YSRCP: ఆ మాటలు.. ఆ నిర్ణయం.. వైసీపీ వైఖరిలో కొత్త మలుపు!
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు తన స్టాండ్‌ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్‌సీపీ (YSRCP) ఇప్పుడు తన స్టాండ్‌ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) చేసిన ప్రకటన, భవిష్యత్తులో అమరావతి (Amaravathi)ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పడంతో, ఈ అంశంపై కొత్త రాజకీయ చర్చ మొదలైంది. వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానుల అవసరాన్ని బలంగా వాదించింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ మూడు రాజధానుల బిల్లు (3 Capital Bill)ను ఆమోదించింది. ఈ నిర్ణయం అమరావతి రైతులు, టీడీపీ (TDP), జనసేన (, Janasena) బీజేపీ (BJP)ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినా అప్పటి జగన్ (YS Jagan) ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు (Highcourt)లోనూ, సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ ఈ అంశంపై న్యాయ పోరాటం కొనసాగింది.
ప్రజా తీర్పుకు తలొగ్గి..
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత, అమరావతి అంశంపై పార్టీ తన వైఖరిని పునఃపరిశీలించినట్లు స్పష్టమవుతోంది. ప్రజల తీర్పును గౌరవించి తాము మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంటున్నామని సజ్జల చెప్పకనే చెప్పారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ‘మేము మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రజల ఆమోదంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ, ప్రజలు దానిని ఆమోదించలేదు. కాబట్టి మేము ఆ ఆలోచనను విరమించుకుంటున్నాం’ అని ఓ కాన్‌క్లేవ్‌లో సజ్జల చెప్పుకొచ్చారు. ఇది అధికారికంగా పార్టీ వైఖరిలో వచ్చిన అతిపెద్ద మార్పుగా పరిగణించబడుతోంది. అంతేకాదు, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని అభివృద్ధి చేస్తామని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారని ప్రకటించారు. దీని ద్వారా వైసీపీ అమరావతిని శాశ్వత రాజధానిగా అంగీకరించినట్లు సంకేతాలు పంపుతోంది. గతంలో పది శాతం కూడా పనులు జరగలేదని, కట్టడాలకు డబ్బులు లేవని విమర్శించిన వైసీపీ, ఇప్పుడు అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటం రాజకీయంగా వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్పు వెనుక వ్యూహమేంటి?
వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. 2024 ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో, దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ప్రజలు మూడు రాజధానుల ఆలోచనను తిరస్కరించారని పార్టీ గ్రహించి ఉండవచ్చు. అమరావతి రైతుల ఆందోళన (Farmers Protest)లను, వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చని వైసీపీ భావించి ఉండవచ్చు. మూడు రాజధానుల విషయంలో న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక వనరుల కొరత వంటివి కూడా ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. సజ్జల ప్రకటనతో, ఇప్పుడు అమరావతిపై రాజకీయ వాతావరణం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రజల తీర్పును గౌరవించామని చెప్పడం ద్వారా వైసీపీ ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మార్పు ప్రజలను ఎంతవరకు నమ్మించగలదో వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల