశ్న. అధికారానికి దగ్గరగా ఉన్నప్పుడు విలువలు దూరమవుతున్నాయా? అనేది పాలకులు ప్రశ్నించుకోవాలి. రాష్ట్రాన్నే తినేంత ఆకలి వస్తే, అది పాలన కాదు పతనానికే దారి తీస్తుంది. అసలు ఇంత పెద్ద ఆట జరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో ఉన్నారా? అనేదే ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మౌనం కూడా కొన్ని సార్లు భాగస్వామ్యమే అవుతుందని పెద్దలు చెప్పిన మాట.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 26, 2026 4:53 AM