Politics

CM Chandrababu: కూటమికి ఇబ్బందికరంగా ఆ రెండు అంశాలు.. సెట్ చేయకుంటే..

కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడ‌ల్ని బండ్లు, బండ్లను ఓడ‌లుగా మార్చగ‌ల శక్తి కేవ‌లం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

CM Chandrababu: కూటమికి ఇబ్బందికరంగా ఆ రెండు అంశాలు.. సెట్ చేయకుంటే..

కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడ‌ల్ని బండ్లు, బండ్లను ఓడ‌లుగా మార్చగ‌ల శక్తి కేవ‌లం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అణుకువుగా ఉన్నవాళ్లకే సహకరిస్తుంది. కానీ, అహంకారంతో నడుచుకుంటే అథఃపాతాళానికి దిగజారడం ఖాయం. ఆ కాల మహిమ, ఆ బ్యాడ్ టైమ్... ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ టైమ్ వెంటాడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడాదిన్నర క్రితం అప‌రిమిత‌మైన అధికారాన్ని హస్తగతం చేసుకున్న కూటమి... గత పాలన నుంచి గుణపాఠం నేర్చుకుని, చక్కగానే సేవ చేస్తోంది కానీ చిన్న తప్పిదం కూడా దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

కీలక అంశాలివే..

కూటమి ప్రభుత్వానికి దెబ్బ తీసే విధంగా రెండు కీలక అంశాలు ఇటీవల ప్రజల్లోకి వచ్చాయి. ఒకటి.. పది ప్రభుత్వ వైద్య కళాశాలల (Government Medical Colleges) ప్రైవేటీకరణ యత్నం. రెండు.. నకిలీ మద్యం తయారీ దందా జరుగుతోందనే అపవాదు. ఈ రెండు అంశాలు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్‌ను అయితే క్రియేట్ చేశాయని చెప్పాలి. దీని నుంచి బయటపడాల్సిన అవసరం చంద్రబాబు సర్కార్‌ (Chandrababu Government)కు ఎంతైనా ఉంది. వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో ఉన్న అపోహలను ముందుగా తొలగించాలి. వైసీపీ ప్రభుత్వం (YCP Government) వైద్య కళాశాలల అంశాన్ని ఒక బూచిగా చూపించి జనాల మైండ్స్‌లోకి ఇంజెక్ట్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. తమకు కావాల్సిన వారికి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. దీనిపై స్వయంగా వైఎస్ జగన్ (YS Jagan) రంగంలోకి దిగి మరీ నానా యాగీ చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన ఈ కళాశాలల భవనాలను పూర్తి చేయడానికి రూ.5 వేల కోట్ల లోపే ఖర్చు అవుతుందని.. ‘అంత సొమ్ము తామెక్కడి నుంచి తీసుకురావాలి?’ అని పాలకులు ప్రశ్నిస్తున్నారంటూ జగన్ మండిపడుతున్నారు.

బయటపడిన డంప్‌లు..

లక్ష కోట్లు అప్పు చేసి మరీ అమరావతి నిర్మాణం చేపడుతోందని ఆరోపిస్తున్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి ఏ రాజధాని లేకుండా జగన్‌కు అసలు రాజధాని విలువేం తెలుస్తుందిలే కానీ.. ‘ప్రతి ఏటా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించలేరా?’ అనే ప్రశ్నతో రచ్చ చేస్తున్నారు. ఆరోగ్యం అనేసరికి ప్రజలు కనెక్ట్ అవుతారు కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిందే. మరోవైపు, కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనికి కారణమైన వైసీపీ ముఖ్య నాయకులు, రిటైర్డ్ అధికారుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. నాణ్యమైన మద్యాన్ని అందించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా ఓకే కానీ.. ఇటీవల అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లోని ములకలచెరువు, ఇబ్రహీంపట్నంల‌లో డంప్‌లు బయటపడటం సంచలనం రేపాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జగన్ మొండివాడే కాదు..

అసలే ఎక్కడ ఏం జరుగుతుందా? దానిని హైలైట్ చేద్దామా? అని చూస్తున్న జగన్‌కు ఈ అంశాలు మంచి ఆయుధంలా దొరికాయి. దీంతో జగన్ తనదైన శైలిలో మొండిగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాలని చూస్తున్నారు. జగన్ అంటే చాలా మొండివాడే కాదు మూర్ఖంగా తను అనుకున్నది ఏదైనా చేసేస్తారని వైసీపీ నేతలే చెబుతారు. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వకుంటే బాగుంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఎంత మంచి చేసినా కూడా ఒక చిన్న తప్పు హైలైట్ అవుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం, ఆటో డ్రైవర్స్‌కు సైతం చేయూతనందించడం వంటి వాటితో జనాల్లో మంచి పేరును సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మరి చంద్రబాబు (AP CM Chandrababu) ప్రభుత్వం ఈ అంశాలను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 9, 2025 3:49 AM