Naga Babu: నాగబాబు ‘మంత్రి’ పదవికి బ్రేకులు వేస్తున్నదెవరు?
జనసేన కీలక నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఏడాది పూర్తయింది.
జనసేన కీలక నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఏడాది పూర్తయింది. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సమయంలో విడుదలైన ఈ సందేశం, నాగబాబు మంత్రివర్గంలోకి చేరిక ఖాయమని స్పష్టం చేసింది. అయితే, సంవత్సరం గడిచినా ఆ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు. డిసెంబర్ 9, 2024న ప్రకటన వెలువడినప్పటి నుంచి, ఈ ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ అధికారిక అప్‌డేట్ ఏదీ రాలేదు. ఈ నిశ్శబ్దం రాజకీయ వర్గాల్లో, పార్టీ మద్దతుదారుల్లో అనేక ప్రశ్నలకు, ఊహాగానాలకు దారి తీసింది. ప్రకటన చేసినప్పుడు, జనసేన నుంచి అప్పటికే ఉన్న నలుగురు మంత్రుల్లో నాగబాబు మూడవ కాపు మంత్రి అవుతారని అంచనా వేశారు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆలస్యానికి ప్రధాన కారణాలుగా ఈ అంశాలు తెరపైకి వచ్చాయి.
బ్రేక్ పడింది ఇక్కడే!
నాగబాబు గతంలో టీడీపీ, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణపై చేసిన విమర్శలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నచ్చలేదు. అదే సమయంలో, బాలయ్య కూడా కేబినెట్ బెర్త్‌ను ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరినీ ఒకేసారి కేబినెట్‌లోకి తీసుకుంటే, చంద్రబాబుపై కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతాయని పార్టీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ రాజకీయ నష్టాన్ని నివారించడానికి తాత్కాలికంగా వీరిద్దరి చేరికను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘నాకేంటి తక్కువ, నేను మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాను కదా..? నన్ను కాదని ఆయనకు ఎలా మంత్రి పదవి ఇస్తారు? ఇస్తే ఇద్దరికీ ఇవ్వండి లేకుంటే.. ఇద్దరికీ వద్దే వద్దు’ అని చంద్రబాబు, లోకేష్‌లతో బాలయ్య తెగేసి చెప్పినట్లుగా తెలిసింది. ఇక్కడే ఆదిలోనే మెగా బ్రదర్‌కు మంత్రి పదవికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తున్నది. ఇదంతా ఇన్‌సైడ్ టాక్ అని, బయటికి మాత్రం ఎక్కడా రానివ్వకుండా ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడుతున్నట్లుగా భోగట్టా.
అసలు కారణమిదేనా?
మంత్రివర్గంలోకి తీసుకునే ముందు, చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మెగా బ్రదర్‌ను ఎమ్మెల్సీగా ప్రకటించారు. అయితే, ఇటీవల నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు చూపించే వీడియోలు బయటకు రావడంతో, ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల కూడా ఆలస్యం జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు, పవన్ కళ్యాణ్ గతంలో ఈ ఆలస్యంపైనా స్పందించారు. ఈ నిర్ణయం ఇప్పటికే ఉందని, అయితే పార్టీలో అంతర్గత శ్రేణిని క్రమబద్ధీకరించడానికి ఈ ఆలస్యం జరిగిందని, తుది నిర్ణయం తానే తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి వివరణ రాలేదు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ‘నాగబాబుకు మంత్రి పదవి’ ప్రకటనను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా నిలబెట్టుకోలేదని జనసైనికులను రెచ్చగొట్టేందుకు ఆ ప్రకటనను సర్క్యులేట్ చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ అంశంపై చంద్రబాబు, పవన్‌ల మధ్య బహిరంగ విభేదాలు ఏమీ లేవు. ఇది ఈ ఇద్దరు నేతల మధ్య పరస్పర అవగాహన ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ప్రజావాణి చీదిరాల