MANU: పొలిటికల్ టర్న్ తీసుకున్న ఉర్దూ యూనివర్సిటీ వ్యవహారం
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మానూ) భూముల వ్యవహారంలో తెలంగాణలో పెద్ద ఎత్తున రచ్చ ప్రారంభమైంది. సదరు యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మానూ) భూముల వ్యవహారంలో తెలంగాణలో పెద్ద ఎత్తున రచ్చ ప్రారంభమైంది. సదరు యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో వివాదం చెలరేగింది. 1998లో ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిలో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసు పంపారు. ప్రభుత్వ నిర్ణయంపై అటు విద్యార్థుల నుంచి వ్యతిరేకత ప్రారంభమవగా.. దీనికి రాజకీయ పార్టీల మద్దతు తోడైంది.
ఇవాళ మానూ విద్యార్థుల ప్రతినిధులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కేటీఆర్‌తో భేటీలో విద్యార్థులు ఆయనకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసి మద్దతు కోరినట్టు సమాచారం. ఈ భూమి యూనివర్సిటీకి చాలా అవసరమని తెలిపారు. హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్స్, లైబ్రరీల నిర్మాణానికి ఈ భూమి ఉపయోగపడుతుందని తెలియజేయడంతో వారికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. ఈ విషయమై పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తరుఫున మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బీఆర్ఎస్ మద్దతు అయితే లభించింది. ప్రభుత్వంపై పోరాడేందుకు ఏ అంశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ పాలకులకు మంచి అవకాశం అయితే దొరికింది. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుందని అంటున్నారు.