Vijayasai Reddy: విజయసాయి రీ ఎంట్రీ స్కెచ్.. జగన్ కోటరీకి ముచ్చెమటలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఏ2’ అంటే ఒకప్పుడు అధికారం వెనుక ఉన్న అసలు చక్రవర్తి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ, పార్టీని గెలిపించడంలో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు అదే పార్టీ మూలాలను కదిలించేలా గర్జించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఏ2’ అంటే ఒకప్పుడు అధికారం వెనుక ఉన్న అసలు చక్రవర్తి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ, పార్టీని గెలిపించడంలో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు అదే పార్టీ మూలాలను కదిలించేలా గర్జించారు. తనను ‘పొగబెట్టి’ పంపారని ఆవేదన చెందుతూనే, జగన్ చుట్టూ ఉన్న ‘పందికొక్కుల’ కోటరీకి చమటలు పట్టించేలా బాంబులు పేల్చారు. త్వరలోనే తన రాజకీయ రంగప్రవేశం ఉంటుందని ప్రకటించిన సాయిరెడ్డి, ఇప్పుడు ఏ గూటికి చేరుతారన్నది ఏపీ పాలిటిక్స్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాజకీయాల్లో ‘మునిగిపోయే పడవను ముందుగా వదిలేది తెలివైన ఎలుకలే’ అన్న సామెత చందంగా.. వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న వేళ, సాయిరెడ్డి చూపు ఎటువైపు ఉందనే చర్చ జోరందుకున్నది. ఆయన బీజేపీలోకి వెళ్లడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతుండగా.. నెటిజన్లు మాత్రం మరో అడుగు ముందుకేసి, ఆయన అనూహ్యంగా జనసేన గూటికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్స్ చేస్తున్నారు. జగన్ పిలిస్తే వెళ్తాను అని ఒకవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోలోపల మాత్రం కూటమి వైపు వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
కోటరీ పరిస్థితేంటి..?
గురువారం లిక్కర్ స్కామ్ విచారణ ముగిశాక సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశాయి. ‘ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగున ఉన్న పులులను చంపుతానన్నాడట’ అన్నట్లు ఉంది అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ పరిస్థితి. రాజకీయ వ్యూహం తెలియని మనుషులు మాజీ సీఎంను మిస్‌గైడ్ చేస్తున్నారని, కూటమిని విడగొట్టే తెలివితేటలు కోటరీలోని నేతలకి ఏమాత్రం లేవని ప్రత్యక్షంగానే సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తాను జగన్ కోసం ‘పాలేరు’గా రక్తం ధారబోసి సంపాదిస్తే, కోటరీలోని మనుషులు పందికొక్కుల్లా తిన్నారని ఆయన చేసిన విమర్శలు పార్టీలోని అసలు రొచ్చును బయటపెట్టాయి. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డికి, కసిరెడ్డి కంపెనీలకు 100 కోట్లు అరేంజ్ చేయమని అడిగిన మాట వాస్తవమేనని ఒప్పుకోవడం ద్వారా.. జగన్ పార్టీ ఆర్థిక మూలాల చిట్టా తన దగ్గర ఉందని ఒక హెచ్చరిక జారీ చేశారు. తాను ఇప్పటివరకు జగన్‌ను విమర్శించలేదని, కానీ ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు వెన్నుపోటు పొడిచే అలవాటు లేదని, వేంకటేశ్వర స్వామి సాక్షిగా తాను పైసా అవినీతికి లొంగలేదని ప్రమాణం చేయడం ద్వారా.. తన క్లీన్ చిట్ ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు.
అంతా ఈజీ కాదు సాయిరెడ్డి!
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి అంటేనే ఒక ‘మోనార్క్’ అని, ఆయన అసలేం ఆలోచిస్తున్నారో పక్కన ఉన్న వారికే అర్థం కాదని పేరుంది. బయట వినిపించే టాక్ ప్రకారం.. జగన్ ఓ పక్కా ఇగోయిస్ట్, ఆయన ఎవ్వరినీ లెక్క చేయరు, పైగా తను చెప్పిందే శాసనం అనే మనస్తత్వం ఆయనది. అలాంటిది, ‘జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. అప్పుడు నేను పార్టీలోకి రావడం గురించి ఆలోచిస్తాను’ అని సాయిరెడ్డి పెట్టిన కండీషన్ వింటుంటే.. ‘ఆకాశం వైపు చూసి ఉమ్మి వేస్తే అది మన ముఖం మీదే పడుతుంది’ అన్న సామెత గుర్తొస్తోంది. తగ్గేదేలే అన్నట్లుగా ఉండే జగన్, సాయిరెడ్డి కోసం తన మాటను వెనక్కి తీసుకుంటారా? అంటే.. అది అబ్బే అస్సలు కానే కాదు, అయ్యే పని కూడా కాదు! ఈ గ్యాప్ చూస్తుంటేనే అర్థమవుతోంది.. సాయిరెడ్డి వైసీపీ గడప తొక్కడం కష్టమని. అందుకే ఆయన ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ, ఢిల్లీ అండ కోసం బీజేపీ పంచన చేరడమే ఉత్తమమని భావిస్తున్నట్లు భోగట్టా. అటు అధికారం, ఇటు రక్షణ రెండూ దొరికే కమలం గూటికే ఆయన మొగ్గు చూపుతారని, ఈ 25 తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.
25న అసలుసిసలైన క్లైమాక్స్!
‘నా రాజకీయ భవిష్యత్తు ఏంటో నేనే చెప్తా’ అని సాయిరెడ్డి పెట్టిన డెడ్ లైన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. అటు చంద్రబాబు సర్కార్ వేధింపులు, ఇటు సొంత పార్టీ కోటరీ వెన్నుపోట్లు.. ఈ రెండింటి మధ్య నలిగిన సాయిరెడ్డి, ఇప్పుడు ఏ జెండా పట్టుకుంటారనేది ఉత్కంఠగా మారింది. బంతి జగన్ కోర్టులో ఉన్నట్లు కనిపిస్తున్నా, సాయిరెడ్డి చూపు మాత్రం ఢిల్లీ లేదా కూటమి వైపు ఉందన్నది కాదనలేని సత్యం. 25 తర్వాత ఆయన చేయబోయే ప్రకటన వైసీపీకి ‘సంజీవని’ అవుతుందా..? లేక ఆ పార్టీ కొంపముంచే ‘శని’గా మారుతుందా..? అన్నది తేలిపోనుంది. మొత్తానికి జగన్ కుడిభుజమే ఇప్పుడు జగన్ పాలిట భస్మాసుర హస్తం కాబోతోందా..? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి! మరికొన్ని గంటల్లో సాయిరెడ్డి రీ ఎంట్రీ ఇచ్చే పార్టీపై తేల్చబోతున్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ..!
ప్రజావాణి చీదిరాల