Politics

బీఆర్ఎస్‌లో కవిత చెప్పిన బ్లాక్ షీప్స్ ఎవరు?

ఏ బోధి వృక్షం కింద కవిత కూర్చున్నారో కానీ.. ఆమెకు అయితే బాగానే జ్ఞానోదయం అయినట్టుంది. మొత్తానికి తన వంతు వాదనను గట్టిగానే వినిపిస్తున్నారు.

బీఆర్ఎస్‌లో కవిత చెప్పిన బ్లాక్ షీప్స్ ఎవరు?

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారంటే ఆమె కల్వకుంట్ల కవిత. తన వరకూ వస్తే కానీ తత్వం బోధపడదన్నట్టుగా ప్రస్తుతం కవితకు అలాగే జరిగినట్టుంది. ఏ బోధి వృక్షం కింద కవిత కూర్చున్నారో కానీ.. ఆమెకు అయితే బాగానే జ్ఞానోదయం అయినట్టుంది. మొత్తానికి తన వంతు వాదనను గట్టిగానే వినిపిస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ కుమార్‌లపై విమర్శలు చేసి పార్టీకి, తండ్రికి కవిత దూరమయ్యారు. ఆ తరువాత ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా ఆసక్తికరం.

ఇంతకు ముందు ఏదైనా ఇంటర్వ్యూలో ఆమెను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (AP CM Chandrababau Naidu), ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) గురించి అడిగితే ఏం చెప్పి ఉండేవారో కానీ కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు (Chandrababu) గురించి అడిగితే ఆయన ధైర్యంతో సవాళ్లను స్వీకరించగలరంటూ చెప్పుకొచ్చారు. నారా లోకేష్ (Nara Lokesh) గురించి అడిగితే.. ఆయనంత మెచ్యూర్డ్ పర్సన్‌ని చూడలేదని.. ఆయన లీడర్‌షిప్ ఎబిలిటీని నిరూపించుకున్నారని తెలిపారు. అంతేకాకుండా జనాలు ఆయనను ఎంతగా అవహేళన చేసినా కూడా ఆయన దానిని తీసుకున్న తీరును కవిత (Kalvakuntla Kavitha) ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఏకంగా తన తండ్రినే డిపెన్స్‌లో పడేసేలా మాట్లాడుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ఆ పార్టీయే నడిపిస్తోందా?

ఇక కవితను పార్టీ నుంచి గెంటేశాక గులాబీ నేతలు (BRS Leaders) ఊరుకుంటారా? కొందరు నేరుగా రంగంలోకి దిగకున్నా కూడా వెనుక నుంచి కథ నడిపిస్తున్నారని టాక్. వారు ఎవరనేది అందరికీ తెలిసిందే.. పైగా అప్రస్తుతం. సర్వసాధారణమే కదా.. ఏపీలో షర్మిల (YS Sharmila) ఏం చేసినా.. ఏం మాట్లాడినా దానికి సీఎం చంద్రబాబే (CM Chandrababu)నంటూ వైసీపీ నేతలు (YCP Leaders) రచ్చ చేస్తారు. ఇక ఇక్కడ కవిత విషయానికి వస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ (Congress Party) కాబట్టి విమర్శలన్నీ కాంగ్రెస్ పార్టీ మీదే. ఆ పార్టీయే ఆమెను వెనకుండి నడిపిస్తోందంటూ గులాబీ నేతలు రచ్చ చేస్తున్నారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగాల్సి వచ్చింది. కవితను తమ పార్టీలో చేర్చుకునే ఉద్దేశమే తమకు లేదని గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. అంతలా గులాబీ నేతలు రచ్చ చేశారు.

టచ్‌లో ఉన్నారా?

ఇదిలా ఉండగా.. ఇటీవలే కవిత కూడా ప్రెస్‌మీట్ పెట్టి మరీ తాను కాంగ్రెస్‌లో చేరబోనని.. తనను అసలు చేరమంటూ కూడా ఆ పార్టీ నేతలెవరూ సంప్రదించలేదని తేల్చేశారు. అంతేకాకుండా తనకు సొంత పార్టీ పెట్టే యోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఇది చెప్పి ఊరుకుంటే బాగానే ఉండేది.. బీఆర్ఎస్ నేతలు తనకు టచ్‌లో ఉన్నారని.. ఆ లిస్ట్ చాంతాడంత ఉందని.. టైం వచ్చినప్పుడు అన్ని వివరాలనూ వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. నిజంగానే ఆమెతో బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారా? ఉంటే ఆ బ్లాక్ షీప్స్ ఎవరు? లేదంటే.. కవిత కావాలనే చెబుతున్నారా? అయోమయంలో గులాబీ ముఖ్య నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తానికి కవిత అయితే పెద్ద సంచలనానికే బీజం వేశారు. నాటి నుంచి తెలంగాణ ప్రజల్లో సైతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీలపై సైతం మాట విసురుతున్నది లేదు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కవిత అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ గులాబీ పార్టీని దెబ్బ కొట్టేందుకు యత్నిస్తున్నారనే టాక్ సైతం కొనసాగుతోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 25, 2025 9:26 AM