Politics

YS Jaganmohan Reddy: రూట్ మార్చిన జగన్.. అవాక్కవుతున్న జనం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ను వీడి జనాల్లోకి వచ్చారు. పూర్తిగా కాదులెండి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడో.. ఆయన మాట్లాడాల్సిన అవసరం పడినప్పుడో అలా వస్తుంటారు కదా.

YS Jaganmohan Reddy: రూట్ మార్చిన జగన్.. అవాక్కవుతున్న జనం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ను వీడి జనాల్లోకి వచ్చారు. పూర్తిగా కాదులెండి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడో.. ఆయన మాట్లాడాల్సిన అవసరం పడినప్పుడో అలా వస్తుంటారు కదా. అలా అన్నమాట. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ను షూటింగ్ మధ్యలో వచ్చేసి ఏదో షో చేసి వెళ్లిపోతుంటారని విమర్శిస్తూ ఉండేవారు. అయితే జగన్ హీరో కాకున్నా కూడా మరీ జీరో అయిపోకూడదని తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు.

కార్యకర్తలు ఊరుకుంటారా?

ఇటీవల తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై వెలువడిన రిపోర్టుల్లోని అంశాలను హైలైట్ చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. పనిలో పనిగా హీరో అనిపించుకుందామనుకున్నారో ఏమో కానీ సీఎం చంద్రబాబుపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. వాస్తవానికి వైసీపీ నేతలకు ఇది షరా మామూలే కానీ అవతల ప్రభుత్వం ఎవరిదనే విషయాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలి కదా. గుడ్డెద్దు చేనులో పడిన చందంగా మైకు దొరికింది కదాని ఎలా పడితే అలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? అంబటి నివాసంపై దాడి.. నిప్పు పెట్టడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత అంబటి అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటను వీడి గుంటూరుకు వచ్చారు. వచ్చి అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు అంతా బాగానే ఉంది కానీ ఈ క్రమంలో ఆయన మాటలను పరిశీలించిన వారు అవాక్కవుతున్నారు. ఈయనేంటి రూట్ మార్చేశారని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబే టార్గెట్..

అదేంటంటారా? కేవలం చంద్రబాబుపైనే మాటల బాణాలను ఎక్కుపెట్టారు. బీజేపీని విమర్శించేంత సీన్ అయితే ఎప్పుడూ జగన్‌కు లేదనుకోండి. కానీ జనసేనను వదలరు కదా. అవసరమున్నా.. లేకున్నా.. ప్రతి విషయంలోకి పవన్‌ను లాగి వృత్తిపరంగానూ.. వ్యక్తిగతంగానూ దూషించడం జగన్‌కు అలవాటే. మరి దానిని పక్కనబెట్టేశారేంటో అర్థం కావడం లేదు. కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేశారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే చాలు.. తమ ప్రభుత్వం వచ్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారట. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మూడేళ్ల తర్వాత సంగతి ఇప్పుడెందుకు? కూటమి ప్రభుత్వం చేస్తున్నది తప్పనిపిస్తే నిత్యం జనంలో ఉండి పోరాటం సాగించాలి కానీ ఇదేం పద్ధతి. అప్పుడు అధికారమిస్తే పరదాల మాటున ప్రభుత్వాన్ని నడిపిన జగన్.. ఇప్పుడేమో బెంగుళూరు ప్యాలెస్‌లో ఉంటూ అన్నీ తనకు అనుకూలంగా జరగాలంటే జరుగుతాయా?

పవన్ ప్రస్తావన తెచ్చినా..

అవసరమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని... అడుగులు వేగంగా పడతాయని.. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబుకు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. పైగా ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు.. సుప్రీం తలుపులు తడతాం.. అన్ని రకాల పోరాటాలు చేస్తామని జగన్ తేల్చారు. మొత్తానికి ఏం చేయాలన్నా ముందు జగన్ ఈ రాష్ట్రంలో ఉండాలి కదా. బెంగుళూరు ప్యాలెస్‌లో ఉండి ఇవన్నీ చేస్తే వృథా. ప్రతిపక్ష హోదా కోసం చేసిన పోరాటంలో కొంతైనా ప్రజా సమస్యలపై పోరాడి ఉంటే బాగుండేదేమో. ఏపీలో జంగిల్ పాలన సాగిస్తున్నారట. మొత్తానికి స్క్రిప్ట్ అయితే గట్టిగానే చదివేశారు. తమ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేస్తారట. సరే.. అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం సర్వసాధారణమే కానీ జనసేన అధినేత పవన్ ప్రస్తావన ఒకట్రొండు చోట్ల తీసుకొచ్చినా కూడా ఏదో జస్ట్ మాటల సందర్భంలో తీసుకురావడమే తప్ప గట్టిగా విమర్శించిందైతే లేదు. జగన్ ఏమైనా స్ట్రాటజీ మార్చరా? లేదంటే అంతా చంద్రబాబుదే.. పవన్ ప్రమేయమేమీ లేదనుకున్నారా? అదీ కాదంటే పవన్‌ను విమర్శించి ఆయనను మరింత హైలైట్ చేయడం ఎందుకనుకున్నారా? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 5, 2026 11:50 AM