TDP: బ్యూరోక్రాట్స్ కాదు దొంగలు! ఐఏఎస్‌లపై వెయ్యి కోట్ల బాంబు పేల్చిన టీడీపీ నేత!
ఐఏఎస్.. అంటే భారత పరిపాలన యంత్రాంగానికి ఉక్కు చట్రం. ఈ మూడక్షరాల వెనుక ఒక దశాబ్దాల గంభీరత ఉంది. దేశాన్ని నడిపించే మేధో సంపత్తి ఉంది. సామాన్యుడి కంటికి వీరు అపర మేధావులు, ప్రభుత్వానికి వెన్నెముకలు.
ఐఏఎస్.. అంటే భారత పరిపాలన యంత్రాంగానికి ఉక్కు చట్రం. ఈ మూడక్షరాల వెనుక ఒక దశాబ్దాల గంభీరత ఉంది. దేశాన్ని నడిపించే మేధో సంపత్తి ఉంది. సామాన్యుడి కంటికి వీరు అపర మేధావులు, ప్రభుత్వానికి వెన్నెముకలు. కానీ, తెర వెనుక జరుగుతున్నది వేరే కథా? ఈ వ్యవస్థకు పట్టిన తుప్పు ఇప్పుడు రాజకీయ గడప దాటి రచ్చకీడ్చబడిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. టీడీపీ కీలకనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారులపై చేసిన విమర్శలు కేవలం ఆరోపణలు కావు.. అవి పాలనా వ్యవస్థ పునాదులను కదిలించే భూకంపం.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా అధికారులను విమర్శించేటప్పుడు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ.. దీపక్ మాత్రం భయం అనే మాటే లేకుండా, పచ్చి నిజాలను నిప్పులు చెరిగినట్లుగా బయటపెట్టారు. ఐఏఎస్ వ్యవస్థలోకి దొంగలు జొరబడ్డారని, ఈ అధికారులంతా రాష్ట్రానికి పట్టిన గ్రహణం, దరిద్రం అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఏకంగా కలెక్టర్లను ఉద్దేశించి "ఏం రోగం మీకు? స్టేజీలెక్కి నీతులు చెబుతూ డ్రామాలు ఆడుతున్నారు" అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు బ్యూరోక్రసీలో ఉన్న లోపాలను వేలెత్తి చూపుతున్నాయి.
నాడు బ్రిటిష్.. నేడు ఐఏఎస్!
బ్రిటిష్ వాడు దేశాన్ని దోచుకోవడానికి ఒక సామ్రాజ్యాన్ని ఎలా కట్టుకున్నాడో, నేటి ఐఏఎస్ అధికారులు కూడా ప్రజల సొమ్ముతో తమ స్వంత సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారని దీపక్ రెడ్డి చేసిన విశ్లేషణ ఒకింత ఆశ్చర్యాన్ని, మరోవైపు ఆలోచనను కలిగిస్తోంది. ఒక ఐఏఎస్ అధికారికి వచ్చే నెలవారీ జీతం ఎంత? మరి వారు ఎనిమిది పది బెడ్ రూంల విలాసవంతమైన భవనాలు ఎలా నిర్మిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా..? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంతకంటే విస్తుపోయే విషయం ఏమిటంటే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురికి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల కట్నం ఇస్తానని అన్నారంటే, ఆ డబ్బు ఏ గని నుంచి వచ్చిందో, ఏ ఫైల్ క్లియర్ చేస్తే వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన బాంబు పేల్చారు.
బాబు, జగన్ ఓటమికి కారణం కూడా..!
రాజకీయ నాయకుల గెలుపోటములను సైతం ఈ అధికారులే శాసిస్తున్నారనేది దీపక్ రెడ్డి వాదన. 2019లో చంద్రబాబు నాయుడు అయినా, 2024లో జగన్మోహన్ రెడ్డి అయినా.. వారి ఓటమికి ప్రధాన కారణం ఈ బ్యూరోక్రాట్లేనని ఆయన కుండబద్దలు కొట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పాలన ఎలా ఉంది? అనే విషయాల్లో ముఖ్యమంత్రులకు తప్పుడు సమాచారం ఇచ్చి, వారిని భ్రమల్లో ముంచి, చివరికి గద్దె దించేలా చేశారనే విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీపక్ రెడ్డి అప్పుడప్పుడు వైసీపీ నేతలను ట్రోల్ చేసినా, సొంత కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా తప్పులను ఎత్తిచూపడం ఆయన ధైర్యానికి నిదర్శనమని కొందరు అంటున్నారు. అధికార యంత్రాంగం ఇకనైనా మేల్కొని, తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెబుతుందో లేక మౌనంగా ఉండి ఆ ఆరోపణలను నిజం చేస్తుందో చూడాలి.
ఒకవైపు పొగడ్తలు.. మరోవైపు పచ్చి నిజాలు!
వాస్తవానికి ఐఏఎస్ అధికారులు అంటే సమాజంలో ఒక గౌరవం ఉంది, ఎంతో మంది నిజాయితీపరులైన అధికారులు దేశం కోసం ప్రాణాలొడ్డి పనిచేస్తున్నారు. అంతేకాదు ఐఏఎస్ అధికారులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. రాత్రింబవళ్లు కష్టపడి సంక్షేమ పథకాలను అమలు చేసే నిజాయితీపరులైన అధికారులు ఎందరో ఉన్నారు. వారి వల్లనే వ్యవస్థ ఇంకా నిలబడి ఉందనేది అక్షర సత్యం. మరి అలాంటి పవిత్రమైన వ్యవస్థపై ఇన్ని నీచమైన వ్యాఖ్యలు వస్తుంటే, ఐఏఎస్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉంది? ఇలాంటి ఆరోపణలను ఎందుకు తిప్పికొట్టడం లేదు? కనీసం ఖండించలేని స్థితిలో ఉందా? లేక దీపక్ రెడ్డి చెప్పేది నిజమేనని పరోక్షంగా ఒప్పుకుంటోందా? అన్నదే ఇప్పుడు సామాన్య ప్రజల ప్రశ్న.
చరిత్ర బయటపెడతా..!
సోషల్ మీడియాలో కూడా దీపక్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. దీపక్ కూటమిలో ఉన్నా సరే, తప్పులు జరిగితే క్లియర్ గా బయటపెడతాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. " నాపై తిరుగుబాటు చేస్తే మీ చరిత్రంతా బయటపెడతా" అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే, బ్యూరోక్రాట్ల అవినీతి జాతకాలు ఆయన దగ్గర భద్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజంగానే వీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక తమ స్వార్థం కోసం వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతోంది. ఈ పొలిటికల్-బ్యూరోక్రసీ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి..!
ప్రజావాణి చీదిరాల