Congress: వెంటిలేటర్‌పై కాంగ్రెస్.. కోలుకుంటుందా?
కాంగ్రెస్ పార్టీ ఈనాటిది కాదు.. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. బ్రిటీషర్లపై పోరాడి భారత్‌కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీ. అంతేకాదు..
కాంగ్రెస్ పార్టీ ఈనాటిది కాదు.. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. బ్రిటీషర్లపై పోరాడి భారత్‌కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీ. అంతేకాదు.. ఇప్పటివరకూ దేశంలో అత్యధిక కాలం అధికారాన్ని చెలాయించిన పార్టీ. ప్రస్తుతం "మునపటి రూపం మొగమెల్లా జెముడు" అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.
దాదాపు శతాబ్దన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి అపజయాలే తప్ప జయాలనేవే లేవు. "కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు" తెలంగాణ వంటి ఒకటీ అర రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. నానాటికీ దేశంలో పార్టీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇంతటి దారుణమైన పరిస్థితిని గతంలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీ చవిచూసిందే లేదు. కనీసం ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని దుస్థితి.
పొత్తులో విపత్తు..
మూలిగే నక్కపై తాటకాయ పడిన చందంగా.. ఉన్న పరిస్థితులకు తోడు పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ముఖ్య నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తూ మరింత పతనావస్థకు చేరుస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో అగ్ర నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి పరాజయాలేం కొత్త కాదు. కానీ మరీ ఇంతటి దుస్థితి మాత్రం కొత్తేనని చెప్పాలి. ప్రస్తుతం ఏ పార్టీ కూడా సింగిల్‌గా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇతర కొన్ని పార్టీల పొత్తులో ఉంది. కానీ పొత్తులో విపత్తు.. కల్లోలం చెలరేగుతోంది. ఒక్కొక్కటిగా పార్టీలన్నీ కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇక మీదట కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు చేరుతోందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే కలుగుతోంది.
ఆ నేతలేరి?
తాజాగా కాంగ్రెస్ పార్టీ తన 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని (డిసెంబర్ 28) జరుపుకుంది. ఒక పార్టీకి 140 ఏళ్ల చరిత్ర అంటే సాధారణమైనదా? అలాంటి పార్టీలో ఏమాత్రం ఉత్తేజం కానీ.. జోష్ కానీ కనిపించిందే లేదు. చివరకు పార్టీ శ్రేణులు సైతం ఈ ఆవిర్భావ దినోత్సవం విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచడమే లేదు. అసలు పార్టీకి కొన్ని దశాబ్దాల కాలం పాటు అండగా నిలిచిన నేతలు పెద్దగా లేరు. క్యాడర్ ఏమైందో తెలియదు. మొత్తానికి పార్టీ శ్రేణులంతా ఉత్సవాల పట్ల ఉదాశీనతే కనబరిచాయి. కనీసం ఎక్కడా కూడా పెద్దగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించిన దాఖలాలే కనిపించలేదు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సైతం వేడుకలు జరుగలేదు. ఇది చాలదన్నట్టుగా పార్టీలోని కీలక నేతలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
పార్టీపై వ్యతిరేకత..
దేశంలోని రాష్ట్రాల సంగతి పక్కనబెడితే కనీసం అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో సైతం ఆ సందడి కనిపించకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో అంటకాగుతున్నారు. అది చాలదన్నట్టుగా సొంత పార్టీపైనే అవకాశం దొరికినప్పుడల్లా రాళ్లేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీ అధిష్టానాన్ని మరింత కుంగదీస్తున్నాయి. శశిథరూర్ ఒక్కరేనా? అనుకుంటే.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సైతం పార్టీపై వ్యతిరేతకను కనబరుస్తుండటం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. దిగ్విజయ్ సైతం ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్‌లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్టులో మోదీ, ఆర్ఎస్‌ఎస్‌ను కలిపి ప్రశంసలు గుప్పించారు.
నేతలు చేస్తున్నదేంటి?
అక్కడితో ఆగారా? ఎక్స్‌లో మోదీ సాధారణ కార్యకర్త నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎసే కారణమంటూ ప్రశంసలు గుప్పించి దానిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీకి దిగ్విజయ్ ట్యాగ్ చేశారు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అనేలా అసలు పోస్ట్ పెట్టినందుకు కాదు.. కాంగ్రెస్ అగ్రనేతలకు ట్యాగ్ చేయడమనేది మరింత ఇబ్బందిగా మారింది. ఆ తరువాత తన వ్యాఖ్యలను అధికార వికేంద్రీకరణ గురించి చెప్పేందుకేనని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ నేతలు చేస్తున్నదేంటి? పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చేసి ఓట్ల విషయంలో జరిగిన అవకతవకలను బయటపెడితే వీరేం చేశారు. గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమైనా చేశారా? చేసేదేమీ లేకున్నా ఇలాంటి పోస్టులతో పార్టీని మరింత ఇరకాటంలో పెడుతున్నారు.
ఊపిరి పోసుకుంటుందా?
ఇక మీదట కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి? కనీసం ప్రస్తుతమున్న రాష్ట్రాల్లో అయినా ఉంటుందా? అక్కడ కూడా చతికల పడుతుందా? అంటే తెలంగాణలో అయితే ప్రస్తుతానికి రేవంత్ సారధ్యంలో బలంగానే ఉంది. పైగా బీఆర్ఎస్, బీజేపీలు బలహీనపడటం కూడా ఆ పార్టీకి ప్లస్ అని చెప్పాలి. కర్ణాటక పరిస్థితేంటి? అక్కడ పార్టీ మున్ముందు ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్న. ఇక మిగిలిన రాష్ట్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా అంతకుముందున్న కేడర్ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేదనేది అక్షరసత్యం. నాయకులు సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నది లేదు. ఎంతకూ రాహుల్‌తో పాటు ఒకరిద్దరు నేతలు మాత్రమే బండి లాగేందుకు యత్నిస్తున్నారు. మిగిలిన వారంతా లాగుతున్నట్టుగా నటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నా కొద్దీ వెంటిలేటర్ మీదకు చేరుకుంటున్న కాంగ్రెస్ కోలుకుంటుందా? తిరిగి ఊపిరి పోసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రజావాణి చీదిరాల