Vijayasai Reddy: అప్పుడు సలహాలివ్వాలనిపించలేదా? లేదంటే జగన్ వినలేదా?
జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుందని.. వారు ఎలా చెబితే అలా నడుచుకుంటారని కూడా అంటారు. మరి ఆ కోటరీలో వైసీపీ (YSRCP) విజయానంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) లేరా? ఉంటే ఆయన సలహాలు ఇవ్వలేదా? ఇచ్చినా జగన్ లెక్కచేయలేదా?
వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మోనార్క్ అని అంతా అంటుంటారు. ఎవరైనా ఆయనకు చెప్పడం కష్టమేనని చెబుతుంటారు. అయితే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటుందని.. వారు ఎలా చెబితే అలా నడుచుకుంటారని కూడా అంటారు. మరి ఆ కోటరీలో వైసీపీ (YSRCP) విజయానంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) లేరా? ఉంటే ఆయన సలహాలు ఇవ్వలేదా? ఇచ్చినా జగన్ లెక్కచేయలేదా? ఎన్నో సందేహాలు ప్రస్తుతం విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు ఇచ్చిన సలహాతో తలెత్తుతున్నాయి.
వాస్తవానికి తొలినాళ్లలో జగన్‌కు విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారు. జగన్‌తో పాటే జైలు జీవితం గడిపారు. జగనే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలం వరకూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. కానీ కొంత కాలానికి సీన్ మారిపోయింది. జగన్‌కు.. విజయసాయికి మధ్య ఎందుకో తెలియదు కానీ పెద్ద అగాధమే ఏర్పడింది. చివరకు విజయసాయిని తన కారులో కూడా ఎక్కించుకోలేనంత డిస్టెన్స్ జగన్ మెయిన్‌టైన్ చేశారు. చివరకు విజయసాయి రాజకీయాల నుంచే నిష్కమించారు.
రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు
మరోవైపు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్ని విధాలుగా ఏపీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు శతవిధాలుగా కృషి చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏపీ పెట్టుబడుల (AP Investments)కు స్వర్గథామంగా మారిపోయింది. ఇటీవలే విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏకంగా రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషయంపైనే తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చేశారు. ఒకరకంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఏపీ దశ తిరగడం ఖాయం..
ముందుగా అసలు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఏపీలో పెడుతున్న పెట్టుబడులన్నీ గ్రౌండ్ కావాలంటే వాటిని నిరంతరం పర్యవేక్షించే అధికారి ఉండాలని.. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికిసూచించారు. ఈ క్రమంలోనే ఒక రియల్ టైం వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి.. డీల్స్ అన్నీ ఎలా ముందుకు వచ్చాయనేది అందరికీ తెలిసేలా చేయాలన్నారు. పెట్టుబడుల సదస్సులో ఏకంగా రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి కదా.. వాటిలో 75 శాతం అంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినా కూడా ఏపీ దశ తిరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తున్నట్టుగా అయితే విజయసాయిరెడ్డి మాటలున్నాయి. ఇలాంటివి చాలా మంచిదే.. పైగా విజయసాయిరెడ్డి నుంచి ఊహించనిది. ఇంత మంచి సలహాలు జగన్ ప్రభుత్వంలో ఉండగా ఇచ్చి ఉంటే ఇప్పటికే ఏపీ స్వర్ణాంధ్ర అయి ఉండేది కదా అని వైసీపీ క్యాడర్ అంటోంది.
బాబు పంచన చేరుతారా?
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. వచ్చిన పెట్టుబడులన్నీ రివర్స్ గేర్ తీసుకుని వెనక్కు వెళ్లిపోయాయి. ఆ తరుణంలో ఎందుకు విజయసాయి రెడ్డి పెట్టుబడులను ఒడిసి పట్టుకోమని.. జగన్‌కు చెప్పలేకపోయారు? చెప్పలేదా.. లేదంటే చెబితే జగన్ తీసుకోలేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇంత బాగా పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంచి అవగాహన ఉన్న విజయసాయి వంటి వారు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే పని జగన్ హయాంలో చేసి ఉంటే రాష్ట్రం ఇంతటి అధోగతి పాలై ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ ఏం చెప్పినా వినే రకం కాదని విజయసాయి రెడ్డి లైట్ తీసుకుని ఉంటారని కొందరంటున్నారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయసాయిరెడ్డి.. వాస్తవానికి మాత్రం దగ్గరగా వస్తున్నారనడంలో సందేహం లేదని ఏపీ ప్రజానీకం అంటోంది. మరోవైపు చంద్రబాబు విషయంలో ఇంత సానుకూలంగా వ్యవహరించడం పట్ల మరో టాక్ కూడా నడుస్తోంది. ఆయనేమైనా ఫ్యూచర్‌లో బాబు పంచన చేరే అవకాశం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రజావాణి చీదిరాల