Telangana News: స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడు? కాలయాపనకు కారణమేంటి?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకోగానీ రోజురోజుకూ వెనక్కి పోతున్నాయి. అసలు తెలంగాణలో ఈ ఎన్నికలు జరుగుతాయా? అనే సందేహం కూడా విపక్షాలకు వస్తోంది.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకోగానీ రోజురోజుకూ వెనక్కి పోతున్నాయి. అసలు తెలంగాణలో ఈ ఎన్నికలు జరుగుతాయా? అనే సందేహం కూడా విపక్షాలకు వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ వెయిట్ చేస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సడెన్‌గా ఆయన ఎందుకలా యూటర్న్ తీసుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు.. సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధం ఏమటనేది అర్థం కాకుండా ఉంది. అయితే మంత్రులు మాత్రం రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సూచించారని సమాచారం.
తెలంగాణ (Telangana)లో అసలేం జరుగుతోంది? ఎందుకు రేవంత్ (CM Revanth Reddy) స్థానిక సంస్థల ఎన్నికలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ గడువు కూగా ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో పక్కాగా నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ సడెన్‌గా యూటర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై జనాల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళుతున్నాయి. రేవంత్ కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) నిర్వహించడం లేదని.. భయపడి వెనుకడుగు వేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై రేవంత్.. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అంతర్గతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సహా.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttamkumar Reddy), శ్రీధర్‌బాబు (Sridhar Babu), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), సీతక్క (Sithakka), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), కొండా సురేఖ (Konda Surekha) తదితరులు పాల్గొన్నారు.
అంతిమ నిర్ణయం ఆయనదే..
వీరిలో అత్యధికమంది స్థానిక సంస్థల ఎన్నిలకు వెళ్లడమే ఉత్తమమని సీఎంకు సూచించినట్టు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)కు ఇటు గవర్నర్ కానీ.. అటు కేంద్రం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక మీదట ఇస్తుందన్న నమ్మకమూ లేదు. దీనికి రాజకీయపరమైన కారణాలున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతకాలం పాటు వాయిదా వేసినా ప్రయోజనం ఉండదని.. కాబట్టి నిర్వహించడమే సబబని రేవంత్ (Revanth)కు మంత్రులు సూచించినట్టుగా తెలుస్తోంది. కేవలం మంత్రులు సూచన మాత్రమే చేశారు. అంతిమ నిర్ణయం మాత్రం సీఎంకే వదిలేశారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై 3, 4 రోజుల్లో స్పష్టత తీసుకున్న మీదట స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనుండటం ఒక ఆలోచన అయితే మరో ఆలోచన కూడా ఉంది.
42% టికెట్లు ఇస్తే ఎలా ఉంటుంది?
మరో ఆలోచన ఏంటంటే.. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీఓ జారీ చేసి ఎన్నికలకు వెళ్లవచ్చా? అనే అంశాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి న్యాయపరమైన అవరోధాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటిది జరిగితే పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నిసైతం రేవంత్ ప్రభుత్వం (Revanth Government) యోచిస్తోంది. ఈ మూడు అంశాల నడుమ స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. కానీ కారణాలు ఏవైనా కూడా ఎన్నికలు మాత్రం ఆలస్యమవుతున్నాయి. దీనిపై విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court), గవర్నర్ ఆమోదం అంటూ కూర్చొంటే కాలయాపన తప్ప ఒరిగేదేమీ లేదనేది నిపుణులు అంటున్న మాట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల