T Congress: మొత్తానికి సీన్ షార్ట్ లిస్ట్ వరకూ వచ్చిందట..
అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని ఫైనల్ చేయాలి.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అకస్మిక మరణంతో ఉప ఎన్నిక (Jubleehills bypoll) జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానానికి ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. మాగంటి గోపీనాథ్ సతీమణినే తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎంపిక చేసింది. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మాత్రం అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌లో ఏ స్థానం కోసమైనా అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని ఫైనల్ చేయాలి. ఈ వడపోతకు టైం చాలా పడుతుంది. ఒక్కోసారి నామినేషన్ సమయం వరకూ అభ్యర్థి ఎంపిక కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కూడా అంతే.. మొత్తానికి సీన్ షార్ట్ లిస్ట్ వరకూ వచ్చిందని తెలుస్తోంది. దీనిని అధిష్టానానికి పంపిస్తే అధిష్టానం ఫైనల్ చేయాలి.
ఏది ఏమైనా తగ్గొద్దేలే..
ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా జూబ్లీహిల్స్ చుట్టూనే తిరుగుతోంది. ఈ స్థానం బీఆర్ఎస్‌కు సిట్టింగ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బీఆర్ఎస్, ఏది ఏమైనా తగ్గొద్దేలేదని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఎప్పటి మాదిరిగానే జూబ్లీహిల్స్ (Jubleehills) స్థానం కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారట. వారి నుంచి ఫిల్టర్ చేసి నలుగురిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫైనల్ చేశారని టాక్. రెండు రోజుల్లో ఈ పార్టీ అభ్యర్థి ఫిక్స్ అవుతుందని టాక్. రేవంత్ ఫైనల్ చేసిన నలుగురిలో నవీన్ యాదవ్ (Naveen Yadav).. అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan), సీఎన్ రెడ్డి (CN Reddy) ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) శాతాన్ని పెంచిన క్రమంలోనే జూబ్లీహిల్స్ (Jubleehills)కు సైతం దాదాపుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరికీ టికెట్ దక్కే అవకాశం ఎక్కువ..
ఇకపోతే ఫైనల్ చేసిన వారిలో నవీన్ యాదవ్ లేదంటే అంజన్ కుమార్ యాదవ్‌కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ జోరుగానే నడుస్తోంది. దీనికి కారణం వీరిద్దరికీ జూబ్లీహిల్స్‌లో పరిచయాలు ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. నవీన్ యాదవ్ వచ్చేసి గతంలో ఇక్కడి నుంచి పోటీ చేశారు. దీంతో ఆయనకు పరిచయాలు చాలా ఎక్కువ. అంజన్ కుమార్ సికింద్రాబాద్ ఎంపీ (Secunderabad MP)గా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా పరిచయాలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరికీ టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అలాగని బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) ఏమీ తక్కువ కాదు.. ఆయన కూడా గతంలో నగర మేయర్‌గా ఉన్నారు. ఆయన కూడా పరిచయాలు ఎక్కువే. ఒక్క సీఎన్ రెడ్డి మాత్రం కార్పొరేటర్‌గా మాత్రమే ఉన్నారు. అది కూడా రహమత్ నగర్ కార్పొరేటర్.. ఆయన ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. సీఎన్ రెడ్డి అయితే ముగ్గురిలో టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఈ నలుగురిలో అదృష్టవంతులెవరో తెలియాల్సి ఉంది.
ప్రజావాణి చీదిరాల