Chandrababu: ఆ మీడియా సంస్థల అతి ప్రేమ.. ఆకాశానికి ఎత్తుతున్నట్టా?.. గంగలో కలుపుతున్నట్టా..?
‘కుదరలేదు కానీ కుదిరితే ఆ మొంథా తుపానును తిప్పి అటు పంపించేవాడు.. కుదరలే.. కుదరేలేదంటే అది అలివికాలే’ అంటూ ఏకంగా ఓ మీడియా సంస్థ ఓనరే చేసిన కామెంట్స్ ఇవి.
‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ ఇప్పుడు మీడియా (Media) సంస్థలన్నీ ఏదో ఒక పార్టీ చెంతన చేరి మనుగడ సాగిస్తున్నాయి. మీడియా సంస్థలన్నీ ఇలాంటి దారిలోనే ఉన్నాయి కాబట్టి తప్పులేదు.. అందరికీ సమన్యాయమే. కానీ పార్టీ చెంతన చేరి మద్దతుగా నిలవడం వరకూ ఓకే కానీ అతి చేస్తేనే ఇబ్బంది. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నది ఇదే. అతి ప్రేమ కురిపిస్తూ అధికార పార్టీని స్వయంగా చిక్కుల్లో పడేస్తున్నాయి.
అవును.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది ఇదే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govenrment) అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజల్లోనూ ఎలాంటి వ్యతిరేకతా లేదు. అభివృద్ది పరంగా.. సంక్షేమ పథకాల పరంగా.. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం పరదాల మాటున కాకుండా నేరుగా ఒక సాధారణ వ్యక్తిలా జనాల్లోకి వెళుతున్నారు. ఇంతకు మించి జనాలకు ఏం కావాలి? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సైతం జనాలకు కష్టం వచ్చిందంటే అండగా నిలబడుతున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని జనాలు సైతం అక్కున చేర్చుకున్నారు. ఒకరకంగా ప్రభుత్వానికి మీడియా సపోర్ట్ కూడా అక్కర్లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న దాన్ని అలాగే చెబితే చాలు.. కానీ దానికి ఎంతో అతి జోడించి చెబుతూ ట్రోలర్స్ చేతిలో పగ్గాలు పెడుతున్నారు.
మొంథాను తిప్పి అటు పంపించేవాడు.. కుదరలే..
‘నారా వారు సమర్పించి మొంథా (Montha Cyclone) చిత్ర, విచిత్రాలు’ పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారంటే దానికి కారణం అక్షరాలా ప్రభుత్వ సపోర్టివ్ మీడియా సంస్థలనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా మూడు ఛానల్స్ చేస్తున్న అతి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ‘కుదరలేదు కానీ కుదిరితే ఆ మొంథా తుపానును తిప్పి అటు పంపించేవాడు.. కుదరలే.. కుదరేలేదంటే అది అలివికాలే’ అంటూ ఏకంగా ఓ మీడియా సంస్థ ఓనరే చేసిన కామెంట్స్ ఇవి. అంటే చంద్రబాబు అంతటి సమర్థుడని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు కానీ దీనిని ట్రోలర్స్ ఎంతలా వాడాలో అంతలా వాడేస్తున్నారు. అసలు వింటున్న వారికి ఎంత అతిగా అనిపిస్తున్నాయ్ ఈ వ్యాఖ్యలు? ఇదేమైనా బాలయ్య బాబు సినిమానా? తొడ కొట్టగానే ట్రైన్ వెనక్కిపోయినట్టు.. కుదిరితే తుపాను తిప్పి పంపించడం?.. ఇంత అతిని భరించడం కాస్త కష్టమే. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకున్నా నష్టం లేదు కానీ ఇలాంటి వాటి వలన చంద్రబాబును ఇబ్బందుల పాలు చేయడం మినహా ఏమైనా ప్రయోజనం ఉందా?
చంద్రబాబును సలహా తీసుకునే వ్యక్తి చంద్రబాబట..
ఇక మరో మీడియా సంస్థలో కీ రోల్ పోషిస్తున్న వ్యక్తి.. చంద్రబాబును గట్టిగానే పొగడాలనుకున్నారు. దానికి ‘ఎన్నో తుపానుల్లో సమర్థవంతంగా పని చేసిన వ్యక్తి.. ఒకరకంగా ఎక్కడ తుపాను వచ్చినా బయటకు చెప్పకున్నా చంద్రబాబును సలహా తీసుకునే వ్యక్తి చంద్రబాబు.. అలాంటి చంద్రబాబు కొత్తగా రాష్ట్రం ఏర్పడీ ఏర్పడగానే విశాఖను వణికించిన తుపానును కూడా పది రోజులు అక్కడే మకాం వేసి ఆయనే ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంథా తుపానును ఎదుర్కోవల్సి వచ్చింది’’ అంటూ ఉపోద్ఘాతం. చంద్రబాబును చంద్రబాబే సలహా తీసుకోవడమేంటో.. సరే ఎక్కడ తుపాను వచ్చినా అక్కడి వారు చంద్రబాబు సలహా తీసుకుంటారని సదరు మీడియా ప్రతినిధి అభిప్రాయం కావొచ్చు.. కానీ చంద్రబాబు తుపానులను ఎదుర్కోవడమేంటి? ఏమో ఆయనకే తెలియాలి. ఈ అతే కొంచెం తగ్గించుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయినా వీళ్లు ఎవరి మాట వినే రకాలు కాదులెండి.
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది..
ఇక మూడో మీడియా సంస్థలో ఒకరు కాదండోయ్ ఇద్దరు మహానుభావులున్నారు. ఇద్దరికీ ఇద్దరే ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబును పైకి లేపే యత్నం చేస్తుంటారు. అసలు చంద్రబాబుకు జాకీలు వేసి లేపాల్సిన అవసరం ఉందా? ఇలా లేపుతున్నామనుకుని అంత ఎత్తులో ఉన్న చంద్రబాబును వీరంతా కలిసి కిందకు తోస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రశంసలు కురిపించవచ్చు కానీ అంతుకు మించి చేస్తేనే ఇబ్బంది. పొగుడుతున్నామనుకున్న సదరు మీడియా సంస్థలు చేస్తున్న అతితో అవి అడ్డంగా బుక్ అవడమే కాకుండా చంద్రబాబు ప్రతిష్టను సైతం దిగజార్చుతున్నారు. అవసరమా.. ఇంత అతి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సోషల్ మీడియా ప్రస్తుతం ఎంత ఫాస్ట్‌గా ఉందో చెప్పాల్సిన పని లేదు. దాని చేతిలో పగ్గాలు పెట్టి మరీ చంద్రబాబును బదనాం చేయిస్తున్నాయి. వీటికి తోడు మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా జతయ్యాయి. మొత్తం కలిసి చంద్రబాబు ప్రతిష్టను ఆకాశానికి ఎత్తుతున్నాయా? పరువును గంగలో కలుపుతున్నాయా? అనేది వారికి వారే డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు కలుగజేసుకుని ఈ అతి ప్రేమ పేరిట.. సదరు మూడు మీడియా సంస్థలు చేస్తున్న అతిని ఆపకుంటే ఆయనకే నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల