TCongress: మంత్రి భార్య చేతిలో కాంగ్రెస్ పగ్గాలు.. బలి ఇస్తేనే మేళ్లు.. అంతా అమ్మగారి దయ..!
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.. వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే హోయ.. కోట్లిస్తది కోడిని కోసిస్తే.. మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ..! అమ్మోరికి అవ్వాలని మేత..
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.. వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే హోయ.. కోట్లిస్తది కోడిని కోసిస్తే.. మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ..! అమ్మోరికి అవ్వాలని మేత.. ఏనాడో రాసేసిన రాత ఎలుగుందా రేతిరి గడిపాక హోయ..! ఇవన్నీ ఓ చిత్రంలోని సాంగ్‌లో వచ్చే క్యూట్ లైన్స్. అయితే, ఈ పాటకు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఒక సీనియర్ కాంగ్రెస్ నేత (Congress Leader), మంత్రిగారి భార్య తీరుకు సరిగ్గా పోలికలు కనిపిస్తున్నాయి.
చాలా కాలం నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి (Congress Government) రావడం, తద్వారా సదరు కట్టర్ కాంగ్రెస్ నేతతో పాటు అదే జిల్లాలో మరో ఇద్దరు నేతలను కూడా మంత్రి పదవి వరించింది. ఈ ముగ్గురిలో ఒక మంత్రిగారి పరిస్థితి చాలా విచిత్రం. పేరుకు ఆయనే మంత్రి అయినా, నియోజకవర్గంలో ఆయన ఉనికి కేవలం సంతకాలకే పరిమితం. తెరవెనుక పెత్తనం, అధికార కేంద్రం అంతా ఆయన సతీమణిదే. అవును, ఆమెనే ఆ నియోజకవర్గానికి వెరీ వెరీ పవర్‌ఫుల్ నాయకురాలు. ఆ నియోజకవర్గంలో చిన్న పని నుంచి పెద్ద పని జరగాలన్నా.. సర్పంచ్ అభ్యర్థికి టికెట్ దక్కాలన్నా, చివరికి ఒక కాంట్రాక్టు ఖరారు కావాలన్నా.. అమ్మగారి దయ తప్పనిసరి. ఇక్కడ 'అమ్మోరి' దయ కంటే, 'అమ్మగారి' దయే కీలకం అన్న మాట.
ప్రజా బలం వద్దు.. పట్టు చీర ముద్దు!
మంత్రి సతీమణి చుట్టూ ఇప్పుడు ఒక విచిత్రమైన 'గిఫ్ట్ కల్చర్' నడుస్తోంది. అమ్మగారిని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో నియోజకవర్గ నేతలకు, కాంట్రాక్టర్లకు బాగా అర్థమైపోయింది. తిరుమల నుంచి ప్రసాదంతో పాటు ఒక విలువైన కానుక తీసుకెళ్తే, ఆమె ఆనందపరవశులవుతారు. ఏ కంచీ నుంచో, వెంకటగిరి నుంచో ఖరీదైన పట్టుచీరను తీసుకెళ్లి ఇస్తే, ఆ వెంటనే ఆ వ్యక్తికి ఏం కావాలంటే అది నిమిషాల్లోనే జరిగిపోతుంది. అంతేకాదు, ఒక హైఎండ్ గిఫ్ట్ పట్టుకెళితే, కోట్లల్లో కాంట్రాక్టులు, జన బలం ఉన్నా లేకున్నా సర్పంచ్ సీటు అన్నీ ఇట్టే అయిపోతాయి. అంతా 'అమ్మోరి' దయ. ఇక్కడ నాయకత్వం, ప్రజాబలం కంటే, పంచాయతీపై పట్టున్న నేతను కాదు, పట్టుచీర గిఫ్ట్ ఇచ్చిన నేతకే ప్రాధాన్యం దక్కుతుండడం గమనార్హం. కేవలం జనబలం ఉండి, ధన బలం లేకుంటే... వారు అమ్మగారికి మరీ చులకనైపోతున్నారు, ఆమె వారిని చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ 'గిఫ్ట్-పాలిటిక్స్' ప్రభావం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మగారి మహత్స్యం చెప్పాలంటే.. ఆ నియోజకవర్గంలో మొత్తం 29 పంచాయతీలుంటే, అందులో ఏకంగా 16 మంది అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే రెబల్స్ రంగంలోకి దిగారు.
ఎందుకనీ ఇలా..?
అసలు పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన, ప్రజల్లో బలం ఉన్న పాత నేతలను పక్కనపెట్టి, కేవలం కానుకలు, పట్టుచీరలు ఇచ్చి అమ్మగారిని సంతృప్తి పరిచిన వారికే కీలక పదవులు, టికెట్లు కేటాయించడం ఈ చీలికకు ప్రధాన కారణం. అందుకే, నియోజకవర్గంలో సగానికి పైగా వార్డులు, పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీ రెబల్సే తలపడుతున్నారు. ఇక, మంత్రిగారి మరో విచిత్రమైన వైఖరి ఏమిటంటే.. ఆయన తోటి మంత్రులను సైతం తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వరు. ఆ తోటి నేత జనాల్లోకి దూసుకెళతాడనే భయం ఆయన్ని వెంటాడుతుండడంతో, ముందుగానే ముందర కాళ్లకు బంధం వేసేశారు. ఇక, నియోజకవర్గ పగ్గాలను తన సతీమణి చేతిలో పెట్టేశారు. ఆమె కారణంగా నియోజకవర్గాల్లో వచ్చిన చీలికలు, కుమ్ములాటలు అన్నీ ఇన్నీ కావు. అయినా సరే.. వారికి ఇవేమీ పట్టడం లేదు. అంతా 'అమ్మోరి' దయే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ భవిష్యత్తుకు ప్రమాదం!
సొంత పార్టీకి రెబల్స్ పెరగడం, పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి పెల్లుబకడం ఆ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదాన్ని సూచిస్తోంది. 'పట్టుచీరలు', 'గిఫ్ట్‌లు' ప్రామాణికంగా సాగుతున్న ఈ 'అమ్మగారి పెత్తనం' ఎంతకాలం సాగుతుందో, పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఈ అంతర్గత వ్యవహారంపై దృష్టి పెడుతుందో వేచి చూడాలి. లేదంటే, కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ చేతుల మీదుగానే 'అమ్మోరి' విధ్వంసం తప్పదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైనా సదరు మంత్రి జాగ్రత్తపడి సతీమణి నుంచి పెత్తనం తీసుకుని నియోజకవర్గంలో అన్నీ చక్కబెడితే సరే.. లేకుంటే రానున్న ఎన్నికల్లో ఆయనకు పుట్టగతులు ఉండవని రెబల్స్, స్థానిక నేతల హెచ్చరిస్తున్న పరిస్థితి. చూడాలి మరి మంత్రి సెట్ రైట్ చేసుకుంటారో.. లైట్ తీసుకుంటారో..!!