MLA Raj Thakur: రానున్న ఎన్నికల్లో లబ్ది కోసమే బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్..
సింగరేణి సంస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ విమర్శించారు. నేడు గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ విమర్శించారు. నేడు గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితిలోకి ప్రభుత్వాన్ని నెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఈ క్రమంలోనే 2014 నుంచి ఎంక్వైరీ కమిషన్ వేద్దామని.. సింగరేణి సంస్థను దోచుకున్నదెవరో తేల్చుకుందామంటూ బీఆర్ఎస్‌కు రాజ్ ఠాగూర్ సవాల్ విసిరారు. భూగర్భ గనులను పాతర పెట్టారని ఆయన మండిపడ్డారు. రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గనులను తెరిచి ఊరిని బొందల గడ్డగా మార్చారని బీఆర్ఎస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారానికి తెరదీస్తున్నారని రాజ్ ఠాగూర్ ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి కొత్త విద్యుత్ పరిశ్రమలను తీసుకువస్తే జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రతి దానిని రాజకీయం చేస్తూ.. సింగరేణి సంస్థను విస్తృత పరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.