APNews: ఏపీలో ‘క్రెడిట్ చోరీ’ రాజకీయం.. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదా?
‘పెళ్లికొడుకు వాడు.. కానీ వాడేసుకున్న షర్ట్ మాత్రం నాది’ అని ఓ సినిమాలో రజినీకాంత్ చెబుతాడు. సినిమాలో కాబట్టి ఆ డైలాగ్ బాగా వర్కవుట్ అయ్యింది కానీ రియల్ లైఫ్‌లో అలా జరిగితే రచ్చ రంబోలానే. ప్రస్తుతం ఇలాంటి గొడవే ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.
‘పెళ్లికొడుకు వాడు.. కానీ వాడేసుకున్న షర్ట్ మాత్రం నాది’ అని ఓ సినిమాలో రజినీకాంత్ చెబుతాడు. సినిమాలో కాబట్టి ఆ డైలాగ్ బాగా వర్కవుట్ అయ్యింది కానీ రియల్ లైఫ్‌లో అలా జరిగితే రచ్చ రంబోలానే. ప్రస్తుతం ఇలాంటి గొడవే ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ప్రాజెక్టు పూర్తయినా, ఏ కంపెనీ భూమి పూజ చేసుకున్నా.. వెంటనే అటు వైపు నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటు వైపు నుంచి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ‘క్రెడిట్’ కోసం కత్తి కడుతున్నారు.
నిజానికి రాజకీయాల్లో ‘సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది’ అనే సామెత పాతదే కానీ, ఇప్పుడు ఏపీలో అది ‘శ్రమ ఒకరిది.. సీన్ ఇంకొకరిది’ అన్నట్లుగా మారిపోయింది. ఇందుగలడు అందు లేడన్న సందేహం వలదన్నట్టుగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిదీ తన హయాంలోనే జరిగిందని కలరింగ్ ఇచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కాకముందే ఇంత చేస్తే.. ఐదేళ్లలో నువ్వేం చేసినట్టని జనం అడగలేరన్న ధీమానో మరొకటో కానీ క్రెడిట్ చోరీకి మాత్రం రంగంలోకి ముందుగానే దిగుతున్నారు.
గూగుల్ నుంచి భోగాపురం దాకా..!
మొన్నటికి మొన్న విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే.. మొదట వైసీపీ నేతలు ‘అదో గాలి వార్త, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు’ అన్నారు. తీరా అది పట్టాలెక్కేసరికి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ‘అసలు ఆ విత్తనం నాటిందే నేను, అదానీతో చర్చలు జరిపిందే నా హయాంలోనే’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దానికి కూటమి ప్రభుత్వం వెంటనే కౌంటర్ ఇస్తూ.. జగన్ హయాంలో ఒక్క ఎంవోయూ కూడా జరగలేదని, చంద్రబాబు, లోకేష్ నేరుగా గూగుల్ హెడ్ ఆఫీస్ మెట్లు ఎక్కి ఒప్పించి తెచ్చారని క్రెడిట్ కొట్టేసింది. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనైతే యుద్ధం మరో రేంజ్‌కు వెళ్ళింది. మొదటి ట్రయల్ రన్ పూర్తి కాగానే.. ‘90 శాతం పనులు నా హయాంలోనే అయ్యాయి’ అని జగన్ అంటే.. ‘అసలు నీ కాలంలో గడ్డపార కూడా దిగలేదు, కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నదే నువ్వు’ అని చంద్రబాబు విమర్శించారు. 90 శాతం పనులు పూర్తైతే.. ఆ పది శాతం ఎందుకు వదిలేసినట్టో జగన్మోహన్‌రెడ్డికే తెలియాలి. దీనిపై సామాన్య జనం మాత్రం ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు’ ఈ క్రెడిట్ గొడవ ఏంటని నవ్వుకుంటున్నారు.
గ్రీన్ టూ.. బ్లూ పాలిటిక్స్!
గ్రీన్ అమ్మోనియా కంపెనీ ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇదే సీన్. ‘మేము తెచ్చిన కంపెనీకి వీళ్ళు రిబ్బన్ కట్ చేస్తున్నారు’ అని వైసీపీ అంటే.. ‘మేము ఎంవోయూలు చేసుకుని పనులు మొదలుపెడితే జగన్ ‘క్రెడిట్ చోరీ’కి రెడీగా ఉంటున్నారని కూటమి ఆరోపిస్తోంది. ఈ గొడవ చూస్తుంటే కష్టపడి కాయ కాస్తే.. పండు తినేటప్పుడు పక్కవాడు వచ్చి ఇది నా చెట్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక తాజా ఎపిసోడ్ ‘భూముల రీ-సర్వే’. 1920 నాటి రికార్డులను దుమ్ము దులిపి, వేల కోట్లు ఖర్చు పెట్టి హద్దురాళ్లు పాతించింది తానేనని వైఎస్ జగన్ చెబుతుంటే.. ఆ రాళ్లకు తమ రంగులు వేసుకుని చంద్రబాబు కొత్త ప్రాజెక్టులా ఫోజులు కొడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి సర్కార్ మాత్రం.. గత ప్రభుత్వంలో కేవలం ఫోటోలు వేసుకుని పబ్బం గడిపారు తప్ప, ఇప్పుడు తాము వందల కోట్లు ఖర్చు పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నామని చెబుతోంది. అంటే ఇక్కడ కూడా పాత సీసాలో కొత్త సారాయి పోసి తమ లేబుల్ వేసుకునే పోటీ నడుస్తోంది.
అసలు ప్రశ్న.. ఎవరికి లాభం?
ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ, పనులు నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేసినా, తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజాధనంతో కట్టే ప్రాజెక్టులకు ‘మేమంటే.. మేమే కట్టాం’ అని డబ్బా కొట్టుకోవడం అనేది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే అని సామాన్యుడికి కూడా అర్థం అవుతోంది. మంచి జరిగితే ‘మా క్రెడిట్’ అని ముందుకొచ్చే పార్టీలు.. ఏవైనా తప్పులు జరిగితే లేదా ఘటనలు జరిగితే మాత్రం ‘మ్యాన్ పైన వేసిన ముద్ర నీది.. మురికి వేసింది నువ్వు’ అన్నట్లుగా అవతలి వారి మీదకు తోసేస్తున్నాయి. క్రెడిట్ కోసం పడే తాపత్రయంలో 10 శాతం.. ప్రజల సమస్యల పరిష్కారం మీద పెడితే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేది. అంతిమంగా ప్రజలకు కావాల్సింది మేలు. అది ‘ఏ’ ప్రభుత్వం చేసినా, ‘బీ’ ప్రభుత్వం పూర్తి చేసినా.. అది ప్రజల ఆస్తి. ఈ క్రెడిట్ వార్ చూస్తుంటే ఎముక లేని నాలుక.. ఎన్నైనా చెబుతుంది అన్నట్లుగా ఉంది. పార్టీలు తమ డబ్బాలు తాము కొట్టుకోవడం ఆపి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తే.. క్రెడిట్ అనేది ప్రజలే స్వచ్ఛందంగా ఇస్తారు. అప్పటిదాకా ఈ ‘క్రెడిట్ చోరీ’ రాజకీయం ఒక వినోదభరితమైన సీరియల్‌లా సాగుతూనే ఉంటుంది!
ప్రజావాణి చీదిరాల