YSRCP: నవ్విపోదురుగాక.. ఇది కాఫీ కప్పులో తుపాను...
శాసనమండలికి జగన్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అనుమతిస్తున్నారు. దానికి కూడా రానివ్వకుంటేనే బాగుంటుందేమోనని ఇవాళ ఏపీ శాసనమండలి సమావేశాలను వీక్షించిన వారంతా అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు అసెంబ్లీకి అయితే రావడం లేదు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పిలిపించుకున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కసారిగా పులివెందుల ఎమ్మెల్యే అంటుంటే జీర్ణించుకోవడం కొంచెం కష్టమే.. అదే కారణమో.. మరకొకటి కానీ తనూ రావడం లేదు. తన ఎమ్మెల్యేలనూ రానివ్వడం లేదు. శాసనమండలికి మాత్రం తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అనుమతిస్తున్నారు. దానికి కూడా రానివ్వకుంటేనే బాగుంటుందేమోనని ఇవాళ (శనివారం) ఏపీ శాసనమండలి సమావేశాలను వీక్షించిన వారంతా అనుకుంటున్నారు.
ఇవాళ శాసనమండలి (Legislative Council) సమావేశాలు చూసిన వారికి ఒక్కటే ఒక సందేహం వస్తుంది. అదేంటంటే.. రాష్ట్రంలో సమస్యలేవా? అసలు శాసనమండలిలో చర్చించాల్సిన అంశాలు.. రాద్దాంతం చేయాల్సిన అంశాలు.. వచ్చేసి తమకు మంచి కాఫీ (Coffee), నీళ్లు అందడం లేదనా? కాఫీ సరిగా లేకుంటే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలా? అంతకు మించిన సమస్య ఏపీలోనే లేదా? మరీ ఇంత దారుణమా? కాఫీ సరిగా లేకుంటే కంప్లైంట్ చేయాలి.. కానీ రాద్దాంతం చేస్తారా? హవ్వ నవ్విపోదురుగాక. మండలిలో ఇచ్చే కాఫీకి, శాసనసభ (AP Assembly)లో ఇచ్చే కాఫీకి తేడా ఉందని వైసీపీ సభ్యులు (YCP Leaders) ఏకంగా ఆందోళనకు దిగారు. అలాంటి తేడా అయితే ఏమీ లేదని.. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వివరణ ఇచ్చినా కూడా వినరే.. దీనికోసం చర్చించాలట.. పట్టుబట్టి మరీ కూర్చుండిపోయారు. దీంతో సభను చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.
చిన్న విషయం పెద్ద రచ్చ
టీ (Tea) కప్పులో తుఫాన్ అనే జాతీయాన్ని వింటూనే ఉంటాం. అంటే ఒక చిన్న సమస్యను భూతద్దంలో చూసి పెద్ద రచ్చ చేయడం. వైసీపీ నేతలు (YCP Leaders) కాఫీ కప్పులో తుఫాన్‌ను చూపించారు. చిన్న విషయం పెద్ద రచ్చకు దారి తీసింది. అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC)లు నల్ల కండువాలు ధరించి మరీ నిరసన తెలిపారు. చైర్మన్ గౌరవాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. బ్రేక్ సమయంలో చర్చ నిర్వహిస్తామన్నా కూడా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ముందుగానే చర్చ జరపాలంటూ పట్టుబట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలి చైర్మన్‌ను గౌరవించడం లేదని ప్రశ్నిస్తే అది సమంజసమే.. కానీ కాఫీ బాగోలేదని.. భోజనం సరిగా లేదని ఆందోళన చేయడం మాత్రం దారుణం. వీటి కోసం రచ్చ చేస్తే వైసీపీ నేతలే జనాల్లో చులకన అవుతారు అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే ఏపీ ప్రజానీకం ముక్కున వేలేసుకుంది. ఇది ఏపీలోనే కాదు.. తెలంగాణ (Telangana)లోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ప్రజావాణి చీదిరాల