Pawan Kalyan: పవన్‌పై రెడ్డి నేతల ‘ఉమ్మడి’ దాడి వెనుక మతలబేంటి?
అమరావతి మట్టిని కలిపి మూడు ప్రాంతాల అభివృద్ధికి తెర లేపిన ఆంధ్రప్రదేశ్‌లో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయాలకు దిష్టి తీసినంత పని చేసింది.
అమరావతి మట్టిని కలిపి మూడు ప్రాంతాల అభివృద్ధికి తెర లేపిన ఆంధ్రప్రదేశ్‌లో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయాలకు దిష్టి తీసినంత పని చేసింది. ఏలూరు పర్యటనలో భాగంగా ఆయన చేసిన ‘కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది’ అనే వ్యాఖ్య ఇక్కడ రాజకీయ తుఫాను సృష్టించింది. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. అయితే, విమర్శలు చేస్తున్న నాయకుల సామాజిక వర్గంపై దృష్టి సారించిన రాజకీయ విశ్లేషకులు, ఈ ఉమ్మడి దాడి వెనుక ఏదో మతలబు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కొక్కరుగా బయటికి..!
పవన్ వ్యాఖ్యలను ఖండించడంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మొదటి అడుగు వేశారు. ఇటువంటి వారు డిప్యూటీ సీఎం పదవికి అనర్హులు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి ఇక్కడి వారెవ్వరూ హైదరాబాద్ వదిలి ఉపాధి కోసం కోనసీమ వెళ్లడం లేదని, అక్కడి వారే నిత్యం వేలాది మందిగా హైదరాబాద్‌కి వలస వస్తున్నారంటూ ఆయన పవన్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ఇది దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా ఉందని, ముందుగా తమ రాష్ట్ర సమస్యలు చూసుకోవాలని జగదీశ్ రెడ్డి ఎత్తిపొడిచారు. ఆయనకు తోడుగా, కాంగ్రెస్ జనంపల్లి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ వ్యాఖ్యలను ఖండించారు. మా దిష్టి కోనసీమకు తగిలితే పవన్ అక్కడ గెలిచేవారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందంటూ వ్యాఖ్యానించడం ఏమాత్రం సబబు కాదని ఆయన వ్యాఖ్యానిస్తూ, పవన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘రెడ్డి’ సామాజిక వర్గమే ఎందుకు?
ఇక్కడే ఆసక్తికరమైన రాజకీయ కోణం మొదలవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ, హుటాహుటిన ఈ రెండు పార్టీల నుండి కేవలం రెడ్డి సామాజికవర్గ నేతలు మాత్రమే ఎందుకు ముందుకొచ్చారు? అనేది ప్రధాన ప్రశ్న. ఏపీలో తమ సామాజికవర్గం నాయకుడి (వైసీపీ) ఓటమిలో, వైసీపీ పతనంలో పవన్ కీలక పాత్ర పోషించడం తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గానికి కూడా మింగుడు పడడం లేదా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ విద్వేషాన్ని ఇలా సందర్భానుసారంగా వెల్లడించాలని ఈ నేతలు కంకణం కట్టుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తోకలేని కోతి కొండలన్ని ఎక్కింది అన్న చందంగా, పవన్‌ను విమర్శిస్తే తమ ఏపీ అనుబంధ పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారా? అనేది పెరుమాళ్లకే ఎరుక.
బీఆర్‌ఎస్-వైసీపీ మైత్రి కార్యం
వీటన్నింటికీ తోడుగా, బీఆర్‌ఎస్, వైసీపీకి మిత్రపక్షం వంటిది కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇటు స్వకార్యం (పవన్‌ను విమర్శించడం) అటు స్వామి కార్యం (వైసీపీకి పరోక్ష మద్దతు) పూర్తి చేసేందుకే తొలి అడుగు వేసి మీడియా ముందుకొచ్చి విరుచుకుపడ్డారని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం జగదీశ్ రెడ్డిని అనుసరిస్తూ, ఉమ్మడి సామాజిక వర్గ రాజకీయ లక్ష్యాల కోసం పవన్‌ను టార్గెట్ చేసేందుకు సిద్ధపడ్డారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా, పవన్ కళ్యాణ్ చేసిన ఒక చిన్నపాటి దిష్టి వ్యాఖ్య, తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతల ఉమ్మడి దాడి రూపంలో రాజకీయ ఎజెండాకు కొత్త ఊతమిచ్చిందనేది నిర్వివాదాంశం.
ప్రజావాణి చీదిరాల